Gender Pay Gap: మగవాళ్లతో సమానంగా పని.. మరి జీతంలో తేడా ఎందుకు? - మహిళలపై వివక్ష
పురుషుల ఆధిపత్యం (male dominated)ఎక్కువగా ఉండే సేల్స్ టీమ్‌లో పని చేస్తున్నా. మా బృందంలో నేనొక్కదాన్నే అమ్మాయిని. నాలుగేళ్లుగా దీనిలో కొనసాగుతున్నా. పనిలో పోటీ, టార్గెట్‌లు ఎక్కువ. అయినా ఆస్వాదిస్తూ మగవాళ్లతో సమానంగా పూర్తిచేస్తున్నా. కానీ వాళ్లతో పోలిస్తే నా జీతం తక్కువే. ఇది నన్ను నిరాశపరుస్తోంది. దీన్నెలా ఎదుర్కోవాలి? - శ్రిద, బెంగళూరు
Gender Pay Gap: మగవాళ్లతో సమానంగా పని.. అయిన జీతంలో తేడా ఎందుకు?
By
Published : Nov 20, 2021, 10:26 AM IST
చాలామంది మహిళల్లో ఇతరులతో జీతాన్ని పోల్చుకోకూడదన్న భావన ఉంటుంది. ఏమనుకుంటారో అనో, ఎలా తెలిసిందని బాస్ ప్రశ్నిస్తారనో మిన్నకుండిపోతారు. ఒక్కోసారి తమపై తమకు నమ్మకం లేకపోవడమూ కారణమవొచ్చు. ముందు వీటిని
అధిగమించండి. కొన్ని సంస్థల్లో జీతాల గురించి చర్చించొద్దనే నియమం ఉంటుంది. దీనివల్ల తెలుసుకునే, తెలిసినా దానిపై చర్చించే అవకాశాలు తక్కువ. దీనివల్ల లాభపడేది యాజమాన్యమే. కానీ మగ సహోద్యోగుల కంటే తక్కువ వేతనం పొందుతున్నట్లు అనిపిస్తే.. నేరుగా వారితో మాట్లాడమే ఉత్తమం. ఆఫీసులో కాకుండా చూసుకుంటే చాలు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందీ పడొద్దు. నేరుగా కష్టమనిపిస్తే పరోక్షంగా ప్రయత్నించండి. ఆపై ‘నేను, ఫలానా వ్యక్తి ఒకేసారి ఉద్యోగంలో చేరాం. తనతో సమాన బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. అయినా జీతం విషయంలో అంతరం ఉంది. కారణాన్ని తెలుసుకోవచ్చా?’ అని మీ మేనేజర్‌ని అడిగి చూడండి.
అయితే మీ సహోద్యోగి జీతం గురించి ఎలా తెలుసన్న సంభాషణకు ఆస్కారమివ్వకండి. కొంతమంది మేనేజర్లు దీనిపై దృష్టిపెట్టొచ్చు. అదే జరిగితే సంభాషణ దారి మళ్లించండి. ఆయనతో లాభం లేదనిపిస్తే హెచ్‌ఆర్‌ను కలవండి. చెల్లింపుల్లో లింగ అంతరాలు సంస్థకు చట్టపరమైన, పీఆర్ సమస్యలు కలిగిస్తాయని వాళ్లు గుర్తించగలరు. కాబట్టి, త్వరగా చర్యలు తీసుకోగలుగుతారు. అయితే ఇక్కడ బాస్.. తనకు వ్యతిరేకంగా మీరు హెచ్‌ఆర్ వాళ్లను కలిసినట్టుగా భావించొచ్చు. కాబట్టి, ఈ విషయంగా మీ పేరు రాకుండా చూడమని వాళ్లను ముందుగానే కోరండి. చివరగా సమస్యను ఎత్తి చూపడానికి ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. ముందు ఏం, ఎలా మాట్లాడాలన్నదానిపై మనసులో ఆలోచించుకోండి. తర్వాతే ప్రయత్నించండి. లింగ వేతన వ్యత్యాసాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోవచ్చు, కానీ చర్య తీసుకునేలా ప్రయత్నించొచ్చు.