తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అద్దంలో చూస్తూ అందం గురించి బాధపడుతున్నారా.. ? - beauty problems

‘అందంగా లేనా.. అసలేం బాలేనా..’ అంటూ అమ్మాయిలంతా సగటున రోజుకో గంట చొప్పున అద్దం ముందు గడుపుతారట! ఈ క్రమంలో అద్దంలో తమ అందచందాలను చూసుకునే వారు కొందరైతే.. ఇతరుల అందంతో పోల్చుకుంటూ తమ శరీరంలోని చిన్న చిన్న లోపాల్ని సైతం పెద్దవిగా చూసుకుంటూ ఒత్తిడికి గురవుతుంటారు మరికొందరు. ‘వారిలా నేనెందుకు లేను’ అని తమను తామే అసహ్యించుకుంటుంటారు. ఇదిగో ఇలాంటి మానసిక సమస్యనే ‘బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్ (BDD)’ గా పేర్కొంటున్నారు నిపుణులు. బాలీవుడ్‌ బ్యూటీ ఇలియానా కూడా తాను గతంలో ఈ సమస్యతో బాధపడ్డానంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే!ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా దీని బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే మనసు అదుపు తప్పి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదముందట! మరి, ఇంతదాకా రాకూడదంటే ‘బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్‌’ ఎందుకొస్తుంది? ఎలా గుర్తించాలి? చికిత్సలేమైనా ఉన్నాయా? తదితర విషయాల గురించి తెలుసుకుందాం..!

experts about body dysmorphic disorder
బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్

By

Published : Mar 30, 2021, 3:00 PM IST

‘నా ముఖమేంటి ఇంత అంద విహీనంగా ఉంది..’, ‘తనలా నాజూగ్గా ఉంటే ఎంత బావుండేదో’, నన్ను నేను అద్దంలో చూసుకోలేకపోతున్నా..’ ఇలా రోజులో ఎక్కువ సమయం అద్దంలో చూసుకుంటూ తమ అందాన్ని నిందించుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం.. వంటివి చేస్తుంటారు కొంతమంది. ఇలాంటి లక్షణాలే ‘బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్ (BDD)’ను సూచిస్తాయంటున్నారు నిపుణులు. 15-30 ఏళ్ల మధ్య వయసున్న వారిలో.. అది కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలే ఈ మానసిక సమస్య బారిన పడుతున్నట్లు గణాంకాలు రుజువు చేస్తున్నాయి. అయితే దీనికి పక్కా కారణాలేంటన్న విషయంలో స్పష్టత లేకపోయినా.. కొన్ని అంశాలు మాత్రం ఇందుకు దోహదం చేస్తున్నాయంటున్నారు నిపుణులు.


ఏంటా కారణాలు?
* వంశపారంపర్యంగా కూడా BDD వచ్చే అవకాశాలున్నాయని కొంతమందిపై జరిపిన పరిశోధనలో తేలింది.
* గతంలో/చిన్న వయసులో లైంగిక హింస, బుల్లీయింగ్‌, బాడీ షేమింగ్‌కి గురైన వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
* అందం, శరీరాకృతి.. వంటి వాటికి అధిక ప్రాధాన్యమిచ్చే తల్లిదండ్రులు, ఇతర పెద్దలు, కుటుంబ వాతావరణంలో పిల్లలు పెరగడం వల్ల కూడా వారిలో ఈ మానసిక సమస్య వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు.
* కొంతమందిలో మెదడు పనితీరు-మెదడుకు సంబంధించిన సమస్యలు (Brain Abnormalities) కూడా బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్‌కు దారితీస్తున్నాయట!
* ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్‌ డిజార్డర్‌ - మనసులో అనవసరమైన భయాలు, ఆలోచనలు రేకెత్తడం) తో బాధపడుతోన్న కొంతమందిలో బీడీడీ కూడా ఉన్నట్లు రుజువైంది.


