తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బుల్లి తెరల్లో 'బాల్యం' బందీ.. ఇదే కొనసాగితే కష్టం!

పిల్లలు బాల్యం నుంచే ఆటపాటలను మానుకుని టీవీలకు అతుక్కుపోతున్నారు. టీవీ, ఫోన్‌, ట్యాబ్‌లతో గడిపే పిల్లలు బడి వయసు నాటికి క్రమేపీ ఒంటరితనానికి అలవాటు పడతారని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. చదువు పట్ల అశ్రద్ధ, ఆటపాటల్లో అనాసక్తి కలుగుతాయని చెబుతున్నాయి. ఎక్కువ సమయంపాటు కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ తెరలతో గడిపే చిన్నారులు 'కంప్యూటర్‌విజన్‌ సిండ్రోమ్‌'కు గురవుతున్నట్లు నేత్ర వైద్యులు చెబుతున్నారు. ఇందులో నుంచి మనం బయటపడాలి. రెండువైపులా పదును ఉన్న డిజిటల్‌ మీడియా ద్వారా చెడును స్పృశించకుండా- బాధ్యత గల పౌరులుగా తయారయ్యే దిశగా చిన్నారులను, యువతను సంరక్షించుకోవాలి.

By

Published : Aug 26, 2020, 7:41 AM IST

Children spending their childhood with tv's is not a good sign in life
టీవీల్లో 'బాల్యం' బందీ.. ఇదే కొనసాగితే కష్టమే

మానవ జీవితంలో మొదటి మూడు సంవత్సరాల కాలం మనోవికాసానికి అత్యంత కీలకం. ఈ వయసులో మెదడుతో కూడిన నాడీవ్యవస్థ శరీరంలోని అన్ని అవయవాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కనీసం 18 నెలల వయసు దాటిన తరవాత మాత్రమే రంగులను, శబ్దాలను అర్థవంతంగా గుర్తించేందుకు నాడీవ్యవస్థ అనుకూలిస్తుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, తమ చుట్టూ ఉన్నవారితో మెలగడం ద్వారా చిన్నారుల్లో బుద్ధికుశలత పెరుగుతుంది. తెలివితేటలు, నైపుణ్యం, సృజనాత్మకత, క్రమశిక్షణ, విచక్షణలతో కూడిన జ్ఞాన సముపార్జన వీరి నుంచే తొలుత నేర్చుకుంటారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లోనూ టెలివిజన్‌ ఉంది. రెండేళ్లలోపు పిల్లలు టీవీలో కార్యక్రమాలు వీక్షించడం వారి ఆరోగ్యానికి హితవు కాదని 'అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌' అంటోంది. రెండు నుంచి అయిదు సంవత్సరాల్లోపు పిల్లలు రోజులో ఒక గంటకు మించి టెలివిజన్‌ చూడటం మంచిది కాదని సూచిస్తోంది. రోజులో మూడు గంటలకు పైగా టీవీ, ఫోన్‌, ట్యాబ్‌లతో గడిపే పిల్లలు బడి వయసు నాటికి క్రమేపీ ఒంటరితనానికి అలవాటు పడతారని హెచ్చరిస్తోంది. చదువు పట్ల అశ్రద్ధ, ఆటపాటల్లో అనాసక్తి కలుగుతాయని చెబుతోంది. టీవీ ప్రకటనల్లో వచ్చే అధిక క్యాలరీలతో కూడిన ఆహారం తింటూ- పసివయసులోనే ఊబకాయాన్ని పొందుతున్నారు. మంచి చెడుల విచక్షణ తెలియని వయసు కావడంతో హింస, మద్యపానం, అశ్లీలంవంటి దృశ్యాలు వారి మనసును కలుషితం చేసే ప్రమాదం ఉంది.

