ప్రభుత్వం, పోలీసులు ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా కొందరు తబ్లీగీ మర్కజ్ అనుయాయులు వైద్యం చేయించుకోకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కొవిడ్ లక్షణాలు ఏవైనా ఉన్నాయా అని వాకబు చేస్తున్న ఆశా వర్కర్లపై కొంతమంది బెదిరింపులకు, దుర్భాషలకు దిగుతున్నారు. చాలామంది జనం లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీదకు వస్తున్నారనీ, స్వీయ నిర్బంధాన్ని ఖాతరు చేయడం లేదనీ పత్రికలు, టీవీలు ఘోషిస్తున్నాయి. కొద్దిమంది బాధ్యతారాహిత్యం కోట్లమందిని కరోనా కోరల్లోకి నెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా లేక నిఘాను తీవ్రం చేసి రోగ వ్యాపకుల ఆటకట్టించాలా అన్నది వెంటనే తేల్చుకోవాలి.
నిఘా నీడతోనే..
జనబాహుళ్యంపై అనుక్షణం నిఘా, నిర్బంధాలు చైనాలో మాదిరిగా ప్రజాస్వామ్యాలలో కుదరవని భావిస్తాం. కానీ, కొవిడ్ దెబ్బకు దక్షిణ కొరియా వంటి ప్రజాస్వామ్య దేశమూ నిఘాను ముమ్మరం చేయాల్సి వచ్చింది. చైనాలా సింగపూర్ కూడా కొవిడ్ పీడితులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవర్ని కలిశారు అనే అంశాలను స్మార్ట్ ఫోన్ యాప్‌ల సాయంతో పసిగడుతోంది. ఇజ్రాయెల్ తన ఉగ్రవాద నిరోధక సంస్థకున్న అధునాతన సాంకేతికతను దీనికి ఉపయోగిస్తోంది.
కట్టడి చేయడమే లక్ష్యం
కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు కరోనా సోకిందనే అనుమానంతో క్వారంటైన్‌లో ఉన్నవారి వ్యక్తిగత వివరాలను రాజస్థాన్ ప్రభుత్వం వార్తా పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ప్రకటిస్తోంది. అజ్మీర్‌లో 46 మంది కరోనా అనుమానితుల పేర్లు, చిరునామాలను స్థానిక హిందీ దినపత్రికల్లో వెలువరించింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో స్వీయ గృహనిర్బంధంలో ఉన్న 300 మంది వ్యక్తుల వివరాలు సామాజిక మాధ్యమాల్లో వెల్లడయ్యాయి. దిల్లీ, చండీగఢ్‌లలో కరోనా అనుమానితుల ఇళ్ల ముందు అతికించిన పోస్టర్లలో వారి పేర్లు, స్వీయ నిర్బంధ కాలం, కుటుంబ సభ్యుల సంఖ్య, ఫోన్ నంబర్ల వంటి వివరాలను బహిర్గతపరిచారు. ‘కొవిడ్ హెచ్చరిక: ఈ ఇల్లు క్వారంటైన్‌లో ఉంది. లోనికి రాకండి’ అని సదరు పోస్టర్లు హెచ్చరిస్తున్నాయి.
ఆయా రాష్ట్రాల కార్యక్రమాలు..
పంజాబ్‌లో మొహాలీ జిల్లా యంత్రాంగమైతే కరోనా అనుమానితులు, వారి కుటుంబ వివరాలను ఏకంగా తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ముంబయి, ఒడిశాలు కూడా ఇదే బాట పట్టాయి. కర్ణాటకలో గృహ నిర్బంధంలో ఉన్న కరోనా అనుమానితులు నిర్ణీత సమయంలో గంటకోసారి సెల్ఫీ దిగి మొబైల్ యాప్ ద్వారా ప్రభుత్వానికి పంపాలి. సెల్ఫీ దిగిన వ్యక్తి ఎక్కడ ఉన్నదీ జీపీఎస్ ద్వారా తెలిసిపోతుంది. సెల్ఫీ పంపనివారిపై క్రిమినల్ కేసు పెట్టవచ్ఛు ముఖ గుర్తింపు, జియో ఫెన్సింగ్‌లను ఉపయోగించి కరోనా అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టే యాప్‌ను తమిళనాడు పోలీసులు ఉపయోగిస్తున్నారు. ప్రతి కరోనా అనుమానితుడు తన ముఖాన్ని, తానున్న ప్రదేశాన్నీ యాప్‌లో లోడ్ చేయాలి. ఆపైన పోలీసులు రోజులో రెండు మూడుసార్లు తమ ఇష్టం వచ్చిన సమయంలో యాప్‌లో ఉన్న అనుమానితుల ముఖాలను తనిఖీ చేస్తారు. కరోనా అనుమానితులు ఇంటికి 10 నుంచి 100 మీటర్లలోపు మాత్రమే తిరగాలి. ఈ కంచె (జియోఫెన్సింగ్) దాటితే పోలీసులకు వెంటనే హెచ్చరిక సంకేతం వెళ్లిపోతుంది. తమిళనాడులో అనేక జిల్లాల్లో ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొవిడ్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ కరోనా అనుమానితుల ఆనుపానులపై నిఘా సమాచారాన్ని ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖలకు తెలియజేస్తుంది. కరోనా అనుమానితులు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారి కదలికలు బ్లూటూత్, లొకేషన్ ట్రాక్ ద్వారా అధికారులకు తెలిసిపోతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రక్రియను ప్రజారోగ్య నిఘాగా వర్ణిస్తోంది. కరోనా వాహకుల నుంచి సాధారణ ప్రజలకు వ్యాధి సోకకుండా చూడటానికి ఇది అవసరమంటోంది.