ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధుర ఘట్టం. దాంపత్య జీవితం కలకాలం నిలవాలని అందరూ కోరుకుంటారు. అయితే ఒక్కోసారి కొద్ది రోజులకే దంపతుల మధ్య భేదాభిప్రాయాలు మొదలవుతాయి. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి, ఆ బంధం బీటలు వారే వరకు కొనసాగుతాయి. మొగ్గదశలోనే ఇటువంటి సందర్భాలను తుంచేయగలిగితే ఆ దంపతుల మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఇరువురూ తమ మాటలో ఎదుటి వారిపై ప్రేమను నింపితే చాలు అది వారిని కలకాలం కలిసి ఉండేలా చేస్తుందని సూచిస్తున్నారు.
మిస్ కాకుండా...
ఇరువురూ ఒకరినొకరు మిస్ కాకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ కాలంలో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటప్పుడు దొరికిన కొంత సమయాన్నీ ఇద్దరూ కలిసి గడపడం నేర్చుకోవాలి. ఆ రోజు ఎదురైన సంఘటనలు, అనుభవాలను పంచుకోవాలి. సెలవు రోజున ఇరువురూ కలిసి వంటపని, తోటపని, ఇంటి శుభ్రతలో పాలుపంచుకోవాలి. సమయం ఉన్నప్పుడల్లా దంపతులు ఒకరికోసం మరొకరు అన్నట్లుగా ఉంటే ఆ బంధం మరింత బలపడుతుంది.