తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అందంగా లేనా? అసలేం బాలేనా? - అందానికి చిట్కాలు

పదేపదే అద్దం ముందు నిల్చుంటారు... అందంగా లేనని కుమిలిపోతారు... అవకరం గుర్తు తెచ్చుకొని బాధపడతారు... ఎవరైనా కామెంట్‌ చేస్తే తట్టుకోలేరు... అమ్మాయిలే కాదు.. అబ్బాయిలదీ ఇదే వరస... ఇదేంటి...? బాడీ డిస్‌మార్ఫిక్‌ డిజార్డర్‌... బయటపడేదెలా?

how-to-overcome-body-dysmorphic-disorder
అందంగా లేనా? అసలేం బాలేనా?

By

Published : Apr 10, 2021, 10:58 AM IST

తెలుగులో మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన హీరోయిన్‌ తను. అయినా నేనేం బాగుండను అంటుంది. పలు ఇంటర్వ్యూల్లోనూ ఇదే మాట చెప్పింది. బీడీడీ నుంచి బయటపడానికి కొన్నాళ్లు మానసిక నిపుణుల దగ్గర కౌన్సెలింగ్‌ కూడా తీసుకుంది. సినిమా, మోడలింగ్‌ రంగాల్లో చాలామందిదీ ఇదే వ్యథ. ఓ సంస్థ అధ్యయనం ప్రకారం టీనేజీ నుంచి ప్రౌఢ వయసుదాకా 28శాతం యువత తాము అందంగా లేమనీ, అవకరంతో నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నానని కుంగిపోతున్నారట. ఈ మానసిక రుగ్మత ముదిరిన కొందరు ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలూ లేకపోలేదు.

ఎందుకీ బాధ?

ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికీ అందంగా కనపడాలనే యావ ఎక్కువ అవుతోంది. స్నేహితులు, సమాజం, ఎంచుకునే కెరీర్‌, పెరిగిన వాతావరణం, కుటుంబాలు దీనికి కారణం. శరీరంలో న్యూట్రాన్స్‌మీటర్ల అసమతౌల్యం కారణంగా నాలో అవకరం ఉందనే ఆలోచనలు పదేపదే వస్తాయంటారు సైకాలజిస్టు గీతా చల్లా. పెద్దవాళ్లలో ఇలాంటి న్యూనతాభావం ఉన్నప్పుడూ అది పిల్లలపై ప్రభావం చూపిస్తుందంటారామె. సౌందర్య కాంక్ష అధికంగా ఉన్న స్నేహితులు ఎక్కువ మంది ఉన్నా.. మోడలింగ్‌, సినిమా, టీవీలాంటి తళుకుల రంగాలను ఎంచుకోవాలని భావించినా తమలో చిన్న లోపం ఉన్నా తట్టుకోలేరు. దీనికితోడు ఎవరైనా కామెంట్‌ చేసినా, బాడీ షేమింగ్‌కి పాల్పడ్డా.. భయంకరమైన ఒత్తిడికి గురవుతారు. రోజంతా అద్దం ముందు నిల్చోవడం.. లోపాన్ని పదే పదే తలచుకోవడం.. ఇదే దినచర్యగా మారుతుంది. శరీరంలోని లోపాలు సవరించుకోవాలని ప్లాస్టిక్‌ సర్జన్లు, డెర్మటాలజిస్టులు, డెంటిస్టులను ఆశ్రయిస్తారు. అవేవీ ఫలితాలు ఇవ్వనప్పుడు తీవ్రమైన మానసిక కుంగుబాటులోకి వెళ్లిపోతారు.

ఏం చేయాలి?

*ఈ ప్రపంచంలో నూటికి నూరు శాతం ఎవరూ పర్‌ఫెక్ట్‌గా ఉండరు. ప్రతి ఒక్కరిలో ఏదో లోపం, వంక ఉంటుంది. మనలాంటి వాళ్లు ఎందరో ఉన్నారనీ, వారికి లేని ఇబ్బంది మనకెందుకని పదే పదే అనుకుంటే బాధ తీవ్రత తగ్గుతుంది.

*గంటలకొద్దీ అద్దం ముందు నిల్చోవడం, పదేపదే అలంకరించుకోవడం తగ్గించుకోవాలి. అవకరం ఉండటం వంక కాదు.. మనకు మనం తప్పుగా ఊహించుకోవడమే పెద్ద అవకరం అని గుర్తు చేసుకోవాలి.

*శారీరక లోపంతో మనకు కలిగే నష్టం ఏమీ ఉండదు. అవకరం, వైకల్యం ఉన్నవాళ్లు సైతం ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. వాళ్లని స్ఫూర్తిగా తీసుకోవాలి.

*‘నేను అందంగా లేను’, ‘నన్ను చూసి అంతా నవ్వుకుంటున్నారు’.. ఇలాంటి ఆలోచనలను మానసిక నిపుణులు ‘కాగ్నిటివ్‌ డ్యుయెల్‌ థెరపీ’ ద్వారా నయం చేస్తారు.లోపం ఉంటే ఎత్తి చూపడం.. అంద విహీనంగా ఉంటే కామెంట్‌ చేయడమే జనం పని కాదు. బయటికెళ్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనే భ్రమ నుంచి బయటికి రావాలి.

*ఖాళీగా ఉన్నప్పుడే చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఎప్పుడూ బిజీగా ఉండటానికి ప్రయత్నించాలి. ఏదో ఒక లక్ష్యం ఎంచుకోవాలి.

*ఎక్స్‌పోజర్‌ థెరపీ పాటించడం ఉత్తమం. అంటే కావాలనే జనంలోకి వెళ్లాలి. అందరితో కలుపుగోలుగా ఉండాలి. ఇది ఆందోళనని తగ్గిస్తుంది.

ఇదీ చూడండి:సమ్మర్ స్పెషల్: చర్మానికి చల్లదనాన్నిచ్చే ప్యాక్స్ ఇవే..!

ABOUT THE AUTHOR

...view details