ఫేస్‌బుక్ ఫ్రెండే సహోద్యోగి! ఏం చేయమంటారు?
మా ప్రాజెక్టు టీమ్‌లోని సభ్యులంతా కలిసిమెలసి పనిచేస్తాం. అందులో ఒక సభ్యుడైతే ప్రాజెక్టులో చేరకముందే నాకు ఫేస్‌బుక్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు తనతో ఫేస్‌బుక్ స్నేహం కొనసాగించడం మంచిది కాదనిపిస్తోంది. తక్కిన సహోద్యోగులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినా నేను అంగీకరించడం లేదు. ఇలా చేయడం కాస్త ఇబ్బందిగానే ఉంది. నన్నేం చేయమంటారు? - సుస్మిత, హైదరాబాద్
అతడిని అన్‌ఫ్రెండ్ చేయడమే మంచిది. మన వ్యక్తిగత అలవాట్లు, కుటుంబ విషయాలు సహోద్యోగులకు తెలియడం ఇబ్బందే. ఫేస్‌బుక్ ఫ్రెండ్ అయిన మీకు అవన్నీ తెలిసి ఉండటం వల్ల అతడు కూడా ఇబ్బందిపడవచ్చు. అతను అనారోగ్యమని చెప్పి ఆఫీసుకు సెలవు పెట్టి.. ఏదో ఫంక్షన్‌కు వెళ్లి, అక్కడ తీసుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టాడనుకోండి..అది చూసిన మీకు అసలు విషయం తెలుస్తుంది. అది అతడికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఇవన్నీ పని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. అందుకే ఫేస్‌బుక్ ద్వారా మెసేజ్ ఇచ్చి అతడిని అన్‌ఫ్రెండ్ చేయడం మంచిది. ‘ఇప్పుడు మనం సహోద్యోగులం కావడం వల్ల మీతో ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగించలేను’ అని సున్నితంగా చెప్పండి. సహోద్యోగుల మధ్య ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ వల్ల వ్యక్తిగత విషయాలు పనిచేసే చోట చర్చకు వచ్చి పని వాతావరణం కలుషితమయ్యే అవకాశముంది.