తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రెచ్చిపోతున్న సైబర్​ నేరగాళ్లు.. నామమాత్రంగానే చర్యలు! - Cyber crimes latest news

అంతర్జాల వినియోగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో సైబర్‌ నేరాల సంఖ్య, తీవ్రత పెరుగుతున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఇంటర్నెట్​ వినియోగం విపరీతంగా పెరిగి ఈ దాడుల సంఖ్య భారీగా పెరిగిందని సైబర్‌ భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి నివారణ చర్యల సంగతేంటి?

A special story on Cyber crimes and control measures in India
రెచ్చిపోతున్న సైబర్​ నేరగాళ్లు- నియంత్రణ సంగతేంటి?

By

Published : Nov 20, 2020, 8:20 AM IST

దేశంలో సాంకేతికత వేగం పుంజుకొంటున్న కొద్దీ సైబర్‌ నేరాల సంఖ్యా పెరుగుతోంది. 69 కోట్లకు పైగా వినియోగదారులతో ప్రపంచంలో రెండో అతిపెద్ద అంతర్జాల వినియోగ దేశమైన భారత్‌లో సైబర్‌ నేరాల సంఖ్య, తీవ్రత పెరుగుతున్నా- నివారణ చర్యలు నామమాత్రంగా ఉండటం ఆందోళనకరం. 2019లో సైబర్‌ నేరాల వల్ల దేశంలో దాదాపు రూ.1.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. కొవిడ్‌ నేపథ్యంలో అంతర్జాల వినియోగం విపరీతంగా పెరగడం సైబర్‌ నేరాలు, దాడుల ముప్పును ఇంతలంతలు చేసిందని సైబర్‌ భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది చివరి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 67 శాతం దాడులు పెరిగినట్లు సైబర్‌ భద్రతా ఉత్పత్తుల సంస్థ క్యాస్పరస్కీ తేల్చిచెప్పింది. వీటిని అరికట్టడానికి ప్రభుత్వపరంగా గట్టి ప్రయత్నాలు లేకపోగా, ప్రజల్లోనూ అవగాహన కొరవడటం ప్రమాదాలకు తావిస్తోంది. ఏటీఎమ్‌లు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో జరిగే మోసాలు, ఓటీపీ వివరాలు చెప్పాలంటూ డబ్బులు లేదా సమాచారం తస్కరించేవి, సైబర్‌ బ్లాక్‌మెయిలింగ్‌, సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం చేయడం, నకిలీ ప్రొఫైల్స్‌ సృష్టించి తప్పుదోవ పట్టించడం వంటివన్నీ సైబర్‌ నేరాలే. ఇందులో అత్యధిక భాగం ఏటీఎమ్‌లు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లోనే జరుగుతున్నాయి. ఎక్కువగా వ్యాపార, వైద్య రంగాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ రంగాల్లోని వ్యక్తులు, లేదా సంస్థల కీలక సమాచారాన్ని తస్కరించే సైబర్‌ నేరస్థులు దాన్ని తిరిగిచ్చేందుకు లేదా స్తంభింపజేసిన వెబ్‌సైట్లను తిరిగి పనిచేసేలా చేయడానికి కొంత మొత్తాన్ని డిమాండ్‌ చేస్తుంటారు.

వెలుగు చూడని ఘటనలెన్నో...

గత అయిదేళ్లలో మన దేశంలో సైబర్‌ దాడుల సంఖ్య భారీగా పెరిగింది. భారత కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ- ఇన్‌) లెక్కల ప్రకారం 2015లో యాభైవేల లోపే ఉన్న ఇలాంటి ఘటనల సంఖ్య ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే ఏడు లక్షలదాకా చేరడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. లక్షల సంఖ్యలో సైబర్‌ దాడులు చోటుచేసుకుంటున్నా నమోదవుతున్న కేసులు వేలల్లోనే ఉంటున్నాయి. 2019లో దాదాపు నాలుగు లక్షల ఘటనలు జరిగినట్లు సీఈఆర్‌టీ చెబితే, కేవలం 44,546 కేసులు మాత్రమే నమోదైనట్లు జాతీయ నేరగణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) పేర్కొనడం గమనార్హం. 2018లోనూ రెండు లక్షలకుపైగా దాడులు జరిగితే నమోదైన కేసుల సంఖ్య 28వేలు మాత్రమే. సైబర్‌ దాడి జరిగితే దానిపై ఎలా ఫిర్యాదు చేయాలన్న కనీస అవగాహన సైతం చాలామందికి లేకపోవడం, వ్యక్తిగత విషయాలను బయటపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడటం వంటివి ఇందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

