తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Relationship Tips: రెండోసారి ప్రేమలో... ఆ తప్పు మళ్లీ జరక్కుండా చూసుకోండి!

ఒకసారి ప్రేమలో విఫలమయ్యామంటే ఇక ఆ బంధంపై నమ్మకం పూర్తిగా కోల్పోతాం. దీనికి మొదటి అనుబంధంలో ఎదురైన చేదు జ్ఞాపకాలు, ఇతర అంశాలు కారణాలు కావచ్చు. అయితే బ్రేకప్‌ అయినంత మాత్రాన మన జీవితం ఇక్కడే ఆగిపోదు. కాబట్టి ఆ బాధ నుంచి క్రమంగా బయటపడుతూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అంతేకాదు.. ఇలా ఓసారి దెబ్బతిన్న వారు మరోసారి ప్రేమంటేనే విసుగెత్తుతుంటారు. అవతలి వారు తమని నిజాయతీగా ప్రేమిస్తున్నప్పటికీ.. ఇది కూడా బ్రేకప్‌ అవుతుందేమోనని భయపడుతుంటారు. అయితే ఇలాంటి నిజమైన ప్రేమను అంగీకరించడంలో తప్పు లేదని, ఈ క్రమంలో కొన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే ఈ ప్రేమబంధాన్ని శాశ్వతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

tips-to-fall-in-love-for-the-second-time
రెండోసారి ప్రేమలో... ఆ తప్పు మళ్లీ జరక్కుండా చూసుకోండి!

By

Published : Aug 24, 2021, 11:31 AM IST

‘ఓసారి ప్రేమించాక.. ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానే రాదమ్మా.. ఓసారి కలగన్నాక.. ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా..’ అవును.. ప్రేమంటే అదే మరి! కానీ వ్యక్తిగత కారణాలు, చిన్న చిన్న మనస్పర్థలే ప్రస్తుతం చాలామంది ప్రేమికుల మధ్య చిచ్చుపెడుతున్నాయి. వారి అనుబంధాన్ని బ్రేకప్‌ దాకా లాగుతున్నాయి. దీంతో ‘వన్‌సైడ్‌ లవ్‌’ శాశ్వతం కాదు కాబట్టి.. ఇష్టం లేకపోయినా కొంతమంది తమ భాగస్వామితో విడిపోతుంటారు. ఇలాంటి వారు మరోసారి ప్రేమలో పడడమంటే అది చాలా అరుదనే చెప్పాలి. మొదటి ప్రేమబంధం తమ జీవితంలో మిగిల్చిన చేదు జ్ఞాపకాలే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే మరి నిజంగానే రెండోసారి ప్రేమ పలకరిస్తే.. దాన్ని స్వీకరించాలా? వద్దా? అంటే.. ఆ ప్రేమలో నిజాయతీ ఉంటే దాన్ని స్వీకరించడంలో తప్పేం లేదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అయితే ఈ క్రమంలో మొదటిసారి జరిగిన తప్పు మరోసారి రిపీట్‌ కాకుండా ఉండాలంటే ముఖ్యంగా అమ్మాయిలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.

మొదటిసారి విఫలమైన ప్రేమ నుంచి పాఠాలు నేర్చుకొని.. రెండోసారి దాన్ని అంగీకరించే క్రమంలో మనసులో కొన్ని భయాలుండడం సహజమే! అలాగని ఎప్పుడూ వాటినే తలచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేం! ఈ క్రమంలో కొంతమంది మొదటిసారి ఎదురైన చేదు జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ.. ఇప్పుడున్న సంతోషాన్ని కోల్పోతుంటారు. కానీ దీనివల్ల మానసిక ఒత్తిడి తప్ప మరే ప్రయోజనం ఉండదు. అందుకే మీ ప్రేమను కోరుతూ మీ వద్దకొచ్చే వ్యక్తి తన మనసులో మీపై ఎంత ప్రేముందో వ్యక్తపరచనివ్వండి. ఈ క్రమంలో మీకు అంతగా సందేహం అనిపిస్తే.. ‘అసలు నేను మీకు ఎందుకు నచ్చాను? నన్నే ఎందుకు ప్రేమించాలనుకున్నారు?’ అని మీరు నిర్మొహమాటంగా అడగచ్చు. అలాగే ఇదే సంభాషణలో భాగంగా వారి అభిరుచులు, ఇష్టాయిష్టాలు వంటివి తెలుసుకోవడంతో పాటు మీ అభిరుచులు, ప్రాధాన్యతల గురించి కూడా వారికి వివరించండి. తద్వారా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఒక కచ్చితమైన అవగాహన ఏర్పడుతుంది. ప్రేమ బంధాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఇది తొలి అడుగు అంటున్నారు నిపుణులు.

