తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Parenting tips : ఈ చిన్న పనులే మిమ్మల్ని పిల్లలకు దగ్గర చేస్తాయి!

పిల్లలకు స్కూలు, పెద్దవాళ్లకు ఆఫీస్‌.. ఉదయం లేవగానే ఇలా ఎవరి హడావుడి వాళ్లకుంటుంది. పోనీ సాయంత్రమన్నా ఖాళీ దొరుకుతుందా అంటే ఆఫీస్‌ నుంచి వచ్చేసరికే ఆలస్యమవుతుంటుంది. దీంతో మీరు మీ పిల్లల్ని మిస్సవడం, వాళ్లు మిమ్మల్ని మిస్సవడం.. వంటివి జరుగుతుంటాయి. ఇదే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచి ప్రేమ తగ్గిపోయేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఈ దూరం తిరిగి దగ్గరవ్వాలంటే పిల్లల(Parenting tips)తో కలిసి చేసే కొన్ని రోజువారీ పనులతోనే అది సాధ్యమంటున్నారు. మరి, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అనుబంధం మరింతగా పెనవేసుకోవాలంటే చేయాల్సిన ఆ పనులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Parenting tips
Parenting tips

By

Published : Oct 16, 2021, 9:35 AM IST

కలిసి తింటే కలిమి!

మీ ఆఫీస్‌ సమయాలు, మీ పిల్లల స్కూల్‌ సమయాలతో సరిపడకపోవచ్చు. ఇదే ఇద్దరూ కలిసి గడిపే సమయం లేకుండా చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌.. కలిసి తినడం ఎలాగూ కుదరదు. అయితే చాలా వరకు డిన్నర్‌ సమయానికి కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి కనీసం డిన్నరైనా కలిసి చేసేలా ప్లాన్‌ చేసుకోమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ముందు కాస్త సమయమున్నట్లయితే.. వంట చేసే క్రమంలో పిల్లల్ని, భర్తని భాగం చేయడం.. అందరూ కలిసి పనిచేస్తూ కాసేపు మాట్లాడుకోవడం వల్ల శరీరానికి శ్రమా అనిపించదు.. తల్లిదండ్రులకు-పిల్లలకు(Parenting tips) మధ్య అనుబంధం కూడా రెట్టింపవుతుంది.

ఆ గ్యాప్‌ తగ్గించుకోవాలంటే..!

ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్లో కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర కూర్చొని మనసు విప్పి మాట్లాడుకోవడానికి కూడా సమయం దొరకట్లేదు. కనీసం ఇంట్లో పనులు చేసుకుంటూనైనా భర్త, పిల్లలతో నాలుగు మాటలు మాట్లాడదామంటే.. మీరు ఆఫీస్‌ నుంచి వచ్చేసరికే పిల్లలు పడుకోవడం లేదంటే చదువుకోవడం, భర్త ఆఫీస్‌ సమయాలు వేరుగా ఉండడం/ఇతర పనుల్లో తీరిక లేకుండా ఉండడం.. ఇలా ఒకరి సమయాలు మరొకరితో కలవకుండా ఉంటున్నాయి. ఫలితంగా ఎవరి మనసులో ఉన్న విషయాలు వాళ్ల మనసులోనే ఉండిపోతున్నాయి. కారణమేదైనా వీటివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ క్రమంగా పెరుగుతుందన్నది కాదనలేని వాస్తవం. మరి, ఈ గ్యాప్‌ తగ్గించుకోవాలంటే ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య రోజూ చర్చ జరగాల్సిందే! ఈ క్రమంలో సాయంత్రం పూట ఓ అరగంట సమయం కేటాయించడం లేదంటే భోంచేసే సమయంలోనో ఆ రోజు జరిగిన విషయాలు, సరదా సంఘటనల గురించి అందరూ కలిసి పంచుకోవాలి. ఆ రోజంతా పిల్లలకు ఎలా గడిచిందో అడిగి తెలుసుకోవాలి.. స్కూల్‌ విషయాలు చెప్పమని ప్రోత్సహించాలి. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధం పెరగడమే కాదు.. పిల్లలూ ఏ విషయాన్నీ దాయకుండా మీతో పంచుకోగలుగుతారు.

