చాలా ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సౌర దీపాల తయారీ నేర్పించే పథకం ఒకటి ప్రవేశపెట్టింది. ముందు దాన్ని స్కూలు పిల్లలతో ప్రారంభించారు. అనంతరం గ్రామీణ మహిళలకూ విస్తరించారు. అక్కడి మహిళలు ఈ పథకంతో లబ్ధి పొందారు. వీరిలో ఇద్దరు యువతుల గురించి మనం చెప్పుకోవాల్సిందే. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి... ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న యువతులు... ప్రస్తుతం లాభాలు పొందుతూ... కుటుంబాన్ని పోషిస్తున్నారు.
విజయపథంలో దూసుకుపోతూ..
ఖజూరీలో ఒక నిరుపేద కుటుంబం. ఎనిమిది మంది పిల్లల్లో నజ్రానీ ఖాన్ ఏడో అమ్మాయి. సోషియాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్. అంతకు మించి విజయపథంలో దూసుకుపోతున్న వ్యాపారి. ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని కలిసి మాట్లాడగలిగింది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే ‘ప్రేరణ ఒజాస్ ప్రోగ్రామ్’ (Prerana Ojas program) వల్లే. సోలార్ దీపాల (Solar lamps) తయారీలో నైపుణ్యం సంపాదించి ఇప్పుడు సొంతంగా దుకాణం నడిపిస్తోంది. ‘నేను అనుభవించిన దుర్భర దారిద్య్రంలో ఒక సైకిల్ గురించి కూడా కొనగలను అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు స్కూటరు, మొబైలు కొనుక్కున్నాను. అమ్మకు వైద్యం చేయించగలిగాను. అమ్మానాన్నలకు ఆర్థికసాయం చేస్తున్నాను’ అంటూ ఆనందంగా చెబుతుందామె.
కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే..
పూనమ్‌ది లక్ష్మీపూర్ ఖేరీ జిల్లా. ఇద్దరు పిల్లల తల్లి. ఆమె కూడా సోషియాలజీలో పీజీ చేసింది. రోజుకూలీలైన తల్లిదండ్రులు ఆమెను చదివించడానికి చాలానే కష్టపడ్డారు. ‘ఈ పిల్లకి చదువు అవసరమా’ అంటూ తోటివాళ్లు ఎన్నిసార్లు అవమానించినా... చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ‘ఎంత చదివినా కలుపు తీయాల్సిందే’ లాంటి మాటలతో గేలిచేయడం ఇప్పటికీ గుర్తొస్తాయామెకి. పెళ్లయ్యాక ఆ ఎగతాళులన్నీ నిజమయ్యాయి కూడా. ‘ప్రేరణ ఒజాస్ (Prerana Ojas Program)’ పథకం అమలవగానే సోలార్ దీపాల (Solar Lamps) తయారీలో చేరింది. భర్తతో చెబితే ‘పీజీతోనే ఉద్యోగం రాలేదు, మళ్లీ ఇదొకటా?’ అంటాడని మొదట చెప్పలేదు. ఇప్పుడది ఆదాయం తెచ్చిపెట్టడం చూసి గర్వించడమే కాదు, అతనూ ఆమెతో కలిసి పని చేస్తున్నాడు.