తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మహమ్మారిపై ముప్పేట దాడి!- దేశంలో కొవిడ్‌కు ఏడాది

భారత్​లో కరోనా తొలి కేసు నమోదై నేటికి ఏడాది. చైనా నుంచి కేరళ చేరుకున్న ఓ విద్యార్థినికి.. గతేడాది జనవరి 30నే కొవిడ్​ పాజిటివ్​గా నిర్దరణ అయింది. ఆ తర్వాత దేశంలో మెల్లమెల్లగా కొవిడ్​ మహమ్మారి విజృంభించింది. ఆ తర్వాత కఠిన లాక్​డౌన్​ విధించింది కేంద్రం. కొవిడ్‌ వల్ల పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడి లక్షలమంది ఉపాధి కోల్పోయారు. ఫలితంగా వస్తుసేవలకు గిరాకీ పడిపోయి, పెట్టుబడులూ అడుగంటాయి. మరి ఈసారి కొత్త బడ్జెట్‌.. కొవిడ్‌ వల్ల గాడి తప్పిన ఆర్థిక రథాన్ని మళ్ళీ పరుగులు తీయించడానికి లక్షల్లో ఉద్యోగాలు సృష్టిస్తుందా? 12 కోట్లమందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాని(ఎంఎస్‌ఎంఈ)కి ఈ బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహకాలు ప్రకటించాలి.

By

Published : Jan 30, 2021, 5:51 AM IST

భారతదేశంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్‌ కేసు సరిగ్గా ఏడాది క్రితం నిర్ధరణ అయింది. చైనాలో వుహాన్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఓ కేరళ విద్యార్థిని, అక్కడి నుంచి స్వరాష్ట్రానికి చేరుకున్న తరవాత- నిరుడు జనవరి 30న ఆమెను కొవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధరించారు. అదే రోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) కొవిడ్‌ వ్యాధిని అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఆపైన రెండు నెలలకు భారతదేశంలో లాక్‌డౌన్‌ విధించారు. పది వారాల లాక్‌డౌన్‌ తరవాత జూన్‌ ఎనిమిదో తేదీ నుంచి భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌ ఆంక్షలను దశలవారీగా సడలించసాగారు. ఈ ఏడాది జనవరి 26నాటికి భారత్‌లో మొత్తం సుమారు కోటీ ఏడు లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనా, వ్యాధి నుంచి కోలుకున్నవారు దాదాపు 97 శాతం వరకు ఉండటం నిజంగా విశేషం.

వాస్తవంలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికార గణాంకాలు సూచించేదానికన్నా 50 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ లెక్కన 50 కోట్లమంది భారతీయుల్లో కొవిడ్‌ వ్యాపించి ఉండాలి. సీరోలాజికల్‌ సర్వేల అనంతరం ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నిపుణులు అంచనా వేసినదాని ప్రకారమైతే- కొవిడ్‌ సోకిన భారతీయుల సంఖ్య 90 కోట్ల పైమాటే. ఈ లెక్కన భారత జనాభాలో ఇప్పటికే సామూహిక వ్యాధి నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) వృద్ధి చెంది ఉండాలి. అందుకేనేమో జనవరి 26నాటికి ప్రపంచ గణాంకాలకన్నా చాలా తక్కువగా భారత్‌లో లక్షన్నర కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఇక్కడ కొత్త కేసులూ తగ్గిపోతుండటం- వైరస్‌ సోకినా తట్టుకున్నవారి సంఖ్య చాలా ఎక్కువనడానికి సూచిక.

