మీ పరిస్థితులను మీరే స్వీయ విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నించండి. అతను నిజంగా తల్లిదండ్రుల మాటకే గౌరవం ఇచ్చే వ్యక్తి అయితే.. తల్లిదండ్రులను ఎదిరించి మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉండేవారు కాదు. అలాగే ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భార్య మాటకే విలువిస్తాడు.. మమ్మల్ని పట్టించుకోడు’ అనే భావన మీ అత్తమామలకూ ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి అతని దృష్టిలో వాళ్లకు విలువ తగ్గలేదు అని చూపించే ప్రయత్నం అతిగా చేస్తున్నాడా? అనే విషయం గురించి ఆలోచించండి.
మీ అత్తమామలకు మీపట్ల వ్యతిరేకత పెళ్లికి ముందు నుంచే ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి మిమ్మల్ని వారికి అనువుగా ఉండే కోడలిగా చూపించుకోవడానికి అతిగా వ్యవహరించాడేమో? దానితో విసిగిపోయిన మీరు పుట్టింటికి వెళ్లిపోవడంతో ‘చూశావా మేము చెప్పిందే జరిగింది’ అనే అవకాశం వాళ్లకు దొరికిందేమో? అన్న విషయాలను పరిశీలించుకోండి. ఎవరు ఏం చెప్పినా అది ఊహాగానమే అవుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరిద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టండి. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ మనసుల్లో ఏముంది? మీ ఆలోచనలు ఏంటి? అనేవి స్పష్టం చేసుకోండి. దీనివల్ల సమస్య ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న కారణాలను పెద్దవి చేసుకోవడం వల్ల మీ ప్రేమను మీరే పలుచన చేసుకున్న వారవుతారేమో అన్న విషయాన్ని కూడా ఆలోచించండి.