తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బ్రిటిష్ దమననీతి చట్టాలు స్వతంత్ర భారతంలోనా?

భారత స్వాతంత్య్ర ఉద్యమకారులపై బ్రిటిష్‌ పాలకులు ప్రయోగించిన రాజద్రోహ నిరోధ చట్టాన్ని మన పాలకులూ తమ విమర్శకులపై ప్రయోగిస్తూ వస్తున్నారు. ఇది అప్రజాస్వామికమని కోర్టులు కూడా స్పష్టం చేశాయి. స్వతంత్ర భారతంలో ఇలాంటి దమననీతికి తావిచ్చే చట్టాలు అవసరమా అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది.

British laws
రాజద్రోహ చట్టం

By

Published : Aug 1, 2020, 8:03 AM IST

మహాత్మాగాంధీ తన పత్రిక- యంగ్‌ ఇండియాలో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ‘విద్రోహకర రాతలు’ రాశారంటూ 1922లో రాజద్రోహ చట్టం కింద కేసు పెట్టారు. దీన్ని తిలక్‌పై పెట్టిన కేసులతో పోల్చడం గొప్ప గౌరవమని గాంధీజీ ఎంతో ఆనందపడ్డారు.

బ్రిటిష్‌వారు 1947 ఆగస్టులోనే భారత్‌ నుంచి నిష్క్రమించినా, వలస పాలకుల వారసత్వంగా వదిలివెళ్లిన అనేక నిరంకుశ చట్టాలను స్వతంత్ర భారత పాలకులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా 1860, భారత శిక్షా స్మృతిలోని 124ఏ సెక్షన్‌ గురించి చెప్పుకోవాలి. దీన్ని రాజద్రోహ నిరోధ చట్టంగా వ్యవహరిస్తారు. ఉద్యమకారులపై బ్రిటిష్‌ పాలకులు ప్రయోగించిన ఈ చట్టాన్ని భారత పాలకులూ తమ విమర్శకులపై నాటి నుంచి నేటివరకు ప్రయోగిస్తూ వస్తున్నారు.

ఈ చట్టాలు అవసరమా?

కశ్మీర్‌ సమస్యపై ప్రభుత్వ విధానాన్ని తెగనాడిన ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌ ఈ చట్టం కోరలకు చిక్కారు. తాజాగా విఖ్యాత పాత్రికేయుడు వినోద్‌ దువా ఈ చట్టం బారినపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఓట్ల కోసం ఉగ్రవాద దాడులను, మరణాలను ఉపయోగించుకుంటోందని దువా ఆరోపించి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. స్వతంత్ర భారతంలో ఇలాంటి దమననీతికి తావిచ్చే చట్టాలు అవసరమా అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది.

బ్రిటిష్‌ పాలకులు ఈ చట్టాన్ని మహాత్మాగాంధీ, తిలక్‌, నెహ్రూ, ఆజాద్‌ వంటి స్వాతంత్య్ర పోరాటయోధులపై ప్రయోగిస్తే- స్వతంత్ర భారత పాలకులు అసమ్మతి తెలిపే పాత్రికేయులు, వైద్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మానవ హక్కుల ఉద్యమకారులు, గిరిజనులపై ఈ చట్టంతో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుత భాజపా ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టంతోపాటు అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని సైతం ప్రయోగిస్తోంది.

రమేశ్ థాపర్ కేసు..

స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే ప్రతిపక్షాలు, న్యాయస్థానాల విమర్శలు, సలహాలను లెక్కచేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి మరీ రాజద్రోహ నిరోధ చట్టం (ఐపీసీ సెక్షన్‌ 124ఏ)కి రాజ్యాంగబద్ధత కల్పించింది. ఇందులో వాడిన కొన్ని పదాలు రాజ్యాంగంలో భావప్రకటన స్వేచ్ఛకు నిర్దేశించిన పరిమితులకన్నా తీవ్రంగా ఉన్నాయని రమేశ్‌ థాపర్‌ కేసులో న్యాయస్థానం పేర్కొంది.