అవసరమైన యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ ఐ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడం సురక్షితం. ఇతరులు పంపించే లింకులు, వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడం, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో అపరిచితుల నుంచి వచ్చే సందేశాలకు స్పందించడం మన ఉపకరణాల్లోకి ముప్పును ఆహ్వానించినట్లేనని, ఆగంతకులకు అవకాశం ఇచ్చినట్లేనని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లలో ఇంటర్నెట్‌ వాడేవారిలోనూ చాలామందికి సైబర్‌ భద్రతపై కనీస అవగాహన ఉండటం లేదు. ఆఫర్లు, ల్యాటరీలు, డిస్కౌంట్లు అంటూ ఊరూపేరూ లేని మెయిల్‌ ఐడీల నుంచి వచ్చే ఫిషింగ్‌ మెయిల్స్‌తో సైబర్‌ భద్రతకు తూట్లు పడుతున్నాయి. సైబర్‌ నేరాల విషయంలో కనీస అవగాహన ఉండటం తప్పనిసరి అన్నది నిపుణుల మాట. అంతర్జాల వినియోగదారుల్లో చాలామంది ఉన్నత విద్యావంతులకూ సైబర్‌ నేరాలు, నివారణ చర్యలపై అవగాహన అంతంతమాత్రమే. చాలామంది దాన్ని ఓ సమస్యగానే పరిగణించడం లేదు. సైబర్‌ నేరస్థులు ఇంతగా చెలరేగిపోవడానికి పౌరుల అలసత్వమే ప్రధాన కారణమవుతోంది.

ఫిర్యాదులకే పరిమితం

సైబర్‌ నేరాల బాధితులు ఫిర్యాదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్‌క్రైమ్‌.జీఓవీ.ఇన్‌' పేరుతో ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఈ ఏడాది జనవరి చివరి వరకు 33,152 ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటులో వెల్లడించారు. ఇందులో 790 ఫిర్యాదులపై మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వివరించారు. ఈ వెబ్‌సైట్‌కు వచ్చే ఫిర్యాదులన్నింటినీ తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైన ప్రతి కేసులోనూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేనని హోం శాఖ ఇటీవలే అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. సైబర్‌ నేరాల బాధితుల కోసం 155260 నంబర్‌తో హెల్ప్‌లైన్‌నూ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాల నేరాలను అరికట్టడానికి త్వరలోనే జాతీయ సైబర్‌ భద్రతా విధానం-2020ను తీసుకురాబోతున్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఇటీవల ఓ వెబినార్‌లో ప్రకటించారు. వాస్తవానికి 2018లోనే జాతీయ సైబర్‌ భద్రతా విధానానికి ముసాయిదా రూపకల్పన ప్రారంభమైంది. గత ఏడాదే దాన్ని రూపొందించి అభిప్రాయ సేకరణ కోసం పరిశ్రమ వర్గాలు, సాంకేతిక నిపుణుల ముందుంచారు. కొవిడ్‌ కారణంగా జాప్యం చోటు చేసుకుంది. వచ్చే నెలలోగా జాతీయ సైబర్‌ భద్రతా విధానాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్‌ భద్రతా ప్రమాణాలు పాటించకపోతే సాంకేతికత ఓ సౌకర్యంగా కాక సమస్యగా మిగిలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రచయిత- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

ABOUT THE AUTHOR

...view details