గత ఏడాదిన్నర కాలంలో దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న వేళ.. దంత సమస్యలపై ఎంతమంది చికిత్స కోసం వస్తున్నారనే కోణంలో.. ఓ ప్రైవేటు సంస్థ సర్వే నిర్వహించింది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తొలి లాక్‌డౌన్‌లో సుమారు 90 లక్షల మంది చిన్నారులు దంత సంరక్షణను కోల్పోయారు. మార్చి 2020 నుంచి మార్చి 2021 వరకూ దంత చికిత్సల కోసం వచ్చిన చిన్నారులు 34 శాతం నుంచి 10 శాతానికి తగ్గారని సర్వే చెబుతోంది. పెద్దవారిలో 32.6 శాతం నుంచి 23.6 శాతానికి తగ్గారు.
పెరుగుతున్న తీవ్రత
- సాధారణ ఫిల్లింగ్‌తో సరిపెట్టుకునేది కాస్తా.. చికిత్స వాయిదా వల్ల రూట్‌కెనాల్ వరకూవెళ్లాల్సి వస్తోంది.
- రూట్ కెనాల్ చికిత్సతో సరిపోయేది కాస్తా.. పరిస్థితి చేయిదాటి మొత్తం దంతాన్ని పీకేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
- కొవిడ్ సమయంలో ఒత్తిళ్లు, ఆందోళనల కారణంగా పళ్లు కొరుక్కోవడం.. తద్వారా వాటిల్లో పగుళ్లు ఏర్పడడం.. కొన్ని దంతాల చివర్లు విరిగిపోవడం కూడా జరిగాయి.
తొలిదశలో చికిత్స కీలకం
పంటి దగ్గర ఇన్‌ఫెక్షన్ పెరిగినప్పుడు శరీరంలో ఇన్సులిన్ దాన్ని నివారించడానికి పనిచేస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే ప్రక్రియకు ఆటంకం ఏర్పడి షుగర్ పెరుగుతుంది. నోటి సమస్యలను నియంత్రణలో ఉంచుకోకపోతే.. గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ వ్యాధుల తీవ్రత పెరుగుతుంది. నోటిలో అల్సర్లు, ఇన్‌ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌గానూ మారే ప్రమాదముంది. అందుకే ఇన్‌ఫెక్షన్‌ను తొలిదశలోనే నిర్మూలించడం చాలా అవసరం. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలపై నల్లటి మచ్చలు వంటివి బ్రష్ చేస్తున్నా కూడా తొలగిపోకుండా ఉంటే.. వెంటనే చికిత్స చేయించుకోవాలి.
-డా.వికాస్‌గౌడ్, దంత వైద్యనిపుణులు