తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సంక్షోభంలో అంకురాలు.. నవకల్పనలతోనే మనుగడ - పరిశోధన

ఇరవయ్యో శతాబ్దపు చివరి దశాబ్దం సిలికాన్‌ వ్యాలీని సృష్టించింది. అందులో సాంకేతిక వాణిజ్య సంస్థలు ఏర్పాటయ్యాయి. అమెరికాలో సాంకేతిక పరిజ్ఞానం మార్పు ఫలితంగా భారతదేశంలో ఉత్పాదక రంగం నుంచి సేవల రంగానికి గణనీయమైన వాణిజ్య పరివర్తన చోటుచేసుకుంది. ఆ సమయంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం కన్నా ఎక్కువగానే వృద్ధిని నమోదు చేసింది. ఐటీ రంగంలో పెరుగుదలే ఇందుకు కారణం.

Businesses have been hit by the corona epidemic.
సంక్షోభంలో అంకురాలు.. నవకల్పనలతోనే మనుగడ

By

Published : Apr 21, 2020, 1:43 PM IST

అప్పట్లో మార్కెట్‌ రెండంకెల వృద్ధి సాధిస్తుందనీ అంచనా వేశారు. పై తరహాలోనే గడచిన ఆరేడేళ్లలో భారత్‌లో అంకుర పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. ప్రఖ్యాత సంస్థల నుంచి మేధాసంపత్తిగల యువ మానవ వనరులను ఆకర్షించడంలో విజయవంతమయ్యారు. పైగా, ఏంజెల్‌ పెట్టుబడిదారులు, హైనెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ) నుంచి ‘సీడ్‌ క్యాపిటల్‌’ సేకరించారు. తరవాతి దశలో జపాన్‌, అమెరికా, చైనా వంటి దేశాల అంతర్జాతీయ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు, ఇతర దేశీయ సంస్థల నుంచి మూలధనాన్ని సేకరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'భారత్‌లో తయారీ' లక్ష్య సాధనకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటూ, అంకురాల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహక వ్యవస్థను నెలకొల్పే దిశగా సహాయ సహకారాల్ని అందించాయి. అయితే, ప్రస్తుత గందరగోళ మార్కెట్‌ పరిస్థితుల్లో అంకుర వ్యాపారాన్ని నిర్వహించడం, అంకురాలను విజయవంతమైన వ్యాపార సంస్థలుగా తీర్చిదిద్దడం ఓ సవాలుగా మారిందని చెప్పాలి. అనేక అంకురాలను యువతే నెలకొల్పింది. ప్రస్తుత పరీక్షా సమయంలో వారికి మార్గదర్శకుల అవసరం ఎంతైనా ఉంది.

గాలి బుడగ

నవకల్పనలు, పరిశోధన, అభివృద్ధి వంటి ప్రక్రియల్ని ప్రోత్సహించనిదే అంకుర పరిశ్రమలేవీ విజయవంతంగా సాగలేవన్న గ్రహింపు అందరికీ అవసరం. 80 శాతానికిపైగా అంకురాలు సేవల రంగంలోనే ఉన్నాయి. వీటి ద్వారా యువ మేనేజర్లు చిన్న వయసులోనే డబ్బులు సంపాదించడం పరిపాటిగా మారింది. కొవిడ్‌ కారణంగా అదంతా గాలిబుడగలా పేలిపోయే ప్రమాదం ఏర్పడింది. 2008-’14 మధ్యకాలంలో ప్రపంచ మార్కెట్‌- సంక్షోభంతో నిండిపోయింది. సబ్‌ప్రైమ్‌, యూరో, గ్రీస్‌, చైనాలో యువాన్‌ కరెన్సీ విలువ పతనం వంటి సంక్షోభాలు ఎదురయ్యాయి. 1930ల నాటి మహామాంద్యం కాలం నుంచీ ఈ తరహా సంక్షోభాల ధోరణి కొనసాగుతూనే ఉంది. కరోనా తాజా దాడి ఆ క్రమంలో మరో పెను ఉత్పాతం.

ముందుకు సాగే అవకాశం

అనిశ్చితితో కూడిన ప్రస్తుత మాంద్యం వాతావరణంలో వ్యాపార సంస్థలు సుస్థిరంగా సాగడానికి నవకల్పనల్ని ఆశ్రయించాల్సిందే. అంతా సజావుగా సాగితే, కొవిడ్‌ మహమ్మారి వల్ల మార్కెట్లు తిరోగమనానికి బదులుగా ముందుకు సాగే అవకాశమూ ఉంది. అయితే మార్కెట్లను ముందుకు ఉరికించడం అంత తేలికైన విషయం కాదు. తీవ్రపోటీ మధ్య సాగే ప్రపంచ మార్కెట్లలో చక్కని సామర్థ్యాన్ని కనబరచేలా అంకురాలకు ప్రోత్సాహం కల్పించాలి. మద్దతుగా నిలవాలి. వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో ఏర్పాటైన ప్రముఖ భారతీయ అంకుర పరిశ్రమలు ప్రపంచ దిగ్గజాల నుంచి పెట్టుబడులు పొందాయి. టెన్సెంట్‌, అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌, యాంట్‌ ఫైనాన్షియల్స్‌, డీడీచుక్సింగ్‌ వంటి చైనా, జపాన్‌లకు చెందిన వెంచర్‌ మూలధన సంస్థలు, భారత్‌కు చెందిన ప్రముఖ అంకురాలైన ఓయోరూమ్స్‌, ఓలా, బైజూస్‌ వంటివాటిలో పెట్టుబడులు పెట్టాయి.