ఇది రాజ్యాంగవిరుద్ధమని కోర్టు ఎక్కడ తీర్పు చెబుతుందోనన్న భయంతో కేంద్రసర్కారు హడావుడిగా రాజ్యాంగాన్ని సవరించి, ‘ప్రజల భద్రత కోసం’ భావప్రకటన స్వేచ్ఛకు పరిమితులు అనే పదాలను 124ఏ సెక్షన్‌లో చేర్చింది. రాజ్యాంగంలోని 19వ అధికరణలో భావప్రకటన స్వేచ్ఛకు పరిమితులు అనే పదాలను ‘సమంజసమైన’ పరిమితులుగా మార్చింది.

మహామహులపై కక్ష

బ్రిటిష్‌ వలస పాలకులు రాజద్రోహ నిరోధ చట్టాన్ని బాలగంగాధర్‌ తిలక్‌ మీద మూడుసార్లు ప్రయోగించారు. ఆయన తరఫు న్యాయవాదిగా మహమ్మద్‌ అలీ జిన్నా వ్యవహరించారు. తిలక్‌ ప్రజలను రెచ్చగొట్టిన మాట నిజమే కానీ, దేశాన్ని ఆక్రమించిన విదేశీయులకు వ్యతిరేకంగా ఆయన ఆ పని చేశారని జిన్నా వాదించారు.

మొదటి కేసులో తిలక్‌కు శిక్ష పడినా, మ్యాక్స్‌ వెబర్‌ వంటి అంతర్జాతీయ మేధావుల జోక్యం వల్ల ఆయన విడుదలయ్యారు. బ్రిటిష్‌ వలస ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు బిగిస్తోందని తన పత్రిక ‘కేసరి’లో సంపాదకీయం రాసినందుకు 1908లో తిలక్‌పై రెండోసారి కేసు పెట్టారు. జిన్నా గట్టిగా వాదించినా ఆరేళ్ల జైలుశిక్ష పడింది.

బొంబాయి ప్రెసిడెన్సీలో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారని తిలక్‌పై 1916లో మూడోసారి కేసు పెట్టారు. బ్రిటిష్‌ అధికార యంత్రాంగాన్ని విమర్శించారు తప్ప ప్రభుత్వాన్ని కాదని జిన్నా వాదించడంవల్ల తిలక్‌కు శిక్ష పడలేదు. అప్పట్లో కొన్ని ప్రాంతీయ పత్రికలు విప్లవాత్మక రాతలను ప్రచురించడంవల్ల బ్రిటిష్‌ పాలకులు రాజద్రోహ నిరోధచట్టానికి మార్పుచేర్పులతో మరింత పదునుపెట్టారు.

మహాత్ముడి పైనా..

1922లో మహాత్మా గాంధీపైన బ్రిటిష్‌ ప్రభుత్వం కేసు పెట్టింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఎందుకు అసంతృప్తి రెచ్చగొడుతున్నారని జడ్జి శ్ట్రాంగ్‌మన్‌ ప్రశ్నించినప్పుడు, సంతృప్తిని చట్టం ద్వారా ఉత్పత్తి చేయలేమని గాంధీజీ బదులిచ్చారు. ఆయన జవాబు జడ్జికి నచ్చినా, చివరకు ఆరేళ్ల జైలుశిక్ష విధించారు. రాజద్రోహం, రెచ్చగొట్టడం అనే పదాలకు మహాత్ముడితోపాటు అనేకమంది స్వాతంత్య్ర యోధులు వినూత్న భాష్యాలెన్నో చెప్పారు.

భారత్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజాభీష్టం వల్లకానీ, చట్టబద్ధంగా కానీ ఏర్పడలేదు. మోసం, బలప్రయోగాలతో ఏర్పడింది. కాబట్టి ఆ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అగత్యం కానీ, దానిపట్ల విధేయంగా మెలగాల్సిన అవసరంకానీ భారతీయులకు లేదు. అందువల్ల బ్రిటిష్‌వారి పట్ల భారతీయులకు అసంతృప్తి ఉండకూడదనే వాదనలో పసలేదని స్వాతంత్య్ర పోరాటయోధులు వాదించారు.

