తెలంగాణ

telangana

ETV Bharat / opinion

గుప్పుమంటున్న గంజాయి- యథేచ్ఛగా సాగు, రవాణా - గంజాయి మాఫియాలు

విశాఖ మన్యం, అరకు, లంబసింగి, సీలేరు పరిసరాలతో పాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఊటీ తరహా వాతావరణం ఉండటంతో గంజాయి సాగు పెరిగింది. ఊటీ నుంచి వచ్చి స్థిరపడిన కొంతమంది స్థానికంగా గంజాయి సాగును ఒక వ్యాపారంగా మార్చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అటవీ పరిధిలో చాలా చోట్ల గంజాయిని పండిస్తున్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి, గుత్తేడు ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏడు మండలాల్లోనూ గంజాయి ఆనవాళ్లు కనపడుతున్నాయి. డొంకరాయి, సీలేరు పరిసరాల్లో సరకును ముఠాలు నదీమార్గంలో తరలిస్తున్నారు. తెలంగాణలో ఏటూరునాగారం, నర్సంపేట, భూపాలపల్లి, నారాయణ్‌ఖేడ్‌, జహీరాబాద్‌ తదితర ప్రాంతాల్లోనూ గంజాయి గుప్పుమంటోంది.

Cannabis
గంజాయి

By

Published : Nov 11, 2021, 5:19 AM IST

Updated : Nov 11, 2021, 5:44 AM IST

దేశంలో గంజాయి వినియోగం రోజురోజుకీ పెచ్చరిల్లుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాని సాగు వ్యవస్థీకృతమైంది. ఆంధ్రలో మాఫియా ముఠాలు 25 వేల ఎకరాల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువచేసే గంజాయిని పండిస్తున్నట్లు కథనాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలో గంజాయిని కట్టడి చేయడంపై గత నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అటవీ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాలు రద్దు చేస్తామని... రైతు బంధు, బీమా వంటివి నిలిపేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.

సరఫరాకు ప్రత్యేక యాప్‌!

ఆంగ్లేయుల కాలంలో ఉదకమండలానికే(ఊటీ) పరిమితమైన గంజాయి, ఆ తరవాత తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. విశాఖ మన్యం, అరకు, లంబసింగి, సీలేరు పరిసరాలతో పాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఊటీ తరహా వాతావరణం ఉండటంతో సాగు పెరిగింది. ఊటీ నుంచి వచ్చి స్థిరపడిన కొంతమంది స్థానికంగా గంజాయి సాగును ఒక వ్యాపారంగా మార్చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అటవీ పరిధిలో చాలా చోట్ల గంజాయిని పండిస్తున్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి, గుత్తేడు ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిసిన ఏడు మండలాల్లోనూ గంజాయి ఆనవాళ్లు కనపడతాయి. డొంకరాయి, సీలేరు పరిసరాల్లో సరకును ముఠాలు నదీమార్గంలో తరలిస్తుంటాయి. తెలంగాణలో ఏటూరునాగారం, నర్సంపేట, భూపాలపల్లి, నారాయణ్‌ఖేడ్‌, జహీరాబాద్‌ తదితర ప్రాంతాల్లోనూ గంజాయి గుప్పుమంటోంది. చెన్నంపేట, చింతపల్లి, దేవరకొండ, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు చుట్టుపక్కలా అక్రమ కార్యకలాపాలు జోరెత్తుతున్నాయి. ఎకరా గంజాయి సాగుకు రూ.30వేలు ఖర్చయితే- దిగుబడి రూపంలో ఆరు లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. దానికి ఆశపడి చాలామంది ఆ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి ఆ సొమ్మంతా వ్యాపారులే స్వాహాచేస్తారు. కేసుల్లో ఇరుక్కోవడం తప్ప సాగుదారులకు ఆర్థికంగా ఒనగూడేది ఏమీ ఉండదు. గంజాయి సాగును కట్టడి చేయగల స్థాయిలో కఠిన చర్యలు పట్టాలకు ఎక్కడం లేదు. కొన్ని జిల్లాల్లో రాజకీయ నాయకులే గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారని, రవాణాకు సహకరిస్తున్నారన్న కథనాలు వెలుగు చూస్తున్నాయి. వారికి డబ్బులు ముట్టచెబితే చాలు... గంజాయి ఏ ఇబ్బందీ లేకుండా తరలిపోయే దుస్థితి నెలకొంది. రంపచోడవరం ప్రాంతం నుంచే వారానికి పది లోడుల గంజాయి అలా ఇతర ప్రాంతాలకు వెళ్తోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల స్మగ్లర్లు- ఏపీలోని సాగుదారులతో ఒప్పందాలు చేసుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

