అమ్మ తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చుతుంది.. ఇలా తన చిన్నారికి పాలిచ్చే క్రమంలో ఎంతో భావోద్వేగానికి, ఎనలేని ఆనందానికి లోనవుతుంటుంది. అయితే అమ్మతనానికి అద్దం పట్టే ఈ బ్రెస్ట్‌ఫీడింగ్ ప్రక్రియ గురించి మహిళల్లో ఎంత అవగాహన కల్పించినప్పటికీ అది నాలుగ్గోడలకే పరిమితమవుతుంది తప్ప.. బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడానికి నేటికీ చాలామంది తల్లులు ముందుకు రావట్లేదు. ఇందుకు కారణాలు అనేకం! ముఖ్యంగా తల్లి ఎంతో ప్రేమగా బిడ్డకు పాలిచ్చే ఈ ప్రక్రియను కొంతమంది చెడు దృష్టితో, లైంగిక విషయంగా పరిగణిస్తుంటారు. తల్లి పాలు తాగి పెరిగి.. తల్లితో సమానమైన అలాంటి మహిళలు వారి పిల్లలకు పాలిచ్చే క్రమంలో వారిని తప్పుడు దృష్టితో చూడడం, విమర్శించడం చేసే కొందరు మూర్ఖులు మన సమాజంలో కొందరున్నారు. అలాంటి వారికి తనదైన రీతిలో సమాధానమిచ్చింది బాలీవుడ్ లవ్లీ బ్యూటీ నేహా ధూపియా. ఈ క్రమంలో బ్రెస్ట్‌ఫీడింగ్ విషయంలో ఇటీవలే ఓ తల్లి ఎదుర్కొన్న చేదు అనుభవానికి మద్దతుగా నిలుస్తూ.. ఈ ప్రక్రియ ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కొంతమంది కారణంగా సోషల్ మీడియాలో మంచి కంటే చెడే ఎక్కువగా ప్రచారమవుతోంది. ఇక ఇందులో పెట్టే ఫొటోలు, వీడియోలకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తుంటాయి. ఎందులోనైనా తప్పులు వెతికే వారికి ఇదో వారధిలా మారుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ నెటిజన్ ఓ మహిళ విషయంలో అభ్యంతరకరంగా మాట్లాడుతూ.. తన బ్రెస్ట్‌ఫీడింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిందిగా సదరు మహిళను కోరాడు. దీంతో ‘ఇదే విషయం మీ అమ్మను/నాయనమ్మను అడుగు..’ అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తూ ఆ నెటిజన్ నోరు మూయించిందా మహిళ. ఇక ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆ మహిళకు బాలీవుడ్ నటి నేహా ధూపియా అండగా నిలిచింది. బిడ్డల ఆకలి తీర్చడానికి తల్లి పాలిచ్చే ఈ అద్భుతమైన ప్రక్రియను చెడు దృష్టితో చూడద్దని, ప్రతి తల్లి జీవితంలో ఇది సర్వసాధారణమేనంటూ కాస్త ఘాటుగానే స్పందించింది నేహ.
అది ఆమెకే తెలుసు!
తాను తన కూతురు మెహ్ర్‌కు పాలిస్తోన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న నేహ.. ‘కొత్తగా తల్లైన మహిళలకు ఎదురయ్యే అనుభవాలేంటో, ఈ క్రమంలో ప్రతికూలతల్ని తట్టుకుంటూ ఎలా ముందుకు సాగాలో వారికి మాత్రమే తెలుసు! అమ్మతనం అనేది ఓ గొప్ప బాధ్యత. ఎన్నో భావోద్వేగాలు ఇందులో మిళితమై ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుంటూ ముందుకు సాగడమంటే సవాలుతో కూడుకున్న విషయం. ఇది అర్థం చేసుకోకుండా అమ్మతనం గురించి కొంతమంది ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడుతుంటారు. బ్రెస్ట్‌ఫీడింగ్ విషయంలో విమర్శలు గుప్పిస్తుంటారు. వారు చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇది ఎంతమాత్రం కరక్ట్ కాదు. ఇలాంటి విమర్శలు నేనూ ఎదుర్కొన్నా.. ఇవి మనసును ఎంతగా మెలిపెడతాయో నాకు తెలుసు!