తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అధ్యాపక కొలువుల ఖాళీలపై కేంద్రం దృష్టి - central govt latest news

దేశంలోని 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎకాయెకి 40శాతం పైగా ఖాళీలతో కునారిల్లుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ క్రోడీకరించిన అధికారిక గణాంకాల ప్రకారం ఒడిశా విశ్వవిద్యాలయంలో 89శాతం, అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో రమారమి 70శాతం ఖాళీలు పేరుకుపోయాయి. హరిసింగ్‌గౌర్‌, కశ్మీర్‌ విశ్వవిద్యాలయాల్లో 50శాతానికి పైగా కొలువులు భర్తీ కాకుండా పడి ఉన్నాయి. మొత్తం 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ ఓబీసీ కోటాలో 55శాతం, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకించిన పోస్టుల్లో 40శాతం దాకా భర్తీ కావాల్సి ఉంది. దీంతో అధ్యాపక కొలువుల ఖాళీలపై కేంద్రం తాజాగా దృష్టి సారించింది.

central govt concentrated on filling the vacancies of teaching faculty
అధ్యాపక కొలువుల ఖాళీలపై దృష్టి సారించిన కేంద్రం

By

Published : Aug 27, 2021, 7:34 AM IST

ప్రపంచ విజ్ఞాన అమేయశక్తిగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో నూతన జాతీయ విద్యావిధానాన్ని ఆవిష్కరించిన కేంద్రప్రభుత్వం, అధ్యాపక కొలువుల ఖాళీలపై తాజాగా దృష్టి సారించింది. వచ్చే గురుపూజోత్సవం (సెప్టెంబరు అయిదో తేదీ) నుంచి ఏడాది గడువులోగా కేంద్రం నుంచి నిధులు పొందే ఉన్నత విద్యా సంస్థలన్నింటా బోధన సిబ్బంది ఖాళీలు భర్తీ కావాలని నిర్దేశించింది. ముఖ్యంగా రిజర్వ్‌డ్‌ శ్రేణులకు చెందిన నియామకాలు చురుకందుకోవాలని, నెలవారీ చర్యల నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు పంపించాలన్నది సర్కారీ ఉత్తర్వుల సారాంశం.

40 శాతం ఖాళీలు..

దేశంలోని 15 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎకాయెకి 40శాతం పైగా ఖాళీలతో కునారిల్లుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ క్రోడీకరించిన అధికారిక గణాంకాల ప్రకారం ఒడిశా విశ్వవిద్యాలయంలో 89శాతం, అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో రమారమి 70శాతం ఖాళీలు పేరుకుపోయాయి. హరిసింగ్‌గౌర్‌, కశ్మీర్‌ విశ్వవిద్యాలయాల్లో 50శాతానికి పైగా కొలువులు భర్తీకాకుండా పడిఉన్నాయి. మొత్తం 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోనూ ఓబీసీ కోటాలో 55శాతం, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకించిన పోస్టుల్లో 40శాతం దాకా భర్తీ కావాల్సి ఉంది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల జాబితాలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలలోనూ బోధన సిబ్బంది కొలువులనేకం ఖాళీగా పోగుపడి ఉన్నాయి. సమస్య అక్కడికే పరిమితం కాలేదు. దేశంలోని లక్షలాది ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ బోధన సిబ్బందికి నిత్యక్షామం తాండవిస్తోంది. లబ్ధప్రతిష్ఠ సంస్థల్లోనే పెద్దయెత్తున అధ్యాపక ఖాళీలు వెక్కిరిస్తుండగా- కేంద్ర ఆర్థిక సాయం పొందే ఉన్నత విద్యాలయాల్లో నియామకాల క్రతువు ఏడాదిలో ఒక కొలిక్కి రావాలని ప్రభుత్వం లక్షిస్తోంది. అంతవరకైనా, ఇప్పటికిప్పుడు మేలిమి గురువులు ఎలా దొరుకుతారు?

అంతర్జాతీయ ర్యాంకుల్లో వెనుకంజ అందుకే..

ముడిలోహంలాంటి శిష్యుణ్ని బంగారంగా మార్చగల పరసువేది- గురువు. అందువల్లే, ఏ దేశ భవితవ్యమైనా తరగతి గదుల్లోనే ఉందంటారు. జాతి నిర్మాణంలో సమర్థ బోధకుల ప్రాముఖ్యమెంతటిదో గుర్తించిన ఫిన్లాండ్‌ ప్రభృత దేశాలెన్నో పకడ్బందీ కార్యాచరణతో సమున్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. అత్యుత్తమ విద్యాప్రదర్శనలకు నెలవులవుతున్నాయి. అందుకు విరుద్ధంగా ఇక్కడ ప్రాథమిక దశనుంచి ఉన్నత విద్యారంగం వరకు భిన్న అంచెల్లో బోధకుల కొరత వేధిస్తోంది. అంతర్జాతీయంగా విశ్వవిద్యాలయాల ర్యాంకింగుల్లో ఇండియా వెలాతెలాపోవడానికి పుణ్యం కట్టుకుంటున్న అంశాల్లో, బోధన సిబ్బంది కొరతా ఒకటి. రాష్ట్రాలవారీగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అర్హులైన బోధన సిబ్బంది కొరవడి ఏళ్లతరబడి ఒప్పంద అధ్యాపకులతో నెట్టుకురావడం పరిపాటిగా మారింది. తగినన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులున్నా- సంక్లిష్ట ఎంపిక ప్రక్రియ, రాజకీయ జోక్యం, నియామకాలపై ఇతరత్రా ఒత్తిళ్లతో నిరీక్షణలోనే పొగచూరిపోతున్న జీవితాలెన్నో!

మరోవైపు సరైన శిక్షణ లేని బోధన సిబ్బంది 11 లక్షలదాకా లెక్కతేలారన్న మునుపటి విద్యామంత్రి ప్రకటన, బడిచదువులు దుర్బలం కావడానికి మూలకారణమేమిటో తేటపరచింది. అట్టడుగు దశనుంచి ఉన్నత విద్యారంగందాకా అత్యుత్తమ బోధన సమకూర్చే సిబ్బంది ఎంపిక, శిక్షణల నిమిత్తం ఐఐటీలు, ఐఐఎమ్‌ల స్థాయిలో ప్రత్యేక వ్యవస్థ నొకదాన్ని అవతరింపజేయాలి. ఎప్పటికి ఏ అంచెలో ఎందరు విద్యార్థులుంటారు, వారికి ఎంతమంది గురువులు అవసరమో శాస్త్రీయంగా మదింపు వేయాలి. ఆ ప్రకారం నియామకాలు, ఎప్పటికప్పుడు ప్రమాణాల మెరుగుదల కోసం నిరంతర శిక్షణ చేపడుతుండాలి. పునాది చదువుల్ని దృఢతరం చేసి ఉన్నత విద్యారంగాన్నీ తేజరిల్లజేయగల భేషయిన మార్గమిది!

ఇదీ చూడండి:ప్రభుత్వ బడుల్లో చదివితే 7.5% రిజర్వేషన్

ABOUT THE AUTHOR

...view details