వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల రోజంతా భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే ఉండడం ఒక కారణమైతే.. ఇటు ఇంటి పని- అటు ఆఫీస్ ఒత్తిడి మరో కారణమవుతోంది. దీంతో ఉన్న పనికే 24 గంటలు సరిపోవట్లేదంటే ఇక ఏకాంతంగా గడిపే సమయమెక్కడిది? అంటూ చాలామంది ఆలుమగలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా ఒత్తిడితో సతమతమయ్యే దంపతులకు పడకగదే ప్రణయ తీరం అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఎంతైనా రోజులో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పటికీ రాత్రి పడుకునే ముందు వీలు చూసుకొని కాస్త సమయం ఒకరితో ఒకరు గడపడానికి కేటాయించుకుంటే ఈ కోపతాపాలు, గొడవలే రావంటున్నారు. తద్వారా దాంపత్య బంధం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసిస్తుందని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ పడకగదిని ప్రణయ తీరంగా మార్చుకోవాలంటే పడుకునే ముందు ఆలుమగలు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..
కలిసి వెళ్లాలి..
'వినోద్.. ఈ రోజు ఇంట్లో కాస్త పని ఎక్కువైంది. నాకు చాలా అలసటగా ఉంది. అన్నం, కూర అన్నీ డైనింగ్ టేబుల్‌పై రెడీగా ఉంచాను. కాస్త నువ్వే వడ్డించుకొని తినకూడదు..! నేనెళ్లి పడుకుంటా..', ఓ భార్య వినతి.
'కీర్తనా.. ఆఫీసులో ఈ రోజు మీటింగ్ జరిగింది. దానికి తోడు అదనపు పని ఒత్తిడితో నా తల పగిలిపోయేలా ఉంది. నీ పని త్వరగా పూర్తి చేసుకుని వచ్చెయ్.. నేను వెళ్లి పడుకుంటాను ప్లీజ్..' ఓ భర్త తన భార్యకు చెబుతున్న మాట.
మీరు కూడా ఇలా ఎవరికి వారే వెళ్లి పడుకుంటున్నారా? అయితే ఆ పద్ధతిని ఎంత త్వరగా మార్చితే అంత మంచిది. ఎందుకంటే రాత్రుళ్లు నిద్రపోవడానికి పడకగదిలోకి ప్రవేశించే దంపతులు ఎవరికి వారుగా కాకుండా కలిసి వెళ్లడం వల్ల వారి మధ్య అనుబంధం మరింతగా బలపడుతుందంటున్నారు నిపుణులు. అయితే ఇది అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. కానీ వీలైనప్పుడల్లా ఇలా చేయడానికే దంపతులు మొగ్గు చూపడం మంచిది. ఈ క్రమంలో ఒకవేళ ఇద్దరిలో ఎవరి పని త్వరగా పూర్తయినా మరొకరి కోసం కాసేపు వేచి ఉండడంలో తప్పులేదంటున్నారు. ఎందుకంటే దీనివల్ల ఆలుమగల మధ్య అర్థం చేసుకునేతత్వం, సర్దుకుపోవడం.. వంటివి అలవడతాయి. ఇలాంటివన్నీ వారి అనురాగాన్ని రెట్టింపుచేసేవే కదా!