తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బాల్యాన్ని చిదిమేస్తున్న 'నీలి' సంస్కృతి - చిన్నారులపై నేరాలు

బాలలతో నీలి చిత్రాల తయారీ (చైల్డ్‌ పోర్నోగ్రఫీ) వ్యవస్థీకృత రూపం సంతరించుకుంటోంది. ఈ జాడ్యం రోజురోజుకూ విస్తరిస్తూ.. చిన్నారులపై లైంగిక అకృత్యాలు, వారి అక్రమ రవాణా, అపహరణ వంటి నేరాలు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. మన దేశంలో ప్రతి 40 సెకన్లకు ఒక నీలిచిత్ర వీడియో తయారవుతోంది. అందులో 38 శాతం బాలలకు సంబంధించినవే ఉండటం ఆందోళనకర పరిణామంగా దాపురించింది.

child abusing
child abusing

By

Published : Dec 4, 2021, 7:28 AM IST

చిన్నపిల్లలను లైంగిక వస్తువులుగా మారుస్తూ- వారి బాల్యాన్ని, జీవితాన్ని చిదిమేస్తున్న ముఠాల దాష్టీకం సమాజానికి పెనుసవాలుగా మారుతోంది. అత్యంత హేయమైన నేరాల్లో ఒకటైన బాలలతో నీలి చిత్రాల తయారీ (చైల్డ్‌ పోర్నోగ్రఫీ) వ్యవస్థీకృత రూపం సంతరించుకోవడమే కాకుండా, రోజురోజుకూ విస్తరిస్తోంది. చిన్నారులపై లైంగిక అకృత్యాలు, వారి అక్రమ రవాణా, అపహరణ వంటి నేరాలు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. స్మార్ట్‌ఫోన్లు, అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత తదితరాల వల్ల బాలల నీలిచిత్రాల తయారీ పెచ్చరిల్లుతోంది. కొన్ని ముఠాలు చిన్నారుల జీవితాల్ని బలిచేసి వేల కోట్ల రూపాయల విలువైన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలకు పట్టుబడకుండా కొన్ని వెబ్‌సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో ఆ దందా కొనసాగుతోంది. ఆ విష సంస్కృతిలో భాగస్వాములైన వారిపై సీబీఐ ఇటీవల దాడులు నిర్వహించింది. ఒకే రోజు 77 ప్రాంతాల్లో 83 మందిపై 23 కేసులు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లోని అయిదు వేల మందికి పైగా నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో 50 గ్రూపులు ఏర్పాటు చేసుకుని వాటిలో బాలలతో తీసిన నీలి చిత్రాలను పంచుకుంటున్నట్లు దర్యాప్తులో గుర్తించింది. అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసింది.

వేగంగా వృద్ధి

ఓ అధ్యయనం ప్రకారం- బాలల నీలి చిత్రాల వీడియోలను ప్రదర్శిస్తున్న వెబ్‌సైట్లపై 1998లో ప్రపంచవ్యాప్తంగా మూడు వేల కేసులు నమోదయ్యాయి. ఆ సంఖ్య 2008లో లక్షకు, 2014లో 10 లక్షలకు చేరింది. నిరుడు ఏకంగా 2.17 కోట్ల కేసులు వెలుగుచూశాయి. 'నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌' గణాంకాల ప్రకారం- ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ఆన్‌లైన్‌ వ్యాపారాల్లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ ప్రధానమైనది. నీలి చిత్రాల తయారీదారులు, వినియోగదారులు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఒకటి. మన దేశంలో ప్రతి 40 సెకన్లకు ఒక నీలిచిత్ర వీడియో తయారవుతోంది. అందులో 38 శాతం బాలలకు సంబంధించినవే. అమెరికాకు చెందిన 'తప్పిపోయిన, దోపిడికి గురైన బాలల జాతీయ కేంద్రం (ఎన్‌సీఎంఈసీ)', కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఉమ్మడి అధ్యయనం ప్రకారం- గతేడాది జనవరి నుంచి మే మధ్యలో దాదాపు 25 వేలకు పైగా చిన్నారుల అశ్లీల దృశ్యాల వీడియోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అయినట్లు తేలింది. చిన్నారుల నీలిచిత్రాలు అధికంగా అప్‌లోడ్‌ అవుతున్న నగరాల్లో దిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తరవాతి వరసలో కోల్‌కతా, చెన్నై, ముంబయి, భువనేశ్వర్‌ వంటి నగరాలున్నాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం, బాలలతో నీలి చిత్రాల వ్యాపార నేరాభియోగాలపై గతేడాది దేశవ్యాప్తంగా 738 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 161, మహారాష్ట్రలో 123, కేరళలో 101, ఒడిశాలో 71 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో ఏడు చొప్పున కేసులు వెలుగుచూశాయి. అంతర్జాలంలో వెల్లువెత్తుతున్న అశ్లీల దృశ్యాల వీక్షణ కొందరిలో రుగ్మతగా మారి, వ్యక్తిగత సామాజిక విపరిణామాలకు దారితీస్తోంది. నేరప్రవృత్తికి కారణమవుతోంది. తెలంగాణలోని వరంగల్‌లో తల్లి పక్కన ఆదమరిచి నిద్రిస్తున్న ఓ ఆరు నెలల చిన్నారిని ఒక యువకుడు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై పదిహేనేళ్ల బాలుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. పైన పేర్కొన్న కేసుల్లోని ఇద్దరు నిందితుల్ని పోలీసులు విచారించినప్పుడు చిన్నపిల్లల నీలిచిత్రాల వీక్షణ అలవాటే వారిలో ఆ నేర ప్రవృత్తికి దారితీసిందని తేలింది. అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడిన తన కుమారుడు ఎంతచెప్పినా మారట్లేదన్న కోపంతో హైదరాబాద్‌లో ఓ తండ్రి తన 19 ఏళ్ల కొడుకు చేయి నరికేశాడు.

దేశాల మధ్య సమన్వయం కీలకం

చిన్నారులపై అశ్లీల దృశ్యాల చిత్రీకరణ నైతికతకు మాయని మచ్చగా మారుతోంది. ఆయా నేర ముఠాలకు ముకుతాడు వేసేందుకు ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, పరస్పర సమాచార మార్పిడి, సమన్వయ విధానాలు అవసరం. వారి ఆర్థిక మూలాల్ని గుర్తించి స్తంభింపజేసే చర్యలు చేపట్టాలి. అంతర్జాలంలో ఆ జాడ్యానికి సంబంధించిన వీడియోల లభ్యత లేకుండా చేయాలి. నిబంధనల ఉల్లంఘనలకు ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లను బాధ్యుల్ని చేయాలి. సామాజిక మాధ్యమాల ద్వారా అశ్లీల దృశ్యాల వ్యాప్తి, పంపిణీ అధికంగా ఉంటున్నాయి. ఆయా సంస్థల భాగస్వామ్యంతో వాటికి అడ్డుకట్ట వేయించగలగాలి. 'డార్క్‌నెట్‌'లో సాగుతున్న దందాను గుర్తించేందుకు జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక వ్యవస్థలను రూపొందించుకోవాలి. కొంతమంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అశ్లీల దృశ్యాలను అంతర్జాలంలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అలాంటి చర్యలను మరింత తీవ్రంగా పరిగణించాలి. ఈ వికృత వ్యాపారాన్ని అడ్డుకునేందుకు కేరళ పోలీసులు 'పి-హంట్‌' పేరిట, మహారాష్ట్ర పోలీసులు 'ఆపరేషన్‌ బ్లాక్‌ ఫేస్‌' పేరిట ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. ఈ జాడ్యాలకు మూలాలను గుర్తించి వాటిని నాశనం చేయగలగాలి. ఈ వ్యవస్థీకృత విష వ్యాపారానికి అడ్డుకట్ట పడేదప్పుడే!

నేరాన్ని బట్టి శిక్ష అవసరం

చిన్నారులతో అశ్లీల దృశ్యాలను చిత్రీకరించడం ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67బి ప్రకారం నేరం. 18 ఏళ్ల లోపు వయసున్న వారికి సంబంధించిన నీలిచిత్రాల తయారీ, వీక్షణ, అంతర్జాలంలో వాటి కోసం వెతుకులాట, ఆ దృశ్యాలను ఇతరులతో పంచుకోవడం, వ్యాపార నిర్వహణ సైతం నేరాలే. మొదటిసారి నేర నిరూపణ అయితే అయిదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారీ నేరానికి పాల్పడితే ఏడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. నీలిచిత్రాల వీక్షణ నేరానికి... తయారీ, వ్యాప్తి నేరాలకు ఒకే తరహా శిక్ష ఉంది. నేర తీవ్రత ఆధారంగా అధిక శిక్ష ఖరారు చేసే దిశగా చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఈ చట్టాలు ఉన్నప్పటికీ... నేరగాళ్లను పట్టుకునేలా వాటిని అమలు చేయడం, ఆధారాలతో నేరాన్ని నిరూపించడం సవాలుగా మారుతున్నాయి. ఇది నేరాల విస్తరణకు మరింత ఆస్కారమిస్తోంది. ఇంటర్‌పోల్‌లో 184 దేశాలకు సభ్యత్వం ఉండగా... వాటిలో సగానికి పైగా దేశాల్లో బాలలతో అశ్లీల దృశ్యాల చిత్రీకరణను నేరంగా పరిగణించే ప్రత్యేక చట్టాలు లేవు. మరికొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నా, సమర్థంగా అమలు కావడంలేదు. కేవలం 45 దేశాల్లో మాత్రమే సమగ్ర చట్టాలున్నాయి.

- గేదెల భరత్‌కుమార్‌

ABOUT THE AUTHOR

...view details