రాజ్యాంగ విలువలు, సమన్యాయ సూత్రాల అమలు, సమున్నత ఆదర్శాలకు కట్టుబడిన శాసన న్యాయవ్యవస్థలు... ప్రజాస్వామ్య భారతావని కంఠాభరణాలు! స్వాతంత్య్రానంతరం సుమారు మూడు దశాబ్దాలపాటు సాఫీగా సాగిన భారత ప్రజాస్వామ్య రథానికి అత్యయిక పరిస్థితి రూపంలో 1975లో బ్రేకులు పడ్డాయి. అనువంశిక పాలన, నియంతృత్వ ధోరణి, వ్యక్తిపూజ వంటి దుర్లక్షణాలు కోరసాచాయి. 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిర తీసుకువచ్చిన అత్యవసర పరిస్థితి.. మధ్య యుగ విలువలను దేశం నెత్తిన రుద్దింది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిన ఆ ఘటన నేటికి నాలుగున్నర దశాబ్దాలు. ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పటికీ ఆ మకిలి అధ్యాయం తాలూకు ఛాయలు పాలనలో, పాలకుల్లో అక్కడక్కడా దర్శనమిస్తుండటం బెంబేలెత్తించే పరిణామం. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తూట్లు పొడుస్తూ పౌరుల వాక్‌స్వాతంత్య్రాన్ని సైతం కాలరాస్తున్న నాయకమ్మన్యులకు ఇప్పుడూ కొదవలేదు.
చీకటి అధ్యాయం
లోక్‌సభ సభ్యురాలిగా 1971లో ఇందిర గెలుపును సవాలు చేస్తూ ఆమెపై పోటీచేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో అత్యయిక పరిస్థితికి బాటలు పడ్డాయి. ఎంపీగా ఇందిర ఎన్నిక చెల్లదు కాబట్టి, ఆమె అధికారంలోనుంచి దిగిపోవాలని 1975 జూన్ 12న అలహాబాదు హైకోర్టు తీర్పు చెప్పింది. దానిపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఆమె ప్రధానిగా కార్యనిర్వహణ చేయడానికి వీలులేదని, శాసనసభ సమావేశాల్లో పాల్గొనడం, మాట్లాడటం, ఓటు వేయడం, లోక్‌సభ సభ్యురాలిగా జీతం పొందడం చేయకూడదు అన్న షరతులతో 'సుప్రీం' న్యాయమూర్తి కృష్ణ అయ్యర్ ఆమెకు బెయిలు మంజూరు చేశారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు సమయం అవసరమని భావించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ తీర్పును ఇరవై రోజులపాటు వాయిదా వేస్తున్నట్లూ ప్రకటించింది. అదే ఈ దేశం కొంపముంచింది. ఆ నేపథ్యంలోనే సర్వోదయ ఉద్యమ నాయకులు జయప్రకాశ్ నారాయణ్ ఇందిర రాజీనామా కోరుతూ దేశవ్యాప్త సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు. ఆ తరుణంలోనే అంతర్గత కల్లోలంనుంచి దేశాన్ని కాపాడాలన్న కారణం చెప్పి ఇందిర ప్రభుత్వం 'ఎమర్జెన్సీ' ప్రకటించింది. ఇందిరతోపాటు ఆమె చిన్న కొడుకు సంజయ్ గాంధీల నియంతృత్వం నడిచిన కాలమది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల పేరిట జరిగిన అరాచకాలు, పార్టీ కార్యకర్తల అండతో చోటుచేసుకున్న దాడులు, ఆదాయపుపన్ను శాఖను 'బ్లాక్ మెయిల్' చేసే యత్నాలు, పత్రికలపై ఉక్కుపాదం, పార్టీలోని భజనపరులు, తైనాతీలకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం, ప్రతిపక్ష నాయకులను, మేధావులను, కవులు, రచయితలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి జైళ్ళలో బంధించడం వంటి అన్యాయాలు అడ్డూ ఆపూ లేకుండా జరిగాయి.