ఎక్కడ ఉంటారో.. ఏం చేస్తారో తెలియదు.. ఒక్కసారీ కలిసిందీ లేదు.. ఫ్రెండ్ రిక్వస్ట్‌లతో కలుస్తారు. కొన్నాళ్లకు ఎంతో మంది ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్‌లా మారిపోతారు. కొందరైతే ప్రేమికులుగా నెట్టింట్లో విహరిస్తారు. మరికొందరు జీవిత భాగస్వాములుగా డిజిటల్ వరల్డ్ నుంచి దైనందిన జీవితంలోకి వచ్చేస్తున్నారు. అంతలా.. ఆన్‌లైన్ వేదికలు నేటి తరం మిలీనియల్స్‌కి దగ్గరైపోయాయి. ముఖాముఖీగా కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఓ నివేదిక ప్రకారం యువతలో 76 శాతం సోషల్ లైఫ్‌లో చురుకుగా ఉన్నారట. పక్కనే ఉండే బెంచ్‌మేట్స్ కంటే.. సోషల్ మీడియా ఫ్రెండ్‌తోనే నిజాయితీగా ఉంటున్నారు.
నమ్మకం కలగాలి
డిజిటల్ మాధ్యమం ఏదైనా స్నేహం కోరి మాటకలిపితే అభిరుచులు ఒక్కటో కాదో చెక్ చేసుకోవాలి. ఆలోచనలు, అభిప్రాయాలు కలిస్తే ఒక అడుగు ముందుకేయొచ్చు. అదీ మీకు ధైర్యం ఉంటేనే! మీరు ఊహించని పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలనని అనిపిస్తేనే సోషల్ మీడియా స్నేహానికి చెయ్యందించాలి.
‘రచ్చ’ చేయొద్దు
స్నేహం కుదిరింది. ఛాటింగ్‌లు.. షేరింగ్‌లు అయ్యాయి. ఇరువురూ కలుద్దాం అనుకున్నారు. కలిసారు. కానీ, ఎక్కడో ఇద్దరికీ సెట్ కాదని అనిపించింది. ఇరువురిలో ఏ ఒక్కరికి ఇలా అనిపించినా హుందాగా స్నేహాన్ని కట్ చేసుకోవాలి. అంతేకానీ.. రచ్చ చేసే ఉద్దేశాలు మనసులో పెట్టుకోవద్దు. గతంలో పంచుకున్న వాటిని బహిర్గతం చేస్తూ ఇతరుల ప్రైవసీని నెట్టింట్లో పెట్టొద్దు.
హద్దులు దాటకుంటే మేలేఇప్పుడు అందుబాటులోకి వస్తున్న డేటింగ్ యాప్‌లు తోడుని వెతుక్కోవడంలో ఇన్‌స్టెంట్ మార్గాలయ్యాయి. అవసరాలు అభిరుచులకు తగిన వారిని సెలెక్ట్ చేసుకుని స్నేహితులవుతున్నారు. అయితే, ఎంత దగ్గరైనా హద్దులు దాటకూడదనే నియమం పెట్టుకోవాలి. ముఖ్యంగా డబ్బు సాయం చేయడం, శారీరకంగా దగ్గరవడం లాంటివి చేస్తే చిక్కుల్లో పడతారు. స్నేహం, ప్రేమ ఏదైనా.. కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుని ఒకే చెప్పడం శ్రేయస్కరం. ఆన్‌లైన్ స్నేహాల్లో తొందరపాటు వద్దు. |