Healthy Recipes With Pulses: చనా కోకోనట్ మిల్క్ కర్రీ
కావలసినవి: పెద్ద సెనగలు: కప్పు (ముందుగా నానబెట్టుకోవాలి), ఉల్లిపాయ: ఒకటి, అల్లం తరుగు: చెంచా, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, టొమాటోగుజ్జు: అరకప్పు, కొబ్బరిపాలు: పావుకప్పు, పసుపు: అరచెంచా, కారం: చెంచా, జీలకర్రపొడి: చెంచా, దనియాలపొడి: చెంచా, గరంమసాలా: చెంచా, చాట్‌మసాలా: చెంచా, నెయ్యి: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత.
తయారీ విధానం:నానబెట్టుకున్న సెనగల్ని ఆ నీళ్లతో సహా కుక్కర్‌లో తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి అయిదారు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక అల్లం, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయముక్కలు వేయించి టొమాటో గుజ్జు వేయాలి. అది మగ్గిందనుకున్నాక కొబ్బరిపాలు పోసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, సెనగలతోపాటు మిగిలిన పదార్థాలను ఒకదాని తరువాత మరొకటి వేసుకుని బాగా కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. కూర దగ్గరకు అయ్యిందనుకున్నాక దింపేయాలి.
అలసందల కర్రీ
కావలసినవి: అలసందలు: కప్పు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, ఆవాలు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, పసుపు: పావుచెంచా, నూనె: రెండు పెద్ద చెంచాలు. మసాలాకోసం: కొబ్బరి తురుము: అరకప్పు, నానబెట్టిన బియ్యం: చెంచా, దనియాలు: ఒకటిన్నర చెంచా, జీలకర్ర: చెంచా, ఎండుమిర్చి: అయిదు, చింతపండు గుజ్జు: చెంచా, బెల్లం ముక్క: కొద్దిగా, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: అలసందల్ని రెండుమూడు గంటల ముందు నానబెట్టుకుని తరువాత కుక్కర్‌లో మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు వేయించాలి. తరువాత ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కరివేపాకు కూడా వేయించుకుని పసుపు వేసి మూత పెట్టి టొమాటోముక్కల్ని మగ్గనివ్వాలి. ఈలోపు మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టొమాటోలు మెత్తగా అయ్యాక, చేసిపెట్టుకున్న మసాలా, బొబ్బర్లు, తగినంత ఉప్పు వేసి కలపాలి. కూర దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.
పాలక్ రాజ్మా మసాలా
కావలసినవి: రాజ్మా: కప్పు (ముందురోజు నానబెట్టుకోవాలి), నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, బిర్యానీ ఆకులు: రెండు, యాలకులు: రెండు, ఉల్లిపాయ ముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: రెండు, అల్లం ముద్ద: రెండు చెంచాలు, వెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, టొమాటో గుజ్జు: అరకప్పు, దనియాలపొడి: చెంచా, పసుపు: అరచెంచా, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: ఒకటిన్నర చెంచా, ఉప్పు: తగినంత, పాలకూర తరుగు: రెండు కప్పులు, కసూరీమేథీ: చెంచా, కొత్తిమీర: కట్ట, నిమ్మరసం: రెండు చెంచాలు, క్రీమ్: రెండు చెంచాలు.
తయారీ విధానం: స్టౌమీద కుక్కర్‌ను పెట్టి నూనె వేయలి. అది వేడెక్కాక బిర్యానీ ఆకులు, యాలకులు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించాలి. అవి కూడా వేగాక అల్లం- వెల్లుల్లి ముద్ద వేయించుకుని తరువాత టొమాటో గుజ్జు, దనియాలపొడి, పసుపు, కారం, గరంమసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అన్నీ వేగాక నానబెట్టుకున్న రాజ్మా వేసి మూత పెట్టి ఆరు కూతలు వచ్చాక స్టౌని కట్టేయాలి. ఆవిరంతా పోయాక... మూత తీసి కుక్కర్‌ను మళ్లీ పొయ్యిమీద పెట్టి, పాలకూర తరుగు, కసూరీమేథీ, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. పాలకూర ఉడికిందనుకున్నాక క్రీమ్ వేసి దింపేయలి.