స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పాలన అనే కీలక ఆదర్శాల పునాదులపై వెలసిన అత్యంత పురాతన అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ కాలగతిలో కనీవినీ ఎరుగని ఆటుపోట్లకు గురైన సందర్భమిది. దేశ 46వ అధ్యక్ష పదవికి నవంబరు తొలివారంలో జరిగిన ఎన్నికల్లో ఎనిమిది కోట్ల పైచిలుకు ఓట్లతో జో బైడెన్ గెలుపొందినట్లు కొన్ని వారాల క్రితమే తేటతెల్లమైనా- ఓటమిని ఒప్పుకొనేది లేదన్న శ్వేతసౌధాధిపతి ట్రంప్ ఠలాయింపుతో ఇంతకాలం ప్రమాదకర ప్రతిష్టంభన రాజ్యమేలింది. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగానే తాజాగా ఎలెక్టోరల్ కాలేజీ లోనూ జో బైడెన్‌కు 306 ఓట్లు రావడం వల్ల- ట్రంప్ పెడసరానికి ఇక నూకలు చెల్లినట్లయింది. దేశంలో ఏనాడో వెలిగించిన ప్రజాస్వామ్య జ్యోతిని కరోనా మహమ్మారే కాదు, అధికార దుర్వినియోగమూ కొడిగట్టించలేదని నేడు అందరికీ తెలిసి వచ్చిందంటూ విజయోత్సవ ప్రకటన చేసిన జో బైడెన్- 'అమెరికాలో అధికారం రాజకీయ నాయకులు గుంజుకొనేది కాదు, ప్రజలు మంజూరు చేసేది' అని వాస్తవికంగా స్పందించారు. 'గతం గతః. మళ్ళీ మనం ఏకమవ్వాలి, గాయాల్ని మాన్పుకోవాలి' అని పిలుపిస్తున్న బైడెన్- కొవిడ్ కట్టడికోసం టీకా కార్యక్రమాన్ని, ఆపన్నులకు ఆర్థిక దన్నును, దేశార్థికాన్ని మరింత మెరుగ్గా పట్టాల కెక్కించడాన్ని తన ప్రాధాన్యాంశాలుగా వెల్లడించారు.
అనైతిక ఆక్రోశంతో ఘర్షణలు..
వర్ణ విద్వేషాల్ని రగుల్కొల్పి, అమెరికా సమాజాన్ని ట్రంప్ రెండుగా చీల్చిన వైనం- ఓటమి పాలైనా తనకు పోలైన రికార్డు స్థాయి ఓట్లలో స్పష్టమవుతూనే ఉంది. తన విజయాన్ని దొంగిలిస్తున్నారంటూ ట్రంప్ వెలిగక్కిన అనైతిక ఆక్రోశం వాషింగ్టన్ వీధుల్లో ఘర్షణలకు కారణమవుతోంది. పోలింగ్‌లో అక్రమాలు జరగలేదన్న ఉన్నతాధికార గణాన్ని అడ్డగోలుగా దూషించి, బుద్ధి లేదంటూ న్యాయపాలికనూ ఈసడించి, ఎదురాడిన వారి పదవుల్ని ఊడబెరికిన ట్రంప్ వ్యవహార సరళి కనీవినీ ఎరుగనిది. అది కొవిడ్‌కంటే ప్రమాదకరమైనది!
అంతర్జాతీయ సమాజంలో అగ్రరాజ్యాన్ని ఏకాకిగా
మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో మిషిగాన్ రాష్ట్రం డెమోక్రాట్ల వశమైపోగా, అక్కడి 16మంది ఎలెక్టోరల్ ఓట్లను కబ్జా చేసే కుహకానికి రిపబ్లికన్ పార్టీ సమకట్టినప్పుడు ఆ రాష్ట్ర రిపబ్లికన్ సభాపతి లీ చాట్‌ఫీల్డ్ చేసిన వ్యాఖ్య సంస్తుతి పాత్రమైనది. భవిష్యత్ ఎన్నికల్లో ఎలెక్టోరల్ కాలేజీ వ్యవస్థను ఆ ప్రతిపాదన సర్వభ్రష్టం చేస్తుందన్న చాట్‌ఫీల్డ్- 'మన దేశాన్ని శాశ్వతంగా కోల్పోతామేమోనన్న భయం కలుగుతోంద'నడం, ట్రంప్ సృష్టించిన ముసలం ఎంత వినాశకరమైనదో స్పష్టీకరిస్తోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడమే ప్రపంచానికి పొంచి ఉన్న పది ప్రధాన ప్రమాదాల్లో ఒకటిగా నాలుగేళ్ల నాటి 'ఎకానమిస్ట్' సర్వేలో ప్రజానీకం అభిప్రాయపడింది. అందులో ఏమాత్రం పొరపాటు లేదని ఈ నాలుగేళ్ల పాలనలో ధ్రువీకరించిన ట్రంప్- 'అమెరికా ఫస్ట్' నినాదంతో అందలం ఎక్కి, తాను దిగిపోతే అమెరికాకు దిక్కులేదన్నంత స్వాతిశయంతో సమస్త ప్రజాతంత్ర విలువల్నీ అపహసించారు. తన చపల చిత్తంతో అంతర్జాతీయ సమాజంలో అగ్రరాజ్యాన్ని ఏకాకిగా మార్చేశారు. ప్యారిస్ ఒప్పందం, ఇరాన్‌తో అణు ఒడంబడిక, ట్రాన్స్ అట్లాంటిక్ కూటమి, ప్రపంచ ఆరోగ్య సంస్థలనుంచి ఏకపక్షంగా వైదొలగి, చైనాతో వాణిజ్య స్పర్థకు తెగబడి ట్రంప్ సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. అధికార బదిలీకి అడుగడుగునా మోకాలడ్డిన 'పెద్దమనిషి' ప్రస్తుతానికి వెనక్కి తగ్గినా- 2024 ఎన్నికల్లో మళ్ళీ వస్తానంటున్నారు. దక్షిణ భారత మూలాలు గల కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎంచుకొని ఎన్నికల రంగాన్ని దున్నేసిన బైడెన్- ట్రంప్ ముష్టిఘాతాలకు శిథిలసౌధంగా మారిన అమెరికాను ముందుగా చక్కదిద్దుకోవాల్సి ఉంది. 'యునైటెడ్ స్టేట్స్'గా అమెరికాను ఏకతాటిమీద నడపడమే బైడెన్- హ్యారిస్‌లకు తొలి సవాలు కానుంది!
ఇదీ చూడండి:ముగిసిన ట్రంప్ పోరు- అధ్యక్షుడిగా బైడెన్ ధ్రువీకరణ