గత కొన్నేళ్ళుగా ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు వరస సంక్షోభాలతో అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు పెరుగుతున్న నిరర్ధక ఆస్తు(ఎన్‌పీఏ)లు; మరోవైపు క్షీణిస్తున్న వ్యాపార వృద్ధి, కొవిడ్ మహమ్మారి సృష్టిస్తున్న ఆర్థిక మహోత్పాతాల వల్ల పీఎస్‌బీలలో సంక్షోభం మరింత తీవ్రమైంది.
భారీగా పెరుగుతున్న మొండి బకాయిల కారణంగా అధిక శాతం పీఎస్‌బీల రుణవితరణ సామర్థ్యం తగ్గడంతోపాటు బాసెల్ నిబంధనల మేర మూలధన నిష్పత్తిని చేరుకోలేకపోతున్నాయి. వాటిని ఆదుకోవడానికి గత అయిదారేళ్ళలో ప్రభుత్వం దాదాపు రూ.3.5లక్షల కోట్ల మూలధనాన్ని అందించింది. అయినా పీఎస్‌బీల పనితీరు ఆశించిన మేర మెరుగుపడకపోగా కొన్ని బ్యాంకులు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి.
ఎన్నో ఆటుపోట్లు...
ప్రభుత్వం కొత్తగా పీఎస్‌బీలలో కొన్నింటిని ప్రైవేటీకరించే దిశగా అడుగులేస్తోంది. గతంలోనూ పీఎస్‌బీల ప్రైవేటీకరణపై కొంత చర్చ జరిగింది. తాజాగా రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విఠల్ ఆచార్య సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదికలో పీఎస్‌బీల పనితీరును మెరుగుపరిచే దిశలో కొన్ని కీలక సిఫార్సులు చేయడమే కాక కొన్ని పీఎస్‌బీలను తిరిగి ప్రైవేటీకరించడం మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేటీకరణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
పీఎస్‌బీల ఏకీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం గతేడాది కొన్ని బ్యాంకుల మెగా విలీనాలకు శ్రీకారం చుట్టి దేశంలోని పీఎస్‌బీల సంఖ్యను 27 నుంచి 12కు తగ్గించింది. అప్పట్లో ప్రభుత్వం 6 బ్యాంకుల (బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్‌బ్యాంకు, యూకో బ్యాంకు)ను విలీన పరిధి నుంచి తప్పించింది.
51 ఏళ్ళ జాతీయీకరణ ప్రస్థానంలో పీఎస్‌బీలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి. ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తూ సామాజిక బ్యాంకింగ్‌కు బాటలు వేసిన పీఎస్‌బీలు ప్రస్తుతం సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కొన్నింటి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొంది.
గతంలో విచక్షణారహిత రుణ వితరణ, గత ప్రభుత్వాల అతి జోక్యం, సంస్కరణల అమలులో తీవ్ర జాప్యం వంటి కారణాలకు తోడు కొవిడ్ ప్రేరేపిత ఆర్థిక మాంద్యం పీఎస్‌బీల పాలిట శాపంగా మారింది. ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్ళినంత మాత్రాన పీఎస్‌బీలు వృద్ధిబాట పడతాయన్నది వాస్తవం కాదు.
అంతర్జాతీయంగా, దేశీయంగా చూస్తే- సంక్షోభ సమయాల్లో ప్రైవేటు బ్యాంకుల వైఫల్యాలే అధికంగా ఉన్నట్లు తేలింది. దేశీయంగానూ గతంలో పలు ప్రైవేటు బ్యాంకులు విఫలమయ్యాయి. అలాంటి ఆపద సమయాల్లో కొన్ని ప్రైవేటు బ్యాంకులను విలీనం చేసుకుని వాటి డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడింది ప్రభుత్వరంగ బ్యాంకులే.
2002లో అప్పటి బెనారస్ స్టేట్ బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనం చేసుకుంది. 2003లో సంక్షోభంలో చిక్కుకొన్న నెడుంగడి బ్యాంకును పీఎన్‌బీ తీసుకుంది. 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ విలీనం చేసుకుంది. యెస్ బ్యాంకు ఉదంతం ప్రైవేటు బ్యాంకుల వైఫల్యాలకు, ఆ బ్యాంకుల్లో చోటు చేసుకుంటున్న తీవ్రమైన అవకతవకలకు అద్దం పడుతోంది.
గతంలో ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు పలు కొత్త తరం ప్రైవేటు బ్యాంకుల్లోనూ లొసుగులు వెలుగు చూశాయి. తాజాగా లక్ష్మీవిలాస్ బ్యాంకు, ధనలక్ష్మి బ్యాంకులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు విఫలమైనప్పుడల్లా ఆయా బ్యాంకుల డిపాజిటర్లు ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీఎస్‌బీలను ప్రైవేటీకరించే ప్రయత్నం మరో దుస్సాహసమే అవుతుంది.