మితిమీరిన ధీమా వద్దు

మన దేశంలో కొవిడ్‌ ఉద్ధృతంగా రేగిన రోజుల్లో రోజుకు 1200 మరణాలకుపైనే సంభవించేవి. ఇప్పుడు మరణాలు రోజుకు 200కు తగ్గాయి. ఇతర రోగాలవల్ల మరణించేవారు రోజుకు 26,000మంది అని గుర్తుంచుకుంటే, భారతీయుల్లో కొవిడ్‌ను తట్టుకునే హెర్డ్‌ ఇమ్యూనిటీ వృద్ధి చెందిందని భావించడానికి ఆస్కారమేర్పడుతోంది. 70 ఏళ్లలోపు వయసువారిలో కొవిడ్‌ వచ్చినా బతికి బట్టకట్టేవారు 99.95శాతమని నిపుణులు నిర్ధరించారు. కొవిడ్‌ వల్ల పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడి లక్షలమంది ఉపాధి కోల్పోయారు. ఫలితంగా వస్తుసేవలకు గిరాకీ పడిపోయి, పెట్టుబడులూ అడుగంటాయి.

ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టే బడ్జెట్‌కు ఉపాధి కల్పన, పెట్టుబడులు, గిరాకీ వృద్ధి అనే త్రిసూత్ర కార్యక్రమం పునాదిగా నిలవాలి. ఈ ఏటి బడ్జెట్‌ లాంటిది గడచిన 100 ఏళ్లలో ఎప్పుడూ రాలేదని సీతారామన్‌ ప్రకటించుకున్నారు. మరి కొత్త బడ్జెట్‌.. కొవిడ్‌ వల్ల గాడి తప్పిన ఆర్థిక రథాన్ని మళ్ళీ పరుగులు తీయించడానికి లక్షల్లో ఉద్యోగాలు సృష్టిస్తుందా? వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకొంటేనే జనం చేతిలో డబ్బులు ఆడి వస్తుసేవల వినియోగం పెరుగుతుంది. భారత జీడీపీలో 60 శాతానికి వినియోగమే మూలాధారం కాబట్టి ఉద్యోగాల సృష్టి తప్పనిసరి. 12 కోట్లమందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాని(ఎంఎస్‌ఎంఈ)కి ఈ బడ్జెట్‌లో భారీ ప్రోత్సాహకాలు ప్రకటించాలి. కొవిడ్‌ వ్యాప్తికి చైనాయే కారణమని భావిస్తున్న ప్రపంచ దేశాలు అక్కడి నుంచి దిగుమతులను తగ్గించుకునే అవకాశం ఉంది. దీన్ని సువర్ణావకాశంగా తీసుకుని భారతీయ ఎంఎస్‌ఎంఈ రంగం ఎగుమతులను పెంచుకోవాలి. ఇప్పటికే భారతీయ ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈల వాటా 42 శాతంగా ఉంది. 2021లో ఉద్యోగాల సృష్టి, స్వదేశీ వినియోగం, విదేశీ ఎగుమతులు ఊపందుకోవాలంటే ఈ వాటాను మరింత పెంచే చర్యలను బడ్జెట్లో ప్రకటించాలి. దేశంలోని మొత్తం 6.34 కోట్ల ఎంఎస్‌ఎంఈ యూనిట్లలో 20 శాతం గ్రామ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈలు స్వదేశంలో, విదేశాల్లో సులువుగా విక్రయాలు జరుపుకోవడానికి ప్రత్యేక ఇ-కామర్స్‌ వేదికను ఏర్పాటు చేయాలి. దాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడానికి ఎంఎస్‌ఎంఈలకు డిజిటల్‌ సాంకేతికతల్లో శిక్షణ ఇవ్వాలి.

