దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రబలి, పట్టణాల్లో పుంజుకొంటున్న దశల్లో ఈ మహమ్మారి గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయి. కనుక తగిన కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలి. కరోనా విస్తృతి రెండు, మూడో దశల్లో ఉందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన దరిమిలా దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ అయిన గ్రామీణ భారతాన్ని కాపాడుకోవడానికి కట్టుదిట్టమైన వ్యూహం అవసరం.
కరోనా కట్టడిలో జన భాగస్వామ్యం కీలకం
వందలు వేల సంఖ్యలో గ్రామాలకు తరలివస్తున్న కార్మికుల ఆరోగ్యస్థితిని తొలుత అంచనా వేయాలి. అందరినీ విధిగా స్వీయ నిర్బంధంలో ఉంచాలి. అందుకోసం తగిన వసతి సదుపాయాలు కల్పించాలి. నిరంతర పర్యవేక్షణా అవసరమే. వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఏర్పాట్లు ఎంతో కీలకం. పరీక్షలో పాజిటివ్ వస్తే వయసును బట్టి చికిత్స, వైద్యుల పర్యవేక్షణ అవసరం. పల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సదుపాయాలు ఉండవన్నది నిష్ఠుర సత్యం. కానీ, సకాల వ్యాధి నిర్ధారణలో విఫలమైతే అది వేగంగా ఇతరులకు సంక్రమించే ప్రమాదం ఉంది.
స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని ప్రాంతాలు వైరస్‌కు ‘హాట్‌స్పాట్’లుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలన్నీ నగర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. వ్యాధి పల్లెల వరకు విస్తరించిందంటే ఈ స్థాయి సదుపాయాలు, ప్రభుత్వ యంత్రాంగం అందుబాటు ప్రశ్నార్థకమే. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం క్రియాశీలత ఎంతో అవసరం.
ముందస్తు కార్యాచరణ అవసరం
స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ఎక్కడికక్కడ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రజలను చైతన్యపరచాలి. రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా పాలన యంత్రాంగం ఆదేశాలిచ్చేవరకు వేచిచూడకుండా అందుబాటులో ఉన్న వనరులతో తక్షణం కార్యరంగంలోకి దిగేలా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీలు, స్వయం సహాయక బృందాలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది సమన్వయంతో తక్షణ కార్యాచరణ ప్రారంభించాలి. ఇప్పటి నుంచే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. వర్షకాలంలో ఎదురయ్యే సమస్యలపై స్థానికులకే అవగాహన ఉంటుంది. అందుకోసం చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాలి. పరిసరాలను శుభ్రపరచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత విషయంలో ఇంటింటా అందరిలో అవగాహన కల్పించాలి. ఇప్పుడు అమలవుతున్న లాక్‌డౌన్ ఎత్తేస్తే గ్రామసీమలు హాట్‌స్పాట్లుగా మారతాయన్న అధ్యయనాల సారాంశాన్ని ప్రమాద ఘంటికగా భావించాలి. అదే జరిగితే కరోనా సామూహిక వ్యాప్తికి బీజం పడి, పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల స్థానిక సంస్థలు గురుతర బాధ్యతతో వ్యవహరించాలి. పరిమిత వనరులను సమర్థంగా వినియోగించుకోవాలి.