సాంకేతిక దిగ్గజం ఫేస్‌ బుక్‌ ఛైర్మన్‌, సీఈఓ అయిన మార్క్‌ జుకర్‌ బర్గ్‌ బాహ్య ప్రపంచాన్ని, ప్రకృతిని ఆస్వాదించాలని తన బిడ్డకు బహిరంగ లేఖ ద్వారా సూచించారు. దీన్నిబట్టి డిజిటల్‌ మీడియా ఎంతగా వెర్రి తలలు వేస్తోందో అవగతమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాలంలో డిజిటల్‌ మీడియాతో గడిపే ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారి ఉన్నట్లు యునిసెఫ్‌ ప్రకటించింది. విశ్వవ్యాప్తంగా ఆన్‌లైన్‌ సేవలను 48శాతం ప్రజలు వినియోగిస్తున్నట్లు అంచనా. అందులో 71శాతం 15 నుంచి 24 సంవత్సరాలలోపు వారే కావడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞానం విద్య, వినోదాల కోసం అనివార్యమే. నేటి తరం పిల్లలు హైస్కూల్‌ విద్య పూర్తయ్యే నాటికి టీవీలు, ఫోన్లు, వీడియో గేమ్స్‌ వల్ల మూడు సంవత్సరాల సమయాన్ని వృథా చేసుకుంటున్నట్లు పశ్చిమ దేశాల అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక సంవత్సర కాలంలో టీవీల ద్వారా వెయ్యికి పైగా హత్యలు, మానభంగాలు, ఆయుధాలను ఉపయోగించి చేసే దోపిడులను పిల్లలు వీక్షిస్తున్నట్లు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. వీరు టీవీలకు అతుక్కుపోయి ఇంటికే పరిమితం కావడంవల్ల హితులు, స్నేహితులు కరవై మానసిక వ్యాకులతకు గురవుతున్నారు. శాన్‌ డియాగో స్టేట్‌ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో పసి వయసులోనే పిల్లలు మానసిక ఆందోళన, ఒత్తిళ్లకు గురవుతున్నట్లు తేలింది. వీరు ఉద్రిక్తతలను, కోపతాపాలను అణచుకోలేక మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. ఎక్కువ సమయంపాటు కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ తెరలతో గడిపే చిన్నారులు 'కంప్యూటర్‌విజన్‌ సిండ్రోమ్‌'కు గురవుతున్నట్లు నేత్ర వైద్యులు చెబుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞాన విస్తరణతో పిల్లలకు ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. అమెరికాలో 92శాతం పిల్లలు తమ మొదటి పుట్టిన రోజు లోపే చరవాణిని వినియోగిస్తున్నట్లు అక్కడి అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. భారత్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. మరోవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు డిజిటల్‌ మీడియా సైతం గురువు పాత్ర పోషిస్తోంది. విజ్ఞానం ప్రోది చేసుకోవడానికి, సామాజికీకరణకు నేటి తరానికి ఒక ఆయుధంగా మారింది. గురుముఖంగా సాగుతున్న విద్య 'తెర' మీదకు వచ్చింది. ప్రత్యక్ష బోధన, చర్చల ద్వారానే పిల్లలకు చదువు, నైపుణ్యం బాగా అలవడతాయని 'డైరెక్టర్‌ ఆఫ్‌ ది సెంటర్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అండ్‌ టెక్నాలజీ' షెల్లీ పాస్నిక్‌ అంటున్నారు. పుస్తక పఠనం పిల్లలకు క్రియాశీలకమై మెదడుకు పని కల్పించి చురుగ్గా ఉంచుతుంది. ఊహాశక్తిని పెంచి, సృజనాత్మకతను అలవరుస్తుంది. ఆరోగ్య కరమైన నిద్రకు సహకరిస్తుంది. పశ్చిమ దేశాల అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. విలువైన కాలాన్ని హరించివేయడంతో పాటు మానసిక దౌర్బల్యానికి గురి చేస్తూ యువకుల ప్రాణాలను బలి గొంటున్న వీడియో ఆటలను నిషేధించాలి. హింస, అశ్లీల వెబ్‌సైట్ల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. రెండువైపులా పదును ఉన్న డిజిటల్‌ మీడియా ద్వారా చెడును స్పృశించకుండా- బాధ్యత గల పౌరులుగా తయారయ్యే దిశగా చిన్నారులను, యువతను సంరక్షించుకోవాలి.

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌

(రచయిత- వైద్య రంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details