దేశ సేవకోసం కష్టాలను, దారిద్య్రాన్ని వరించిన విశిష్ట త్యాగమూర్తి టంగుటూరి ప్రకాశం పంతులు(Prakasam pantulu garu). స్వార్థరాహిత్యం, త్యాగనిరతి, ఎనలేని ధైర్యసాహసాలు ఆయన్ను అన్ని వర్గాలకూ సన్నిహితుణ్ని చేశాయి. సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్యలకు 1872, ఆగస్టు 23న నేటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో ప్రకాశం పంతులు జన్మించారు. తండ్రి అకాలమరణం నాటికి ఆయనకు పన్నెండేళ్లు. కటిక పేదరికంతో వారాలు చేస్తూ చదువుకున్నారు. బాల్యం నుంచి నాటకాలంటే ఇష్టం. ఉపాధ్యాయులు ఇమ్మానేని హనుమంతరావు నాయుడు ప్రోత్సాహంతో పాఠశాల రోజుల్లోనే పౌరాణిక నాటకాల్లో ద్రౌపది, సత్యభామ, చిత్రలేఖ తదితర స్త్రీ పాత్రలు పోషించారు.
హనుమంతరావు కుటుంబం రాజమహేంద్రికి తరలిపోవడంతో తల్లితో సహా ప్రకాశం(tanguturi prakasam pantulu) వారివెంట వెళ్ళారు. అక్కడే చదువుకుంటూ నాటకాల్లో వేషాలు వేసేవారు. పద్దెనిమిదో ఏట అక్క కుమార్తె హనుమాయమ్మతో ఆయన వివాహం జరిగింది. హనుమంతరావు అండదండలతో మద్రాసులో న్యాయశాస్త్రం అభ్యసించారు. రాజమహేంద్రిలో న్యాయవాదిగా పుష్కలంగా ధనార్జన చేశారు. ఆ పురపాలక సంఘం అధ్యక్షులుగానూ ఎన్నికయ్యారు. 1903లో మిత్రుల ప్రోత్సాహంతో ఇంగ్లాండు వెళ్ళి బారిష్టర్ అయ్యారు. మద్రాసు, ఒంగోలు, రాజమహేంద్రవరాల్లో స్థిరాస్తులు సమకూర్చుకున్నా, స్వాతంత్రోద్యమంలో యావదాస్తినీ ప్రజలకోసం ఖర్చు చేశారు.
సహాయ నిరాకరణోద్యమం(1921)తో ప్రకాశం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గాంధీజీ ఉద్యమానికి తన 'మద్రాస్ లా టైమ్స్' పత్రిక ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ మద్రాస్ బీచ్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. బ్రిటిష్ సైనికుల తుపాకులకు తన గుండెను చూపించారు. ఆ నిర్భయత్వం ఆయన్ను 'ఆంధ్రకేసరి'ని(Andhra Kesari) చేసింది. జైల్లో ఉన్నప్పుడు ఆర్థిక విధానాలపై రెండు పుస్తకాలు ఆంగ్లంలో రాశారు. 1937లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో రెవిన్యూ మంత్రిగా పనిచేశారు. ఆయన రూపొందించిన సమగ్ర నివేదిక జమీందారీ రద్దు చట్టానికి ప్రధాన సాధనమైంది.