కరోనా పరిస్థితుల నేపథ్యంలో గర్భిణులకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేసేందుకు, ప్రసవాల సమయంలో తగిన ప్రమాణాలను పాటించాలని... అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీచేశారు. పీపీఈ కిట్, ఫేస్ మాస్కు, ఫేస్ షీల్డ్ ధరించి చికిత్స అందించాలని అధికారులు, వైద్యులు, ఇతర సిబ్బందికి సూచించారు. ఈమేరకు ఎయిమ్స్, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తదితర సంస్థలు కలిసి రూపొందించిన ప్రమాణాలపై చర్చించి తాజాగా మార్గదర్శకాలు జారీచేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు (డీఎంహెచ్‌వో), ఆసుపత్రుల సూపరింటెండెంట్లు బాధ్యత తీసుకొని వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలని, గర్భస్థ శిశు, ప్రసవం, ప్రసవం తర్వాత అనే మూడు దశల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మార్గదర్శకాల్లో కీలకమైనవి..
* గర్భస్థ శిశు దశలో చెకప్‌నకు రెండు రోజుల ముందు ఏబీఎం, ఆశా కార్యకర్త గర్భిణిని కలిసి ఎంసీపీ కార్డులో వివరాలు నింపాలి. ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చి పరీక్షించుకునేలా చూడాలి. వారు మిగిలిన రోగుల్లో కలవకుండా, ఎక్కువ సమయం వేచి ఉండకుండా టోకెన్లు ఇచ్చి సమయానికి వైద్య పరీక్షలు చేయించాలి. భౌతికదూరం పాటించేలా ఉపకేంద్రంలో కుర్చీలు ఏర్పాటుచేయాలి. వైద్యాధికారులు అన్ని మందుల్ని, అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచాలి.