రాకాసి కరోనా విలయం ఏడాదిగా గురువులు, విద్యార్థుల ప్రత్యక్ష అనుబంధానికి తెర దించింది. తొలిదశ వైరస్ కల్లోలంతో ఆసేతు హిమాచలం మూతపడిన పాఠశాలలు, ఆ తరవాత కొన్నిచోట్ల తెరుచుకున్నా- మలి దశ విజృంభణతో వెంటనే మూతపడ్డాయి. విద్యాలయాల మూసివేతతో చిన్నారుల మానసిక ఆరోగ్యం గణనీయంగా ప్రభావితమైందని పార్లమెంటరీ స్థాయీసంఘం ఆందోళన వ్యక్తంచేసింది. విద్యార్థుల జ్ఞాన పునాదులు బీటలు వారాయని, డిజిటల్ ఉపకరణాలు అందుబాటులో లేని గ్రామీణ, పేద, అట్టడుగు వర్గాల పిల్లలకు ఇది పెనుశాపంగా పరిణమించిందని ఆవేదన వెలిబుచ్చింది. బడికి దూరమై ఎందరో బాలికలు పెళ్ళిపీటలకు చేరువవుతుండగా, మరికొందరు ఇంటి చాకిరిలో మగ్గిపోతున్న దైన్యాన్ని విశదీకరించింది.
ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో పాఠశాలలు ఇప్పటికే పునఃప్రారంభమయ్యాయి. చాలాచోట్ల తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు పాఠాలు బోధిస్తున్నారు. ఏపీలో సోమవారం నుంచి బడి తలుపులు తెరుచుకోనుండగా, తెలంగాణలోనూ ప్రత్యక్ష తరగతులను పట్టాలెక్కించడానికి తగిన సమయం ఇదేనని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. మూడో ఉద్ధృతిపై ముప్పిరిగొంటున్న భయాలతో పిల్లలను పాఠశాలలకు పంపడానికి దాదాపు సగం మంది తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల మొదట్లో పాఠశాలలను తిరిగి తెరిచిన హిమాచల్ ప్రభుత్వం- కొవిడ్ కోరల్లో చిక్కుకున్న చిన్నారుల సంఖ్య పోనుపోను పెరుగుతుండటంతో విద్యాలయాల మూసివేతకు ఆదేశాలిచ్చింది. ప్రత్యక్ష బోధనను ప్రారంభించదలిస్తే ప్రాథమిక తరగతులతో ఆరంభించడం మేలని ఐసీఎంఆర్ సూచించింది. తద్భిన్నమైన విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలు- మహమ్మారి బారిన పడకుండా పిల్లలను ఎలా కాచుకుంటాయన్నది అందరి మదినీ తొలిచేస్తున్న ప్రశ్న!
మూడో ఉద్ధృతి ఉంటే..
మహమ్మారి మూడో ఉద్ధృతి ఈ నెలలోనే ఆరంభమై అక్టోబరు నాటికి తారస్థాయికి చేరుతుందన్నది హైదరాబాద్, కాన్పూర్ ఐఐటీ పరిశోధకుల అధ్యయన సారాంశం. దీన్ని ధ్రువీకరిస్తూ ఆర్ ఫ్యాక్టర్ పైపైకి ఎగబాకుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న డెల్టాకు- డెల్టాప్లస్, ఆల్ఫా, బీటా, గామా రకాలూ జతపడి తరుముకొస్తున్న తరుణంలో ఉత్తరాఖండ్ వంటివి ఆంక్షల బాట పడుతున్నాయి. పంజాబ్, హరియాణా విద్యాలయాల్లో పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి.
సార్స్ కోవ్-2 పాజిటివిటీ రేటు పెద్దల కంటే పిల్లల్లో స్వల్పమని ఎయిమ్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త అధ్యయనంలో తేలినా- ఇజ్రాయెల్‌లో తరగతులకు హాజరైన పిల్లల ద్వారా కుటుంబసభ్యులను వైరస్ కమ్మేసింది. జనబాహుళ్యంలో సింహభాగానికి టీకా రక్షణ కల్పించాకే ప్రత్యక్ష తరగతులకు వెళ్ళాలని నీతిఆయోగ్ గతంలో సూచించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11.78 కోట్ల మందికే వ్యాక్సిన్ రెండు డోసులు అందాయి.
ఉపాధ్యాయుల్లో యాభై శాతానికే టీకా అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చిన్నారులకు వ్యాక్సిన్ల అందజేత ఈ మాసంలోనే ఆరంభం కావచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. చాలా పాఠశాలల్లో ఇరుకు గదులు, నీటి వసతి లేమికి తోడు బడులు తెరుచుకొంటే కిక్కిరిసిన ఆటోలు, బస్సుల్లో పిల్లలు ప్రయాణించాల్సి రావడం తల్లిదండ్రుల్లో గుబులు రేపుతోంది. ఈ క్రమంలో తరగతుల నిర్వహణలో వంతుల వారీ విధానానికి పార్లమెంటరీ సంఘం ఓటేస్తోంది. విద్యార్థులు మార్గదర్శకాలు పాటించేలా చూడాలని, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు, ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు అందుబాటులో ఉంచాలంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాల నిర్ణయాలకు చిన్నారుల భద్రతే ప్రామాణికం కావాలి. కనీస వసతుల కొరతతో కునారిల్లుతున్న సర్కారీ విద్యాలయాలను ముందు ఒడ్డున పడేయాలి. అప్పుడే భావిభారతం బంగరు భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది!
ఇదీ చదవండి:సోనియా నేతృత్వంలో విపక్షాల ఐక్యతా రాగం!