జ. మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని మీ భర్తకు అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్‌గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.