తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఈ ఆలోచనలు మానండి.. ఆనందంగా ఉండండి..!

జీవితం ఎప్పుడూ సంతోషంగా.. ఆనందంగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకొంటారు. దానికోసం వడివడిగా సాగిపోతోన్న కాలంతో కలిసి పరిగెత్తుతుంటారు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం. అయితే వాటికి కూడా కుంగిపోయి.. తమ జీవితం అంతా కష్టాలమయమైపోయిందని బాధపడేవారు కూడా ఉంటారు. ఈ క్రమంలో తమకంటే కాస్త మిన్నగా ఉన్నవారితో పోల్చుకొని తమను తాము తక్కువ చేసి చూసుకొంటారు. ఈ రకమైన ఆలోచనా విధానం కారణంగా.. ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలనే విషయాన్ని కూడా మరిచిపోతుంటారు. ఇలా చేయడం సరికాదు. అయితే మన మెదడులో మెదిలే కొన్ని ఆలోచనలకు దూరంగా ఉండటం ద్వారా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చు.

tips for satisfactory life
జీవితం సంతృప్తిగా సాగాలంటే

By

Published : Apr 10, 2021, 11:52 AM IST

ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై తాము నిలబడాలనే కోరికతోనే ఉంటారు. దాన్ని సాధించే క్రమంలో కొందరు తాము కోరుకొన్న కెరీర్‌ను సొంతం చేసుకొంటే.. మరికొందరు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని జీవితంలో స్థిరపడటానికి ప్రయత్నిస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే అసలు చిక్కంతా మొదలవుతుంది.

ఈ ఉద్యోగం నా వల్ల కాదు..

కోరుకొన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ కొంతమంది అందులో పెద్దగా సంతృప్తి చెందరు. దీంతో తమకు అప్పజెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేసే విషయంలో అలసత్వం వహిస్తూ ఉంటారు. పైగా 'ఇది నా టాలెంట్‌కి తగ్గ జాబ్ కాదు..', 'ఏదో టైం బాలేక ఇక్కడ చేరాను కానీ లేదంటేనా.. నా పొజిషన్ ఇంకెక్కడో ఉండేది' లాంటి కబుర్లు చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. ఇలాంటి వారు ఏ సంస్థలో.. ఏ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇదే ఆలోచనతో ఉంటారు. ఇలా ఆలోచించే వారు ఎప్పటికీ తమ ఉద్యోగ జీవితం పట్ల సంతృప్తిగా ఉండలేరు. కాబట్టి వీరు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవడం మంచిది. ప్రస్తుతం వాస్తవ పరిస్థితులను గమనిస్తే.. పెద్ద చదువులు చదివినప్పటికీ చిన్న ఉద్యోగం కూడా రానివారెంత మందో ఉన్నారు. ఉద్యోగ సాధన కోసం అహర్నిశలూ కష్టపడుతున్నప్పటికీ ఫలితం సాధించలేని వారూ ఉన్నారు. అలాంటి వారితో పోలిస్తే.. మీరు మంచి స్థాయిలో ఉన్నట్టే. కాబట్టి చేసే పని ఎలాంటిదైనప్పటికీ దానిపై పూర్తి శ్రద్ధాసక్తులు కనబరచడం అలవాటు చేసుకోండి.


