* ఒత్తిడి తేకుండా...
పిల్లలు తమ బొమ్మలు, వస్తువులను ఇతరులు తీసుకుంటే సాధారణంగా ఒప్పుకోరు. అలాగే తోటి పిల్లల ఆట వస్తువులను చూసి అసూయ పడతారు. వాటిని లాక్కోవడానికి చూస్తారు. ఈ లక్షణాల్ని గుర్తించిన వెంటనే మార్చడానికి ప్రయత్నించాలి. తమవి ఇతరులకూ ఇవ్వడం నేర్పాలి. అసూయ తప్పని చెప్పాలి. అయితే ప్రారంభంలో పిల్లలపై ఈ అంశాల్లో ఎక్కువగా ఒత్తిడి తేకుండా సున్నితంగా వివరించాలి. అప్పుడే వింటారు. అరవడం, తీవ్రంగా విమర్శించడం చేస్తే పూర్తిగా పెడచెవిన పెడతారు.
* పంచడం నేర్పాలి...
ఇంటికెవరైనా వస్తే, వారి చిన్నారులకు తమ వద్ద ఉన్న ఆట వస్తువులను కాసేపు ఆడుకోవడానికి ఇవ్వమని చెప్పాలి. మొదట తిరస్కరించినా నెమ్మదిగా అలవాటవుతుంది. ఇది పంచుకునే గుణాన్ని పెంచుతుంది. దీంతో ఇతరుల వస్తువులను చూసి అసూయ పడటం, తమ బొమ్మలు తమ వద్దే ఉండాలనే స్వార్థం క్రమేపీ దూరమవుతాయి. పిల్లలతో పేదవారికి సాయపడటం, తమ పుస్తకాలు, పెన్సిళ్లు, పాతబ్యాగులు వంటివి ఇప్పించాలి. ఈ అలవాట్లు వారిలో తోటివారికి సాయపడే గుణాన్ని పెంచుతాయి. తమ వద్ద ఉన్నదాన్ని లేనివాళ్లకు అందించాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి వారి మనసులో నాటాలంటే తల్లిదండ్రులు కూడా అదే మార్గాన్ని అనుసరించాలి. అప్పుడే పెద్దవారిని పిల్లలు స్ఫూర్తిగా తీసుకుంటారు.