ఇలా గుర్తించచ్చు!
BDD తో బాధపడుతోన్న వారు ముందుగా తమలోని లోపాల్ని పదే పదే అద్దంలో చూసుకుంటూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఇది మితిమీరితే తమ శరీరాకృతి/అందంలోని లోపాల్ని ఇతరులతో పోల్చుకుంటూ మానసికంగా మరింత కుంగిపోతుంటారు. ఈ క్రమంలో వారు కొన్ని అంశాల పైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారంటున్నారు నిపుణులు.
* మొటిమలు, జిడ్డుదనం, ముడతలు, ఫేషియల్‌ హెయిర్‌, వక్షోజాల పరిమాణం, జుట్టు ఎక్కువ రాలిపోవడం.. వంటి విషయాల్లో తమను ఎదుటివారితో పోల్చుకుంటూ బాధపడుతుంటారు.
* తమలోని శారీరక లోపాల్ని పదే పదే అద్దంలో చూసుకొని మథన పడుతుంటారు.


* ఆ లోపాల గురించే నెట్‌లో వెతకడం, వాటికి సంబంధించిన సమాచారాన్నే చదవడం.. వంటివి చేస్తారు.
* ఏ పనిపైనా శ్రద్ధ పెట్టకపోవడం, నలుగురితో కలవకపోవడం, ఎప్పుడు చూసినా తమలోని లోపాల్ని చూసుకుంటూ ఏదో ఒక ధ్యాసలో ఉండిపోతుంటారు.
* అద్దంతో పాటు తమ ప్రతిబింబం కనిపించే ఉపరితలాలపై తమలోని లోపాల్ని పదే పదే చూసుకోవడం.. ఇది మితిమీరితే అద్దాన్నే అసహ్యించుకోవడం.. కోపంతో ఇంట్లో ఉండే అద్దాలను తొలగించడం.. వంటివి చేస్తారు.
* తమలోని లోపాల్ని మేకప్‌, దుస్తులు, విగ్స్‌.. వంటి ప్రత్యామ్నాయాలతో కవర్‌ చేసుకుంటుంటారు.
* పదే పదే సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తూ తమ శరీరంలోని లోపాలకు తగిన చికిత్స తీసుకుంటుంటారు.
* తమలోని లోపాల్ని ఇతరులు గుర్తించకపోయినా.. వాటి గురించి ఇతరుల దగ్గర ప్రస్తావిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు.


చికిత్స ఏదీ?
ఇలా తమలోని లోపాల గురించే పదే పదే ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోవడం వల్ల కొన్నాళ్లకు డిప్రెషన్‌లోకి కూడా కూరుకుపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇది కొంతమందిలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలకూ దారితీస్తుందట! అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆదిలోనే నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఈ క్రమంలో కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ, డాక్టర్‌ సూచించిన మందులు.. వంటివి కొంత వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుందట! వీటితో పాటు ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండడం, ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవడం, మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి ధ్యానం.. వంటివి మనకు మనంగా చేసుకోవాల్సిన కొన్ని జీవనశైలి మార్పులు. ఇలా చేయడం వల్ల క్రమంగా ఈ సమస్య నుంచి బయటపడచ్చట!

ఏదేమైనా ‘బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్‌’ రావడానికి ఒక కచ్చితమైన కారణమేంటన్న విషయంలో స్పష్టత లేకపోయినా.. మన ప్రవర్తనను బట్టే ఈ సమస్యను గుర్తించచ్చనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలుంటే ఆదిలోనే సమస్యను గుర్తిద్దాం.. తద్వారా నిపుణుల సలహాలు పాటిస్తూ దీన్నుంచి బయటపడదాం..! మరి, మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలతో బాధపడినట్లయితే.. దాన్నుంచి ఎలా బయటపడ్డారో కింది కామెంట్‌ బాక్స్‌ ద్వారా అందరితో పంచుకోండి.. మీరు సూచించే చిట్కాలు ఈ సమస్య ఉన్న మరికొంతమందికి ఉపయోగపడచ్చు..!

ఇదీ చదవండి:దెయ్యం భయంతో ఆ ఊరు ఖాళీ!

ABOUT THE AUTHOR

...view details