‘కష్టపడేతత్వం, సృజనాత్మకంగా ఆలోచించగలిగే నేర్పు ఉంటే చాలు... విజయాలు వెంట నడిచొస్తాయి’ అనడానికి రిచా మహేశ్వరినే ఉదాహరణ. రిచా దిల్లీ నిఫ్ట్‌లో ఫ్యాషన్ కమ్యూనికేషన్స్ విద్యార్థిని. చదువు కోసం రూ.12 లక్షల విద్యారుణం తీసుకుంది. దాన్ని చదువయ్యేలోపే సొంత సంపాదనతో చెల్లించేసింది. నాలుగో ఏడాదికి వచ్చేసరికి... ఆమె స్నేహితులంతా ప్లేస్‌మెంట్స్ కోసం వెతుకుతుంటే తను మాత్రం చదువులో బంగారు పతకం కొట్టేసి, సొంతంగా ఓ స్టూడియోను ఏర్పాటు చేసింది.
నానమ్మ పెంపకంతో...
రిచాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్. ఆమెపై నానమ్మ ప్రభావం ఎక్కువ. ఆవిడ సంప్రదాయాలకు విలువనిస్తూనే, మూఢాచారాలకు దూరంగా ఉండేది. ఆడపిల్లలకు అన్నింటా సమానత్వం అవసరమని చెప్పేది. ఆ స్వతంత్ర భావాలే రిచాకూ ఒంటబట్టాయి. చిన్నప్పటి నుంచీ చదువుల్లో ముందుండే రిచా దిల్లీలోని నిఫ్ట్‌లో సీటు దక్కించుకుంది. ఖర్చులకోసం ఇంట్లో వాళ్లపై ఆధారపడకూడదని ట్యూషన్లు చెప్పి సంపాదించేది. ఓసారి కెనాన్‌డీ60 కెమెరాతో స్నేహితురాలికి రిచా తీసిన ఫొటోలు ఆమెలో దాగిఉన్న ప్రతిభను బయటపెట్టాయి. దాన్ని గమనించిన ఓ ప్రొఫెసర్ మరిన్ని మెరుగులు దిద్దుకునేలా శిక్షణనందించారు. అలా విద్యార్థిదశలోనే సొంతంగా ఓ ఫొటోస్టూడియోనూ ఏర్పాటు చేసుకుంది.
బెదిరింపులు వచ్చినా...
ఆరిఫ్లేమ్, కిసాన్, హెవెల్స్‌తో పాటు అనేక అంతర్జాతీయ ఉత్పత్తులకోసం ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన రిచా మొదట్లో ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడింది. ‘అప్పటికే ఈ రంగంలో తలపండినవారున్నారు. వారంతా తరచూ బెదిరింపులకు దిగేవారు. నాదైన స్టైల్ క్రియేట్ చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది’ అనే రిచా తర్వాత కార్పొరేట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో తనదైన ముద్ర వేసింది. ప్రయాణాలంటే ఆసక్తి ఉన్న రిచా ఇప్పటివరకూ 49 దేశాలను ఒంటరిగా చుట్టేసింది. డాక్యుమెంటరీలు, ఫిల్మ్‌మేకింగ్, ఫొటోగ్రఫీలో ఎన్నో అవార్డులూ అందుకుంది.