భూగర్భంలో పనిచేయడమంటే సాధారణ విషయం కాదు. చిమ్మచీకట్లు... అధిక ఉష్ణోగ్రతలు.. ఇలా ప్రకృతికి విరుద్ధంగా ఉండే వాతావరణం ఉంటుందక్కడ. ముఖ్యంగా మహిళలు పనిచేయడానికి వెనకాడే అటువంటి చోట అత్యంత ధైర్యంగా విధులు నిర్వహించడానికి సిద్దమవుతోంది తెలంగాణ, భూపాలపల్లి జిల్లాకు చెందిన రాసకట్ల సంధ్య. ఈమె తల్లిదండ్రులు రఘు, తులసి. తండ్రి సింగరేణి కాలరీస్(భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 గని)లో కన్వేయర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తరచూ కుటుంబ సభ్యులతో భూగర్భగనిలో జరిగే పనుల గురించి చెప్పేవాడు. చిన్నతనం నుంచి ఆయన మాటలు వినీవినీ ఉందేమో... భవిష్యత్తులో ఎలాగైనా సరే గనిలోనే పని చేయాలనే లక్ష్యం పెట్టుకుంది సంధ్య.
గనిలో... ఆమెదే మొదటి అడుగు! - భారత్‌లో తొలి మహిళా మైన్ మేనేజర్ సంధ్య
సవాళ్లకి ఎదురెళ్లే వాళ్లు కొందరుంటారు.. వాళ్లు మాత్రమే చరిత్రని తిరగరాస్తారు.. రాసకట్ల సంధ్య ఇటువంటి అమ్మాయే. అందరూ ఎంచుకునే ఉద్యోగాలని కాదనుకుని భూగర్భంలో ‘మైన్ మేనేజర్’గా పని చేసేందుకు సిద్ధమవుతోంది. దేశంలోనే ఈ అర్హత సాధించిన తొలి అమ్మాయి సంధ్య...
అప్పుడే ఆ మాట చెబితే కచ్చితంగా ‘ఆడపిల్లవి నీకెందుకు’ అంటారేమోనని కుటుంబసభ్యులతో చెప్పలేదు. ఇంజినీరింగ్ చేస్తే మైనింగ్‌లో మంచి అవకాశాలు ఉంటాయని తెలుసుకుంది. పదో తరగతి వరకూ భూపాలపల్లిలో, ఇంటర్మీడియెట్ హైదరాబాద్‌లో చదువుకుంది సంధ్య. తర్వాత కొత్తగూడెంలో బీటెక్(మైనింగ్) పూర్తిచేసింది. 2018లో ప్రాంగణ నియామకాల ద్వారా తన కలని నిజం చేసుకునే దిశగా తొలి అడుగులు వేసి రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ‘హిందుస్థాన్ జింక్ వేదాంత’లో ఉద్యోగం సాధించింది.
ఏడాదిపాటు.. అత్యంత క్లిష్టంగా ఉండే భూగర్భ గనిలో పనిచేసింది. తన అర్హతల్ని చూపిస్తూ ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్)’కు దరఖాస్తు చేసుకుంది. ఈక్రమంలో సంధ్య నైపుణ్యాల్ని గుర్తించిన ‘డీజీఎంఎస్’... ఆమెకు ‘అండర్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ మైన్ మేనేజ్‌మెంట్ కాంపిటెన్సీ’ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. దీంతో ఆమెకు భూగర్భ గనుల్లో అండర్ మేనేజర్‌గా పనిచేసే అర్హత లభించింది. ఇలా దేశంలోనే ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది సంధ్య. ఇప్పటివరకూ ఎందరో మహిళలు మైనింగ్‌కు సంబంధించిన చదువులు చదివినా, డీజీఎంఎస్ నుంచి భూగర్భంలో పనిచేసేందుకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాన్ని మాత్రం పొందలేకపోయారు. వాస్తవానికి ఈ సాహసం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదనే చెప్పాలి. సంధ్యతోపాటు గనుల్లో ఉద్యోగం చేస్తున్నవారు అండర్ గ్రౌండ్‌లో విధులు నిర్వహించేందుకు సాహసించలేకపోయారు. ఈమె ఆ ఘనతను సాధించి ఆ రంగంలో అడుగుపెట్టాలనుకునే అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.