మరోవైపు భారత్‌కు చెందిన పెద్ద సంఖ్యలో అంకురాలకు నిధుల్ని సమీకరించుకోవడం కష్టతరంగా మారింది. ఇప్పటివరకు భారతీయ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలైన బ్లూమ్‌ వెంచర్స్‌, యాక్సెల్‌ పార్ట్‌నర్స్‌ తదితర సంస్థలు కొన్ని అంకురాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు అంకురాల్లో యాక్సిలరేటర్లు, ఇంక్యుబేటర్లుగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా పలు చైనా వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు నిధుల్ని సమకూర్చే విషయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. క్యాపిటల్‌ మార్కెట్లు దెబ్బతిని, తిరోగమనం దిశగా జారుతుండటంతో జపాన్‌, కొరియా, అమెరికాకు చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల పెట్టుబడుల ప్రభావం భారతీయ అంకురాలపై పడే అవకాశం ఉంది. అలాంటి సంస్థలకు ఇది ఆందోళనకరమైన విషయమే. అదేవిధంగా, భారత్‌కు చెందిన ఏంజెల్‌ పెట్టుబడిదారులు, హెచ్‌ఎన్‌ఐలు ఓయోరూమ్స్‌ తదితర అంకురాల్లో నుంచి తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకునే ప్రమాదం కనిపిస్తోంది.

మార్గాంతరం ఏమిటి?

ప్రస్తుత కరోనా క్లిష్టపరిస్థితుల్లో అంకురాలు ఖర్చులు తగ్గించుకోవడం, హేతుబద్ధ వ్యయాలపై దృష్టి సారించడం ఎంతో అవసరం. పేటీఎం సంస్థ ప్రచార ప్రకటనల కోసం 2018లో రూ.2,224.9 కోట్ల వ్యయం చేయగా, 2019లో రూ.3,451.4 కోట్లు ఖర్చుపెట్టింది. ఒక ఏడాదిలోనే ప్రకటనలపై చేసిన వ్యయం 55 శాతం పెరిగినట్లు ఇది సూచిస్తోంది. అదేవిధంగా, ఫోన్‌పే సంస్థ 2018లో రూ.602.3 కోట్లు, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.1,296 కోట్లు వ్యయం చేసింది. ఏడాదిలో వందశాతంపైగా పెరుగుదల ఉంది. ఇప్పుడవే అంకుర సంస్థలు వాణిజ్య ప్రకటనలు, ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చుల్లో భారీ కోతపెట్టనున్నాయి.

మరోవైపు, మరీ అధిక స్థాయిలో అనిశ్చితి ఆర్థిక వ్యవస్థకు క్షేమకరం కాదని నిపుణులు విశ్వసిస్తున్నారు. అంకురాల విలువను నిర్ధారించడం చాలా క్లిష్టతరమైన విషయమని, ఈ పరిస్థితి అంకుర సంస్థల్ని తక్కువగా విలువ కట్టేందుకూ దారితీయొచ్చని భావిస్తున్నారు. ఇది వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల పనితీరు మందగించడానికీ దారితీస్తుంది. గతంలో కొన్ని ప్రముఖ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు పెట్టుబడి బ్యాంకింగ్‌ కంపెనీలను ఆశ్రయించి తమ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించాలని, ముప్పుల్ని తప్పించాలని కోరాయి. ఫలితంగా, అంకురాల భవిష్యత్తు వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల చేతుల్లో ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలో వాటి ఆర్థిక ప్రయోజనాల్ని పరిరక్షించుకునేందుకు విలీనాలు తదితర ప్రక్రియలూ ముందుకురావచ్చు.

మాంద్యంలో చిక్కిన మార్కెట్లు 2008-2009 తరహాలో అనేక సవాళ్లను సృష్టించనున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- ప్రపంచస్థాయి అంకుర పరిశ్రమలుగా విజయవంతమైన ఉబర్‌, ఎయిర్‌బీఎన్‌బీ, వాట్సాప్‌, పింటెరెస్ట్‌ వంటి సంస్థలు పై రెండు సంవత్సరాల్లోనే ప్రాణం పోసుకున్నాయి. మొత్తానికి ప్రస్తుత మహమ్మారి కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని తట్టుకునేందుకు అంకురాలు ప్రధానంగా నవకల్పనల్ని నమ్ముకుంటూ, వాణిజ్య నమూనాల్ని వినూత్నంగా మెరుగు పరచుకోవాల్సిందేనన్న సంగతి మరవరాదు!

కరోనా విసిరిన సవాలు

ఒకవైపు అంకురాల వృద్ధి గురించి మాట్లాడుకుంటుండగా- మరోవైపు, భారత్‌ సహా ప్రపంచ మార్కెట్లలో తిరోగమనం పొడగడు తోంది. ఇది అంకుర పరిశ్రమల పెట్టుబడిదారులు, ఇతరత్రా భాగస్వాముల్లో ఒత్తిడిని పెంచుతోంది. మార్కెట్ల ప్రస్తుత పతనావస్థలో అంకుర పరిశ్రమలు తిరోగమనాన్ని తట్టుకుంటాయా అనేది సందేహమే. ప్రపంచ ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లలో సంక్షుభిత పరిస్థితి, మార్కెట్లలో అనిశ్చితి ఇలాగే కొనసాగితే అంకుర పరిశ్రమల పురోగమనం దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు అంకురాల మనుగడపై ఆందోళన పెంచుతున్నాయి.

-ఎం.చంద్రశేఖర్​ (రచయిత- హైదరాబాద్​లోని ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ పబ్లిక్​ ఎంటర్​ప్రైజెస్​లో సహాయ ఆచార్యులు)

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: యూపీఐ లావాదేవీల్లో క్షీణత.. కానీ!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details