మీరంటే ఇష్టమంటూ వచ్చిన వ్యక్తి దగ్గర మీ గత అనుబంధం గురించి దాచడం ఎంతమాత్రం కరక్ట్‌ కాదు. దాని గురించి మూడో వ్యక్తి చెబితే తెలుసుకోవడం కంటే మీరే నేరుగా వారితో చెప్పడం వల్ల మీ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు దొర్లకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఈ క్రమంలో వారికి సంబంధించి గతంలో చేదు జ్ఞాపకాలు, బ్రేకప్స్‌ ఏమైనా ఉన్నాయేమో అని మనసులో సందేహించే కంటే నేరుగా అడిగేయడం మంచిది. తద్వారా వారి నిజాయతీ గురించి మీకు తెలుస్తుంది. ఇలా ఒకరికొకరు చెప్పుకునే క్రమంలో మీ మనసుల్లో ఉన్న బాధ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. అయితే అంతటితో మీ సంభాషణను ఆపకుండా.. భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకుంటే ఓ పనైపోతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ గోల్స్‌, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? వంటివన్నీ వారితో చెప్పచ్చు. అలాగే భవిష్యత్తులో వారేం చేయాలనుకుంటున్నారో కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. ఇలా ఇద్దరూ పంచుకున్న అభిప్రాయాల్ని ఒకరికొకరు గౌరవించుకోవాలే తప్ప విమర్శించడం, ఇది నాకు నచ్చలేదనడం.. అస్సలు సరికాదు. అయితే ఎదుటివారి అభిప్రాయాల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే మాత్రం సలహా ఇవ్వడంలో తప్పులేదు.

ప్రేమబంధం ఎప్పుడూ ప్రైవసీని కోరుకుంటుంది. ప్రేమికులిద్దరూ ఒకరికి ఒకరుంటే చాలనుకుంటుంది.. ఈ క్రమంలో కుటుంబాన్ని, స్నేహితుల్నీ మర్చిపోతుంటాయి కొన్ని జంటలు. కానీ కొత్తగా, అది కూడా రెండోసారి ప్రేమబంధంలోకి అడుగుపెట్టే జంటలు తమ స్నేహితులతో కాస్త సమయం గడపడం మంచిదని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఈ క్రమంలో ఓసారి మీ భాగస్వామిని మీ స్నేహితులకు పరిచయం చేయడం, మరోసారి మీరు మీ లవర్‌ ఫ్రెండ్స్‌ని కలవడం.. చేయాలి. తద్వారా మీ భాగస్వామి గురించి మీకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇది మీ మధ్య అనుబంధాన్ని మరింత దగ్గర చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ కూడా పెరుగుతుంది.

ప్రేమంటే మనల్ని మనమే మర్చిపోయేలా చేస్తుంది. నిరంతరం భాగస్వామి ధ్యాసలో పడిపోయి.. ‘ఇలా ఉంటేనే వారికి నచ్చుతుందేమో?, తనకు ఆ రంగంటే ఇష్టం కాబట్టి ఈ రోజు ఆ కలర్‌ డ్రస్‌ వేసుకుంటా?’ అంటూ తమ ఇష్టాయిష్టాల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుంటారు కొందరు లవర్స్‌. అయితే ప్రేమ కోసం ఎదుటివారి ఇష్టాయిష్టాల్ని గౌరవించడం వరకు ఓకే కానీ ప్రతి విషయంలో మీ ప్రైవసీని కోల్పోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఎదుటివారికి ఇష్టం అనిపించిన ఇవే ఒక్కోసారి మీకు అసౌకర్యంగా అనిపించచ్చు. కాబట్టి మీకు ఏది నచ్చుతుందో ఆ పనే చేయమంటున్నారు నిపుణులు.. తద్వారా మీపై మీకు మరింత ఇష్టం, ఆత్మవిశ్వాసం ఏర్పడతాయి. ఇలా మీలో ఉన్న ఈ ప్రత్యేకత మీ భాగస్వామికీ నచ్చచ్చు. ఇక ఓసారి ప్రేమలో విఫలమయ్యాక ఇలాంటి సెల్ఫ్‌ లవ్‌ మిమ్మల్ని మరింత పాజిటివ్‌గా మార్చుతుంది కూడా!

ప్రేమంటే పెళ్లికి ముందే ఉంటుందా? ఆ ప్రేమను పెళ్లితో శాశ్వతం చేసుకున్నాక మునుపటిలాగే ప్రేమించుకోలేరా? అంటే.. అంతకుమించిన ప్రేమను కురిపించుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే రెండోసారి ప్రేమను అందుకున్నాక, ఆ ప్రేమలోని నిజాయతీని తెలుసుకున్నాక.. ఇక ఆలస్యం చేయకుండా ప్రేమబంధానికి పెళ్లితో పీటముడి వేయమంటున్నారు. ఈ క్రమంలో ముందుగా ఇరు కుటుంబాల్లోని పెద్దల్ని ఒప్పించి ఒక్కటవ్వాలంటున్నారు. ఇలా పెళ్లితో ఇద్దరొక్కటయ్యాక కూడా మీ అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకోవాలంటే.. అందుకు అకేషన్స్‌తో పనిలేదు.. మునుపటి లాగే రోజూ ఇద్దరూ కాస్త సమయం గడుపుతూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగితే చాలు.. ఇక మీ అనుబంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. ఈ క్రమంలో ఒకవేళ అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు వచ్చినా మీ అనుబంధం ముందు అవి నిలవలేవు.

సో.. ఇవండీ.. రెండోసారి ప్రేమలో అడుగుపెట్టి.. ఆ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు! మరి, ఇవన్నీ చదువుతుంటే మీకూ మీ సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రేమ మధురిమలు గుర్తొస్తున్నాయా? అయితే మీ ప్రేమ ముచ్చట్లు, మీ భాగస్వామితో మీకున్న మధురానుభూతులు, తీపి జ్ఞాపకాల గురించి మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మీరిచ్చే టిప్స్‌ మరెన్నో ప్రేమ జంటలకు ఉపయోగపడచ్చు!

ఇదీ చూడండి:Relationship Tips : ముచ్చటైన బంధానికి మూడు సూత్రాలు!

ABOUT THE AUTHOR

...view details