దేశంలో గంజాయి, దాని అనుబంధ పదార్థాల వినియోగాన్ని నిషేధించినా- చరస్‌, హషీష్‌, భంగ్‌ వంటి రూపాల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అది చాలా సులభంగా లభ్యమవుతోంది. ద్రవ రూపంలో, ఆయుర్వేద ఔషధాలు, చాక్లెట్లు, ప్రొటీన్‌ పౌడర్‌ తరహాలో ప్యాక్‌ చేసి అమ్మకాలు చేస్తున్నారు. బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల నుంచి ఆ తరహా ఉత్పత్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల పోలీసులు పట్టుకున్న కొన్ని కేసులను పరిశీలిస్తే- గంజాయి వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో తేటతెల్లమవుతుంది. గత ఆగస్టులో తెలంగాణ పోలీసులు 3400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు నెలలో రూ.8.5 కోట్ల విలువ చేసే నాలుగు వేల కిలోల సరకును భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో పట్టుకున్నారు. ఏప్రిల్‌లో విశాఖ జిల్లా చోడవరం నుంచి వెళ్ళిన మూడు టన్నుల గంజాయిని తెలంగాణ పోలీసులు స్వాధీనపరచుకున్నారు. గాంధీ జయంతి నాడు మత్తుమందుల నిరోధక విభాగం(ఎన్‌సీబీ) అధికారులు బెంగళూరులో 140 కిలోల హైగ్రేడ్‌ గంజాయిని పట్టుకున్నారు. ఒక ప్రత్యేక యాప్‌ ద్వారా నగరంలో గంజాయిని సరఫరా చేస్తున్నట్టు వారు గుర్తించారు. ఏపీలో సెబ్‌(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) ఏర్పాటు అయ్యాక ఏడాదిన్నర వ్యవధిలోనే 2.70 లక్షల కిలోల గంజాయి పట్టుబడింది. అక్రమార్కులు గిరిజన యువతను, విద్యార్థులను గంజాయి రవాణాకు వాడుకుంటున్నారని; స్మగ్లర్ల మీద 2039 కేసులు నమోదు చేసి 5411 మందిని అరెస్టు చేశామని సెబ్‌ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ వెల్లడించారు. పశ్చిమ్‌ బెంగాల్‌, బిహార్‌, సిక్కిం, మిజోరం, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల్లోనూ గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది.

కూకటివేళ్లతో పెకలించాలి

దేశవ్యాప్తంగా గంజాయిని వివిధ రూపాల్లో వినియోగిస్తున్నవారు మూడు కోట్లకు పైగా ఉన్నారని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సర్వేలో వెలుగు చూసింది. వాస్తవంలో ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు. పదేళ్ల నుంచి 75 సంవత్సరాల వయసు గల వారి వరకు గంజాయిని సేవిస్తున్నారు. ముఖ్యంగా యువత, కళాశాల విద్యార్థులు దీనికి ఎక్కువగా బానిసలవుతున్నారు. ప్రభుత్వాలు తలచుకుంటే గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించవచ్చు. ఆ దిశగా పటిష్ఠ కార్యాచరణ లోపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ద్వారా గతంలో ఏపీలోని మన్యం ప్రాంతాల్లో గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు. ఆ సమయంలో ఆ పంట బాగా తగ్గిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. గంజాయిని అరికట్టడంలో సర్పంచులను భాగస్వాములను చేస్తే- ఎవరి పరిధిలో వారు దాని సాగు జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలరు. వారికి అది సాధ్యం కాకపోతే కలెక్టర్లు జోక్యం చేసుకుని, కఠిన నిర్ణయాలతో సాగును అడ్డుకోవచ్చు. పోలీసుల్లో చాలామంది గంజాయిని ఆదాయ వనరుగా భావిస్తున్నారే తప్ప- దాని వల్ల సమాజానికి వాటిల్లుతున్న నష్టాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజారోగ్యాన్ని గుల్లబారుస్తున్న గంజాయి సాగు, వినియోగాలను సమూలంగా అడ్డుకోవడం అత్యవసరం. నాయకులు, అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు!

ప్రాణాలకే ప్రమాదకరం

గంజాయి వాడకం అనేక అనర్థాలకు దారితీస్తుంది. బాధితుల్లో ఆందోళన, గుండె దడ, గుండెపోటు, మానసిక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలం గంజాయి తీసుకుంటే కానబనాయిడ్‌ హైపరమెసిస్‌ సిండ్రోమ్‌ (సీహెచ్‌ఎస్‌) అనే రుగ్మతతో బాధపడతారు. పదే పదే వికారం కలుగుతూ వాంతులవుతాయి. కొన్ని సందర్భాల్లో అది మరణానికీ దారితీస్తుంది. ఒకటి రెండు వారాలు గంజాయి తీసుకుని ఆపేసిన వారిలోనూ భయం, వణుకు, నిద్రలేమి, ఆకలి తగ్గడం, చెమటలు పట్టడం, మానసిక పరిస్థితి సవ్యంగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ద్రవ, స్ప్రే రూపంలో గంజాయి తీసుకుంటే- తలనొప్పి, మగత, పొడినోరు, వికారం, మతిస్థిమితం దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. గంజాయిని పొగ రూపంలో సేవిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో ప్రాణాలే పోతాయి.

- నాదెళ్ల తిరుపతయ్య

ఇదీ చూడండి:గర్ల్​ఫ్రెండ్​ ఖర్చుల కోసం యువకుడు కిడ్నాప్​ డ్రామా.. చివరకు..

Last Updated : Nov 11, 2021, 5:44 AM IST

ABOUT THE AUTHOR

...view details