తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Things to Think Before Marriage: పెళ్లికి ముందే ఇవన్నీ ఆలోచిస్తున్నారా? - పెళ్లికి ముందే ఇవన్నీ ఆలోచిస్తున్నారా?

Things to Think Before Marriage: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి వివాహం అనే సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. ఇలా ఒక్కసారి దాంపత్య బంధంలోకి అడుగు పెట్టాక.. ఇక నిండు నూరేళ్లు ఒకరికొకరు తోడూనీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. కానీ కొంతమంది పెళ్లి తర్వాత.. 'నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి తర్వాత జీవితం ఇలా ఉంటుందనుకోలేదు, నువ్వు ఇలా ఉంటావనుకోలేదు..' అంటూ పరస్పరం నిందారోపణలకు దిగుతుంటారు. ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు. ఇది వారి జీవితంలో బాధల్ని నింపగలదే తప్ప సంతోషాన్ని పంచలేదు. కాబట్టి పెళ్త్లెన తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పెళ్లికి ముందే అన్ని రకాలుగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

Things to Think Before Marriage
Things to Think Before Marriage

By

Published : Jan 26, 2022, 10:44 AM IST

Things to Think Before Marriage:

కాబోయే భాగస్వామి గురించి..

పెళ్లి కుదిరాక ఒకరి గురించి మరొకరు మరింత వివరంగా తెలుసుకోవడం వల్ల పెళ్లి తర్వాత దాంపత్య జీవితంలో ఎలాంటి కలతలు రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీ భాగస్వామి ఎలాంటి వారు? తన అభిరుచులు, ఇష్టాయిష్టాలు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టమేనా?.. మొదలైన వివరాలన్నీ ముందుగానే తనను అడిగి తెలుసుకోవడం; మీ గురించి కూడా మీ కాబోయే భాగస్వామికి తెలియజేయడం.. మంచిది. ఫలితంగా పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి కీచులాటలకు తావుండదు. అలాగే పెద్దలు కూడా ఒకరి కుటుంబం గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం.

అదనపు బాధ్యతలు..

పెళ్లికి ముందు వరకు ఎంత స్వేచ్ఛగా జీవితాన్ని గడిపినా.. పెళ్లి తర్వాత మాత్రం కొన్ని అదనపు బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇలా ఎలాంటి పనులైనా, బాధ్యతలైనా ఆనందంగా స్వీకరిస్తాం అనే ఆత్మవిశ్వాసం మీలో ఉందో లేదో పెళ్లికి ముందే బేరీజు వేసుకోవడం మంచిది. లేదంటే పెళ్లి తర్వాత దంపతుల మధ్య, ఇరు కుటుంబాల మధ్య లేనిపోని అపార్థాలు, గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మీరు పెళ్లి చేసుకుని వెళ్లే ఇంట్లో మీరు ఇప్పటివరకు అనుభవించినట్లుగా అన్ని సౌకర్యాలు ఉండకపోవచ్చు. వాటి విషయంలో కూడా సర్దుకుపోతామనే ధైర్యం, దృఢ సంకల్పం మీలో ఉందో లేదో ముందుగానే ఆలోచించుకోవాలి. కాబోయే జీవిత భాగస్వామికి అన్ని విషయాల్లో తోడూనీడగా నిలుస్తూ కష్టసుఖాల్ని పంచుకునేందుకు కూడా మీరు సిద్ధమో కాదో ఒక్కసారి ఆలోచించుకోవడం ముఖ్యం. ఇలా ముందుగానే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం వల్ల పెళ్లి తర్వాత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.

ఉమ్మడిగానా? విడిగానా?

ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. చాలామంది వివిధ కారణాల రీత్యా పెళ్లి కాగానే కుటుంబం నుంచి బయటికి వచ్చేసి వేరే కాపురం పెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఉమ్మడి కుటుంబాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. మీకు ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేకపోతే.. పెళ్లి తర్వాత అది పెద్ద గొడవలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీకు కాబోయే భాగస్వామి అభిప్రాయం ఎలా ఉందో కనుక్కోవడం మంచిది. ఫలితంగా ఇద్దరి మధ్య.. అలాగే రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి.

సంతానం విషయంలోనూ..

కొంతమంది పెళ్లి అవగానే సంతానం గురించి ఆలోచిస్తే.. మరికొంతమంది మాత్రం పెళ్లి తర్వాత సంవత్సరమో, రెండేళ్లో గ్యాప్ ఇస్తుంటారు. అయితే ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలిద్దరూ ఒకే మాటపై నిలబడడం మంచిది. ఈ విషయం గురించి కూడా పెళ్లికి ముందే మీ భాగస్వామితో చర్చించాలి. ఇద్దరికీ ఒప్పందం అంగీకారమైతేనే ముందుకెళ్లడమో.. లేదంటే ఒకరినొకరు ఒప్పించుకోవడమో చేయాలి. ఇలాంటి విషయాల్లో దాపరికాలుంటే మాత్రం తర్వాత గొడవలు, అపార్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది.

వృత్తిపరంగా..

ఇంజినీర్లకు ఇంజినీర్లు, డాక్టర్లకు డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్లు.. ఇలా ఈ రోజుల్లో చాలామంది యువత వారికి కాబోయే భాగస్వామికి ఒకే రకమైన ఉద్యోగం ఉండేలా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. పెళ్లి అనంతరం వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం వధూవరులిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు.. కానీ వారు చేసే ఉద్యోగాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయి, అబ్బాయి.. ఇద్దరూ కలిసి ఏకాంతంగా మాట్లాడుకోవడం, ఉద్యోగం విషయంలో ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం.. వంటివి చేయాలి. తద్వారా ఎవరో ఒకరు సర్దుకుపోవడమా? లేదంటే కాబోయే భాగస్వామి ఇష్టాన్ని గౌరవించడమా?.. అనేది ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రావడం మంచిది. ఫలితంగా పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరి మధ్య ఎలాంటి గొడవలు, అపార్థాలు చోటుచేసుకోకుండా ఉండాలంటే పెళ్లికి ముందే ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలపై ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలి. సో.. మీరు కూడా పెళ్లికి ముందే ఇలాంటి అంశాల పట్ల సానుకూల ఆలోచనలతో ముందడుగు వేస్తే పెళ్లి తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

ఇదీ చదవండి:Doctors Negligence: కరోనా సోకిందని కాన్పు చేయని వైద్యులు.. హరీశ్‌రావు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details