రాగిజావ
ఈకాలంలో ఏమీ తినబుద్ధికాదు. చల్లటి నీళ్లు మాత్రం బాగా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు పల్చని రాగిజావ తయారుచేసుకుని తాగండి. రెండు చెంచాల రాగిపిండిని కప్పు నీళ్లలో కలపండి. దీన్ని రెండు గ్లాసుల నీళ్లలో వేసి .. తక్కువ మంట మీద ఉడికించండి. కాస్త ఉప్పు, మల్చటి మజ్జిగ కలిపి తాగేయండి. ఇష్టమైతే దీంట్లో కరివేపాకు, కొత్తిమీర తరుగు, కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా చేర్చుకోవచ్చు. తియ్యగా ఉండాలంటే.. కాస్త బెల్లం ముక్క వేసుకుని అరగ్లాసు పాలు కలిపితే సరిపోతుంది.
ఉపయోగాలు:రాగుల్లో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇంకా ప్రొటీన్లు, ఎ,బి,సి, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. కాలేయంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తక్కువ చేయడానికి తోడ్పడుతుంది.