అన్ని సమస్యలూ నాకే..
ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కసారిగా తమపైనే దాడి చేస్తున్నాయని భావించేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. వాస్తవానికి అక్కడ పెద్దగా చింతించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ పదే పదే దాన్నే తలచుకొని బాధపడిపోతుంటారు. 'నా ఒక్కరికే ఈ కష్టాలన్నీ' అంటూ తెగ ఫీలయిపోతుంటారు. ఈ విషయంలో వారికి ఇతరులు నచ్చ చెప్పాలని చూసినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించదు. పైపెచ్చు ఆ భావన మరింత ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల విషయంలోనే ఇంత తీవ్రంగా స్పందించడం మంచిది కాదు. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా.. నవ్వుతూ జీవితాన్ని గడిపేవారు ఎందరో ఉన్నారు. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతూ రేపటి కోసం ఆశగా జీవించేవారు సైతం ఉన్నారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏ సమస్యనైనా సరే గుండె ధైర్యంతో పోరాడేలా మనల్ని మనం మలుచుకోవాలి.
రుచీ పచీ లేదు..
మనం ఆరోగ్యకరంగా ఉండటానికి, రోజువారీ పనులు ఉత్సాహంగా చేసుకోవడానికి అతి ముఖ్యమైన అవసరం ఆహారం. అయితే ఈ విషయంలో చాలామంది అసంతృప్తిగా వ్యవహరిస్తుంటారు. కడుపు నిండా తినడానికి కావాల్సినంత తిండి ఉన్నప్పటికీ దాని రుచి బాగాలేదనో.. కోపంతోనో.. మరే ఇతర కారణంతోనైనా సరే ఆహారాన్ని పడేస్తుంటారు. అంతేకాదు.. అప్పుడప్పుడూ 'ఎంత సంపాదిస్తున్నా కడుపు నిండా ప్రశాంతంగా తినలేకపోతున్నా' అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇలా ఆహారాన్ని వృథా చేసేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి సరిపడినంత ఆహారం అందుబాటులో ఉంది. కానీ కొందరు ఒక్కపూట తిండికి కూడా నోచుకోలేక ఆకలితో అలమటిస్తున్నారు. మరికొందరు కలో గంజో తాగి దానితోనే సరిపెట్టుకొంటున్నారు. కాబట్టి ఆహారం రుచి విషయంలో పదే పదే రాద్ధాంతం చేయకుండా.. ఆహారాన్ని వృథా చేయకుండా.. మనస్ఫూర్తిగా తినడం అలవాటు చేసుకోవాలి.


ఇంకా పెద్దిల్లు కావాలి..
జీవితంలో తామేం చేయదలుచుకుంటున్నారనే జాబితా రాయమంటే.. ఎక్కువ శాతం మంది రాసిన లిస్ట్‌లో ఇల్లు కచ్చితంగా ఉంటుంది. మనం సంపాదించుకొన్న డబ్బుతో మన పేరిట ఓ ఇల్లు ఉందంటే ఆ సంతోషమే వేరు. అది మనకు మాత్రమే కాదు.. భవిష్యత్తరాల వారికి సైతం నీడనిస్తుంది. అయితే ఈ విషయంలోనూ కొందరు మరీ అతిగా ఆలోచిస్తుంటారు. 'ఫలానా వారికి మనకంటే చాలా పెద్ద ఇల్లు ఉంది. అలాంటి ఇల్లు మనకి కూడా ఉండాలి' అని అనుకొంటూ ఉంటారు. దీంతో తాము ఇరుకు ఇంట్లో, వూపిరి సలపని గదుల్లో నివాసముంటున్న భావనకు లోనవుతారు. ఇలా ఆలోచించే ముందు.. మన సమాజాన్ని కాస్త గమనించడం మంచిది. ఇప్పటికీ మనదేశంలో ఎంతోమందికి నిలువ నీడలేదు. మరెంతో మంది పూరి గుడిసెల్లో జీవిస్తుంటారు. ఏదైనా విపత్తు సంభవిస్తే వారి ప్రాణాలు గాల్లో దీపాల్లానే ఉంటాయి. ఇంకొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులంతా ఇరుకు అద్దె గదిలోనే ఏళ్ల తరబడి నెట్టుకొస్తూ ఉంటారు. అలాంటి వారితో పోలిస్తే.. సొంతిల్లు ఉన్న మీరు చాలా మెరుగైన స్థితిలో ఉన్నట్లే కదా..!

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్​కు ఎంపీ రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ

ABOUT THE AUTHOR

...view details