ఆలుమగల అనుబంధం సంతోషంగా సాగిపోవాలంటే... భవిష్యత్తుపై స్పష్టతతో పాటు సర్దుబాట్లు ఉండాలి. కీలక సమయాల్లో ఒక్కటై నడిచే ఓర్పు, నేర్పు కావాలి. అందుకోసమే ఈ చిట్కాలు.
గౌరవించండి:
భార్యాభర్తల కుటుంబ నేపథ్యం, చదువు, అలవాట్లు వంటివన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఏడడుగులు నడిచిన తర్వాత కూడా ఇరువురి పద్ధతులు, జీవనశైలి వేరేగా ఉండొచ్చు. అయితే ఇద్దరూ జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని అనుకోవడం మాత్రం తప్పనిసరి. అది వారి ఉద్యోగానికి సంబంధించినదైనా కావొచ్చు. లేదా కుటుంబానికి చెందినదైనా అవ్వొచ్చు. ఉన్నత విద్యాభ్యాసంపై ఆసక్తి, ఆర్థికంగా నిలబడాలనే ఆశ వంటివి ఒకరికొకరు పంచుకోవాలి. పరస్పరం ఆశయాల సాధనలో ప్రోత్సహాన్ని అందించుకోలి. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.
లక్ష్యం ఉండాలి:
భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి. కానీ ఇద్దరూ కలిసి తమ కోసం, కుటుంబం కోసం కూడా గమ్యాన్ని ఏర్పరుచుకోవాలి. అప్పుడే బాధ్యతలు అర్థమవుతాయి. అపార్థాలు దరిచేరవు. ఒకవేళ ఇద్దరూ కలిసి అనుకున్న ప్రణాళికలో పొరబాటు జరిగినా... ఇబ్బందులు ఎదురైనా, ఒకరినొకరు నిందించుకోవద్దు. కూర్చుని మాట్లాడుకుని సర్దుబాట్లు చేసుకోండి. అప్పుడే మీరనుకున్నది చేయగలరు.