ప్రేమించడం కన్నా ప్రేమించబడడం అదృష్టం అంటారు. అయితే అది హద్దుల్లో ఉన్నంతవరకు ఓకే. కానీ ఆ ప్రేమ మితిమీరితే మాత్రం ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఆలుమగల మధ్య ఈ అపారమైన ప్రేమ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. అవి వైవాహిక బంధాన్ని బీటలు వారేలా చేస్తాయి.
అత్యుత్సాహం చూపద్దు..
సాధారణంగా భాగస్వామిని అమితంగా ఇష్టపడేవారు వాళ్లకు సంబంధించిన అన్ని పనుల్లోనూ సహాయపడాలని లేదా భాగస్వామ్యం పొందాలని తాపత్రయపడతారు. తద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందన్నది వారి భావన. అయితే ఎల్లవేళలా ఈవిధంగా భాగస్వామి పనుల్లో కల్పించుకోవడానికి అత్యుత్సాహం చూపకూడదు. ఫలితంగా వారు కొన్ని సందర్భాల్లో అసౌకర్యానికి గురవ్వచ్చు. అంతేకాదు.. తాము చేసే పనిలో తప్పులు దొర్లుతాయేమోనని లేదంటే తాము చేసే పనిపై తమ భాగస్వామికి నమ్మకం లేకపోవడం వల్లే తమకు సంబంధించిన అన్ని పనుల్లో వారు కల్పించుకుంటున్నారనే భావన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ భాగస్వామిలో మానసికంగా ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి సమస్యలెదురైనప్పుడు మీలో ఉన్న ప్రేమ వారికి సహాయం చేసే విధంగా ఉండాలే కానీ అన్ని విషయాల్లో వేలు పెట్టడం సరికాదు. ఈ సూత్రాన్ని పాటిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం పెరగడమే కాదు.. దాంపత్య బంధం కూడా దృఢమవుతుంది.
నన్ను పట్టించుకోవట్లేదు..
'చిన్నూ.. పెళ్త్లెన కొత్తలో నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టేవాడివి కాదు.. ఇప్పుడు నాతో గడపడానికి నీకు తీరికే దొరకడం లేదు కదా..!' ఏంటీ.. ఈ డైలాగ్ వినగానే మీరూ మీ భాగస్వామితో ఎప్పుడో అన్నట్లు గుర్తొస్తోందా?? చాలామంది తమ భాగస్వామి ముందు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం సర్వసాధారణం. అయితే పని ఒత్తిడిలో పడిన భాగస్వామికి మీ గురించి గుర్తు చేయడానికి ఎప్పుడో ఒకసారి ఇలా సరదాగా అంటే ఫర్వాలేదు. కానీ రోజూ ఇలాగే మీ భాగస్వామి మీపై మితిమీరిన ప్రేమ చూపాలనుకోవడం కరక్ట్ కాదు. ఎందుకంటే ఇలా మీరు రోజూ వారిని విసిగించడం వల్ల వారికి మీపై ప్రేమ పెరగడం కాదు.. తగ్గిపోయే అవకాశాలూ ఉన్నాయి. కాబట్టి మీతో గడపడానికి వారికి తీరిక ఎందుకు దొరకట్లేదనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా మసలుకుంటే భార్యాభర్తల మధ్య మితిమీరిన ప్రేమతో గొడవలు రాకుండా ఉంటాయి. ఈ చిట్కా మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే తత్వాన్ని, ఆప్యాయతను పెంచుతుంది.