తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఈ అమ్మాయి ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్ళడానికి వీల్‌ఛైర్ అడ్డు కాలేదు!

‘అవరోధాల దీవుల్లో విజయాల నిధి ఉన్నది.. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది..’ అన్నాడో సినీ కవి. ఈ మాటలు అక్షర సత్యమని నిరూపిస్తోంది పంజాబ్‌కు చెందిన ప్రతిష్థా దేవేశ్వర్‌. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనేవి సర్వసాధారణం.. అయితే వాటినే తలచుకుంటూ కూర్చోవడం కంటే.. ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గం అన్వేషించినప్పుడే మన జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉంటాయని చెబుతోందామె. ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో సీటు సంపాదించి అరుదైన గుర్తింపు సంపాదించుకుంది. మరి, అందులో అంత గొప్పతనం ఏముంది.. అంటారా? అయితే ప్రతిష్థా ఎదురీదిన కష్టాల కడలి గురించి తెలుసుకోవాల్సిందే!

pratishtha deveshwar scripts history becomes first indian on wheelchair to make it to oxford university
ఈ అమ్మాయి ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్ళడానికి వీల్‌ఛైర్ అడ్డు కాలేదు!

By

Published : Jul 27, 2020, 3:25 PM IST

హాయ్‌.. నా పేరు ప్రతిష్థా దేవేశ్వర్‌. మాది పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌. నేనూ అందరమ్మాయిల్లాగే చక్కగా చదువుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉండాలని కలలు కన్నా. కానీ నా జీవితంలో జరిగిన ఓ పెను ప్రమాదం నా శరీరంలో లోపాల్ని సృష్టించి ఉండచ్చు.. అయితే నా లక్ష్యాన్ని మాత్రం అది మార్చలేకపోయింది. అది 2011, అక్టోబర్‌ 29.. అప్పుడు నాకు 13 ఏళ్లు. ఓ భయంకరమైన కారు ప్రమాదానికి గురయ్యా. అదెలా జరిగిందో నాకు గుర్తుండకపోవడం ఆ దేవుడు నాకు ప్రసాదించిన వరమనుకుంటా. ఆ తర్వాత కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రిలోని ఐసీయూ బెడ్‌పై దీనావస్థ స్థితిలో ఉన్నా. భుజాలు, పక్కటెముకలు, వెన్నెముకకు అయిన తీవ్ర గాయాలతో నా ఛాతీ కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. దాదాపు నాలుగు నెలల పాటు ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. ఇలా ఈ ప్రమాదంతో ఇకపై ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిగా కొనసాగాలన్న ఊహే ఆ క్షణం నా గుండెల్ని ముక్కలు చేసింది. నా శరీరంలో మూత్ర, మల విసర్జన వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. ఇకపై నేను పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితమవ్వాలన్న చేదు నిజాన్ని ఆ క్షణం జీర్ణించుకోలేకపోయా.

అది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే!

13 ఏళ్ల పాటు ఒకలా సాగిన నా జీవితం ఆ తర్వాత పూర్తి భిన్నంగా మారిపోయింది. ప్రమాదం తర్వాత అందరూ నన్ను పీడబ్ల్యూడీ (పర్సన్‌ విత్‌ డిజెబిలిటీ - ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తి)గా పిలవడం మొదలుపెట్టారు. అయితే అంతకంటే ముందు నన్ను ఇలా పిలిచేవాళ్లంతా నేనూ అందరిలాగే ఒక మనిషిని అని ఎందుకు గుర్తించరో ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఎవరైనా నన్ను చూడగానే.. నా వీల్‌ఛైర్‌నే చూస్తారు తప్ప.. నా అందమైన చిరునవ్వు, చదువులో నేను సాధించిన విజయాలు, నాలో దాగున్న ప్రతిభ.. ఇవేవీ వారికి కనిపించవు. నేనంటే వీల్‌ఛైర్‌, వీల్‌ఛైర్‌ అంటే నేను అన్నట్లుగా చూస్తారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల పట్ల సమాజం ఎలాంటి ధోరణితో ఉందో నాకు ప్రమాదం జరిగాక గానీ అర్థం కాలేదు. నిజానికి ఇలాంటి జాలి, దయతో చూసే చూపులే వారిని మరింతగా కుంగదీస్తున్నాయి. అందుకే సమాజంలో డిజెబిలిటీ చుట్టూ ముసురుకున్న మూసధోరణుల్ని బద్దలుకొట్టాలనుకున్నా.