చెప్పాలి.. చదివించాలి!

ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులేమో గానీ పిల్లలంతా మొబైల్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. క్లాసులు లేనప్పుడు కూడా ఇంటర్నెట్‌లో అనవసర విషయాలు శోధిస్తూ సమయం వృథా చేస్తున్నారు. అయితే కొంతమంది పేరెంట్స్‌ అసలు విషయం గ్రహించక తమ పిల్లలు తెగ చదివేస్తున్నారన్న భ్రమలో ఉంటున్నారు. తమ పనుల్లో పడిపోయి వారిని పట్టించుకోవడం పూర్తిగా మానేస్తున్నారు. నిజానికి ఇది కూడా తల్లిదండ్రులు-పిల్లల మధ్య అనుబంధాన్ని దూరం చేస్తుందని చెప్పాలి. అందుకే పెద్దవాళ్లు తమ పనులతో ఎంత బిజీగా ఉన్నా సరే.. పిల్లలు స్కూల్‌ నుంచి ఇంటికొచ్చాక కాసేపు వాళ్ల కోసం సమయం కేటాయించాలని చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్లతో హోంవర్క్‌ చేయించడం, ఆ రోజు స్కూల్లో చెప్పిన పాఠాలు చదివించడం, రాత్రి పడుకునేటప్పుడు ఏదో ఒక చిన్న నీతి కథ చెప్పడం/లేదంటే వాళ్లనే చెప్పమనడం.. వంటివి చేయడం వల్ల వాళ్లకు సమయం కేటాయించినట్లవుతుంది. ఇద్దరి మధ్య దూరం పెరగకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

ఓ ముద్దూ-ఓ హగ్గూ!

  • ఉదయం లేవగానే హడావిడిలో పడిపోకుండా పిల్లలు, తల్లిదండ్రులు.. ఒకరికొకరు గుడ్‌మార్నింగ్‌ చెప్పుకోవడం, ఈ క్రమంలో పెద్దలు పిల్లలకు ఓ ముద్దూ-ఓ హగ్గూ ఇవ్వడం, రాత్రి పడుకునే ముందు గుడ్‌నైట్‌ చెప్పుకోవడం.. వంటివి రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలంటున్నారు నిపుణులు.
  • ఇంటి పనులు, వంట పనులు, ఇల్లు శుభ్రం చేయడం.. వంటి పనుల్లో మీతో పాటు మీ పిల్లల్నీ భాగం చేయడం వల్ల ఇద్దరూ కలిసి మరింత ఎక్కువ సమయం గడపచ్చు.
  • మీరు వ్యాయామం చేసేటప్పుడు, వాకింగ్‌/జాగింగ్‌కి బయటికి వెళ్లేటప్పుడు మీ పిల్లల్నీ మీతో పాటు కలుపుకోండి. తద్వారా వారి శరీరానికీ వ్యాయామం అందుతుంది.. ఒకరికొకరు మరింత దగ్గరవ్వచ్చు.
  • పేరెంట్స్‌-పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచడంలో ఆటలూ కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ‘పిల్లలతో ఆటలా..?’ అనుకోకుండా వీలు చిక్కినప్పుడల్లా వారితో సరదాగా ఆడుకోవడం/వారిని ఆడించడంలో తప్పు లేదు.
  • పర్యావరణ స్పృహ ఉన్న తల్లిదండ్రులు తమ ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవడం, గార్డెనింగ్‌.. వంటివి చేస్తుంటారు. అయితే ‘పిల్లలకెందుకు ఈ పనులు?!’ అనుకోకుండా వాళ్లనూ వీటిలో భాగం చేయడం వల్ల వారికి మంచి అలవాట్లు అలవడడంతో పాటు ఇద్దరూ కలిసి కాసేపు సమయం గడిపినట్లూ ఉంటుంది.

ఇలా ఆలోచిస్తే పేరెంట్స్‌-పిల్లలు కలిసి చేసే పనులు, అనుబంధాన్ని దగ్గర చేసుకునే మార్గాలు బోలెడుంటాయి. మరి, మీ చిన్నారులతో చెలిమి పెంచుకోవడానికి మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మాతో పంచుకోండి!

ABOUT THE AUTHOR

...view details