స్వాతంత్య్రానంతర సవాళ్లు

స్వతంత్ర భారతంలో రాజద్రోహ చట్టానికి తొలి సవాలు 1959లో ఎదురైంది. రామ్‌నందన్‌ వెర్సస్‌ స్టేట్‌ కేసులో సెక్షన్‌ 124ఏ రాజ్యాంగబద్ధతను అలహాబాద్‌ హైకోర్టులో సవాలు చేశారు. పేదరికాన్ని, కూలీల వెతలను కేంద్రం పట్టించుకోవడం లేదంటూ రామ్‌నందన్‌ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఈ కేసులో ఆరోపణ.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సాయుధపోరాటంతో కూలదోయాలని ఆయన పిలుపిచ్చారని ఈ సెక్షన్‌ కింద కేసు పెట్టారు. దేశ విభజనకు సమ్మతించిన జవహర్‌లాల్‌ నెహ్రూను ఆయన దేశద్రోహిగా వర్ణించారు కూడా. రామ్‌నందన్‌పై ఆరోపణలను హైకోర్టు కొట్టివేయడమే కాదు, సెక్షన్‌ 124ఏ రాజ్యాంగవిరుద్ధమని తీర్మానించింది కూడా. ఈ సెక్షన్‌ పౌరుల భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తోందని పేర్కొంది. ఈ ఆంక్షలు అప్రజాస్వామికమని, రాజ్యాంగ మూలాలనే దెబ్బతీస్తున్నాయని స్పష్టీకరించింది.

మరో కేసులో..

తరవాత 1962లో కేదార్‌నాథ్‌ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు, అలహాబాద్‌ హైకోర్టుకు భిన్నమైన తీర్పునిస్తూ, సెక్షన్‌ 124ఏ రాజ్యాంగబద్ధతను కొన్ని పరిమితులతో పునరుద్ధరించింది. కమ్యూనిస్టు నాయకుడైన కేదార్‌నాథ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేసేవారు. జమీందారులు, పెట్టుబడిదారులు, వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలను సాయుధ విప్లవంతో కూలదోయాలని పిలుపిచ్చేవారు.

ప్రభుత్వ విధానాలను విమర్శించడం వేరు, హింసాకాండతో ప్రభుత్వాన్ని కూలదోయాలనుకోవడం వేరని సుప్రీంకోర్టు పేర్కొంది. సెక్షన్‌ 124ఏ రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూనే, హింసను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూడటం, అవ్యవస్థను సృష్టించడం మాత్రమే రాజద్రోహంగా పరిగణించాల్సి ఉంటుందని వివరించింది.

కేదార్‌నాథ్‌ తరవాత చాలామందిపై ఈ సెక్షన్‌ కింద కేసులు పెట్టారు. ప్రభుత్వ విధానాలను, రాజకీయవాదుల అవినీతిని ప్రశ్నించడం, విమర్శించడం ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య లక్షణం. కానీ, ఈ విమర్శలను భరించలేక రాజద్రోహ చట్టం కింద కేసులు పెట్టడం ఎక్కువైంది.

సమీక్ష అవసరమే..

గాంధీజీ చెప్పినట్లు ప్రభుత్వం పట్ల విధేయత, అభిమానాలు భయం వల్లకాక, పరస్పర గౌరవామోదాలతోనే పెరుగుతాయి. ప్రభుత్వం పట్ల అవిధేయత ఉన్నంతమాత్రాన దేశం మీద, ప్రజల మీద అవిశ్వాసం ఉన్నట్లు కాదు. అది జాతి ద్రోహమూ కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాతా నిరంకుశ రాజద్రోహ చట్టం అమలులో ఉండటం దురదృష్టకరం. రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని సమీక్షించడమో, రద్దు చేయడమో జరగాలి. గౌరవనీయ సుప్రీంకోర్టు కూడా కేదార్‌నాథ్‌ కేసులో తానిచ్చిన తీర్పును పునస్సమీక్షించాలి.

  • లోక్​మాన్య బాలగంగాధర్ తిలక్ శత వర్ధంతి నేడు
    తిలక్

(రచయిత- సందీప్ పాండే, రామన్​ మెగసెసే పురస్కార గ్రహీత)

ABOUT THE AUTHOR

...view details