మహమ్మారి సమయంలో రోజువారీగా తీసుకునే క్యాలరీలు బాగా పెరిగాయి. ఆన్‌లైన్‌లో నచ్చింది.. ఆర్డరిచ్చి ఆరగిస్తున్నారు. చాలామంది వ్యాయామానికి దూరమయ్యారు. బయటకు వెళ్లినా వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. చలికాలం అనువైన సమయమని, ఈ పండగ నుంచే మొదలెట్టండని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్ని క్యాలరీలు అవసరం?
రోజువారి అవసరాలకు ఆరోగ్యకర వ్యక్తికి 2600 నుంచి 2800 కిలోక్యాలరీల వరకు అవసరం. మహిళలకైతే 2200 నుంచి 2400 వరకు సరిపోతాయి. పిల్లలు, యువత, పెద్దలకు స్వల్ప మార్పులు ఉంటాయి. నగరంలో చాలామంది మూడు వేల నుంచి 4 వేల క్యాలరీలు ఒంట్లోకి పంపిస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి పండగలకు పిండివంటలు, మిఠాయిలతో మరిన్ని చేరనున్నాయి.
అదనాన్ని ఎప్పటికప్పుడు....
అదనపు క్యాలరీలను ఎప్పటికప్పుడు సరిచేయకపోతే శరీరంలోని వేర్వేరు భాగాల్లో కొవ్వురూపంలో పేరుకుపోయే ప్రమాదం ఉంది. బొజ్జ పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. చాలామంది కుదరక, బద్దకంతో కసరత్తును వాయిదా వేస్తున్నారు. ఫలితంగా టైప్-2 మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు వివరిస్తున్నారు.
ఉన్నచోటనే ఇలా..
* కూర్చుని విధులు నిర్వహించేవారు.. మధ్యమధ్యలో లేచి నిలబడటం.. రోజు కంటే ఎక్కువగా నడవడం వంటి వాటితో క్యాలరీలను కరిగించుకోవచ్చు.