ఆర్థికానికి కొత్త ఊపిరి

భారీ పరిశ్రమల్లోనూ డిజిటలీకరణను విస్తరించి, సిబ్బందికి ఆ టెక్నాలజీలలో పునర్‌ శిక్షణ చేపట్టాలి. కొవిడ్‌ కాలంలో వలస కూలీలే కాకుండా అన్ని రకాల వృత్తి ఉద్యోగాలు చేసుకునేవారు స్వస్థలాలకు తరలిపోక తప్పలేదు. వలస కూలీలకు, ఎంఎస్‌ఎంఈ రంగ కార్మికులకు, వలస కూలీలకు కనీస వేతనాలను పెంచి వారు తిరిగిరావడానికి సానుకూల వాతావరణం ఏర్పరచాలి. సేవా రంగ సిబ్బందికి, కొత్తగా 'రిక్రూట్‌' అయ్యేవారికి అధునాతన సాంకేతికతల్లో ఉన్నతస్థాయి శిక్షణ ఇవ్వాలి. 2030కల్లా ఆటొమేషన్‌, కృత్రిమ మేధ, రోబాటిక్స్‌ వంటి టెక్నాలజీలను అభివృద్ధి చేసి, వాటిని ఆచరణలోకి తీసుకువచ్చే బాధ్యతలు నిర్వహించడానికి ప్రపంచవ్యాప్తంగా రెండు నుంచి అయిదు కోట్లమంది నిపుణులు కావలసి వస్తుంది. ప్రపంచమంతటా 37.5 కోట్ల సిబ్బందికి ఈ కొత్త తరహా ఉద్యోగాలు చేయడానికి అధునాతన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి కొత్త బడ్జెట్లో తగు ప్రోత్సాహకాలు, విధానాలు ప్రకటించాలి. కొవిడ్‌వల్ల ఇంటి నుంచి పనిచేసే సంస్కృతి పెరిగింది. గతంలో ఇంటి బాధ్యతల వల్ల ఉద్యోగాలు మానేసిన మహిళలు పెద్ద సంఖ్యలో తిరిగి ఉద్యోగాల్లోకి రాగలుగుతున్నారు. మహిళలను పెద్దయెత్తున నియమించుకొంటున్న ఐటీ కంపెనీలకు కొత్త బడ్జెట్లో పన్ను రాయితీలు ఇవ్వాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. లాక్‌డౌన్‌ కాలంలో ఒప్పంద ఉద్యోగులూ పెరిగారు. వీరికి సమంజసమైన జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను కల్పించే కంపెనీలకూ రాయితీలు ఇవ్వాలి.

గడచిన డిసెంబరునాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 3.87 కోట్లకు చేరిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ తెలిపింది. కొవిడ్‌ మూలంగా సేవా, పారిశ్రామిక రంగాలు రెండింటిలో ఉద్యోగ నష్టం సంభవించింది. భారత ఆర్థిక వ్యవస్థలో 65శాతానికి ఈ రెండు రంగాలే ఆలంబన. ఈ రంగాలు తిరిగి పరుగుతీయాలంటే ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు పెరగాలి. మౌలిక వసతులు, జౌళి, భవన నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు ఎంత పెరిగితే, ఉపాధి అంతగా రెక్కలు తొడుక్కుంటుంది.

ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు

జనవరి 16 నుంచి దేశంలో మొదలైన వ్యాక్సిన్‌ కార్యక్రమం జనంలో ధీమాను మరింత పెంచుతోంది. చాలాదేశాల్లో మాదిరి భారత్‌లోనూ రెండోసారి కొవిడ్‌ విజృంభించే ప్రమాదం లేకపోలేదు. 'హెర్డ్‌ ఇమ్యూనిటీ' ఏర్పడిన మాట నిజమే అయితే- రెండో దశ విజృంభణ జనసమ్మర్దం ఎక్కువగా ఉండే నగరాలు, జిల్లాలకు పరిమితం కావచ్చు. ఏతావతా, భారతీయుల్లో 'హెర్డ్‌ ఇమ్యూనిటీ' ఏర్పడిందనే భావన బలపడుతున్నా మితిమీరిన ధీమా ఎంతమాత్రం తగదు. టీకా వేసుకున్న తరవాతా మాస్కులు, శానిటైజర్ల వాడకం, భౌతిక దూరం పాటింపు కొనసాగాలి.

- ఆర్య

ABOUT THE AUTHOR

...view details