గణతంత్ర భారతంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల దరిమిలా అత్యున్నత శాసన నిర్మాణ వేదికగా కొలువుతీరిన పార్లమెంటు నేడు డెబ్భయ్యో పడిలోకి అడుగిడుతోంది. 'ప్రజాప్రతినిధులుగా మీ కృషి ప్రజలకు సత్ఫలితాలనిస్తుందని, సమర్థమైన పనితీరుతో ఈ పార్లమెంటు స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తుందని ఆశిస్తున్నా'నంటూ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ పసిడి పలుకులతో భారత ప్రజాతంత్ర ఏరువాక మొదలైంది. ప్రపంచంలో ఏడోవంతు మానవాళి చరిత్రను నిర్మిస్తున్న ఉత్కృష్ట వ్యవస్థగా పండిత నెహ్రూ సన్నతులందుకొన్న పార్లమెంటులో సచ్ఛీల విలువలు, సంప్రదాయాలు బలంగా పాదుకొనేలా తొలి సభాపతి మవులంకర్ విశేషంగా పరిశ్రమించారు. 'దిల్లీలో పార్లమెంటు తన అత్యద్భుత పనితీరుతో ఆకట్టుకొంటోంది.. ఆసియాకు దీన్ని ఓ పాఠశాలగా నెహ్రూ చెప్పుకోవచ్చు'నంటూ 1954లో విఖ్యాత గార్డియన్ పత్రిక శ్లాఘించిందంటేనే తెలుస్తుంది- ప్రజా సేవానిరతి నాటి మాన్య సభ్యుల గుండెల్లో నిండు గోదారిలా మారిందన్న సంగతి!
చట్టసభల ప్రతిష్ఠ నేలమట్టమైతే ప్రజాస్వామ్యమే పెనుసంక్షోభంలో పడుతుందన్న దూరదృష్టితో- తప్పు చేసిన వ్యక్తి ఏ రాజకీయ గోత్రీకుడైనా తక్షణం తప్పించడానికి నేతలంతా ఒక్కతాటి పైకి వచ్చిన నాటి ఆదర్శం అపురూపం! పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి రెండువేల రూపాయలు తీసుకొన్న ముద్గల్ వ్యవహారాన్ని బయటపెట్టింది నాటి కాంగ్రెస్ ఎంపీ ఫిరోజ్‌గాంధీ. ముద్గల్ సైతం తమ పార్టీవాడే అయినా తులసి వనంలో గంజాయి మొక్కను పెరికి పారేయాల్సిందేనంటూ 1951 సెప్టెంబరులోనే అతగాణ్ని బహిష్కరించిన నెహ్రూ- పార్లమెంటు ఔన్నత్యంతో రాజీపడేది లేదని చాటారు. నాటి త్యాగధనులు లక్షించిన సచ్ఛీల విలువలు 17 సార్వత్రిక ఎన్నికల దరిమిలా ఏ గంగలో కలిసినట్లు? పార్లమెంటు మొదలు అసెంబ్లీల దాకా నేరచరితులతో లుకలుకలాడుతున్న శాసన నిర్మాణ వ్యవస్థ దేశాన్ని ఏ పాతాళపు లోతులకు దిగజార్చినట్లు?