చదువే నా ఆయుధం!

ఇక వీటికి తోడు నా శారీరక లోపాల గురించి మా ఇరుగుపొరుగు వాళ్లు, మా బంధువులు అనే మాటలతో నేను, నా తల్లిదండ్రులు విసుగెత్తిపోయాం. అలాగని ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. శారీరక లోపాలున్నంత మాత్రాన వారు వారి కుటుంబానికి ఎప్పుడూ భారం కారన్న విషయం నిరూపించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. అందుకు చక్కగా చదువుకోవడమే మార్గమనుకున్నా. ఈ క్రమంలోనే 12వ తరగతి వరకు ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నా. పది, పన్నెండు తరగతుల్లో 90 శాతం మార్కులొచ్చాయి. దాంతో నాలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఇక నాలుగ్గోడల మధ్య ఉండడం నా వల్ల కాదని నా తల్లిదండ్రులతో చెప్పా.. దిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో చేరతానన్నాను. కానీ అది నీ వల్ల కాదంటూ ఇరుగుపొరుగు వారు, బంధువులు అందరూ నన్ను నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. కానీ నేను నా లక్ష్యాన్ని వీడలేదు. లేడీ శ్రీరాం కళాశాలలో పైచదువుల కోసం అప్లికేషన్‌ పెట్టాను. అందులో సీటొచ్చింది. ఒంటరిగానే దిల్లీకి మకాం మారాను. అటు చదువుకుంటూనే కంటెంట్‌ రైటింగ్‌పై దృష్టి పెట్టా. ఈ క్రమంలో కొంత డబ్బు కూడా సంపాదిస్తున్నా. నా అవసరాలన్నీ మరొకరి ప్రమేయం లేకుండా పూర్తిచేసుకుంటున్నా. శారీరక లోపాలున్న వారు ఇతరులపై ఆధారపడాల్సిందే అన్న మూసధోరణిని ఇలా బద్దలుకొట్టాను.

అదే నా ఆశయం!

ఇక ఇప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి నాకు సీటొచ్చింది. పబ్లిక్‌ పాలసీ విభాగంలో పీజీ చేయబోతున్నా. ఇది నాకెంతో సంతోషకరమైన విషయం. ఇక ఇప్పటివరకు మన దేశం నుంచి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి ఎంపికైన తొలి వీల్‌ఛైర్‌ యూజర్‌గా నిలవడం నాకు మరో ఆనందం! నేను ఆక్స్‌ఫర్డ్‌లో చేరాక ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం ఒక యూట్యూబ్ ఛానల్‌ ప్రారంభించే ఆలోచనలో ఉన్నా. నేను అక్కడ నేర్చుకున్న విద్యను, నా అనుభవాలను ఈ ఛానల్‌ వేదికగా వారితో పంచుకుంటాను. నా సక్సెస్‌ఫుల్‌ జర్నీలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు!

గాడ్‌ బ్లెస్‌ యూ బేటా!

ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి ఎంపికై శారీరక లోపాలు విజయానికి అడ్డు కాదని నిరూపించిన ప్రతిష్థాను పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు. ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆయన.. ‘ప్రతిష్థా దేవేశ్వర్‌ సంకల్పం, పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శం! మాస్టర్స్‌ కోసం ఆక్స్‌ఫర్డ్‌లో చేరబోతోన్న తొలి వీల్‌ఛైర్‌ యూజర్‌గా నిలిచింది ప్రతిష్థా. ఆమె తన లక్ష్యాన్ని సాధించి తిరిగి దేశానికి సేవలందించాలని కోరుకుంటున్నా.. ఆల్‌ ది బెస్ట్‌ అండ్‌ గాడ్‌ బ్లెస్‌ యూ బేటా!’ అంటూ క్యాప్షన్‌ పెట్టారాయన.

‘శారీరక లోపాలున్నంత మాత్రాన వారు మరొకరిపై ఆధారపడతారనుకోవడం అస్సలు కరక్ట్‌ కాదు.. అలాంటి వారు తమలో ఉన్న లోపాలను సక్సెస్‌కు మెట్లుగా ఉపయోగించుకుంటారు.. జీవితంలో విజయం సాధిస్తారు..’ అంటూ నేటి యువతకు మార్గనిర్దేశనం చేస్తున్న ప్రతిష్థా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం!

ABOUT THE AUTHOR

...view details