భూమిని అమ్మగా కొలిచే సంస్కృతి మనది. భూమాతగా ఆమెను పూజిస్తాం. చరాచర పృథ్వీ మండలాన్ని స్త్రీగా పేర్కొన్న తొలి సందర్భం మనకు అధర్వణ వేదంలో కనిపిస్తుంది. అందులో భూమాతను వసుంధర అని పేర్కొన్నారు. ఆమె ఆవిర్భావానికి కారణమైన కథా సందర్భం లక్ష్మీ నారాయణ స్తోత్రంలో కనిపిస్తుంది. అప్పటికీ భూతలం ఏర్పడలేదు. మధుకైటభులనే రాక్షసులు భువిపై మాత్రమే మరణించే వరాన్ని పొందారు. అంకపీఠాన్ని కూడా భువి అంటారు.
పుడమికి స్త్రీకారం.. అనంత శక్తి స్వరూపం...
స్త్రీ అనంత శక్తి స్వరూపం. ఆమె లాలించగలదు.. పాలించగలదు.. ప్రేమించగలదు.. దుర్మార్గాన్ని ఖండించనూగలదు. ఆమె విశిష్ట మూర్తిమత్వానికి ప్రతీక విజయదశమి. అష్టలక్ష్ములుగా, నవదుర్గలుగా అమ్మను కొలవడం పరిపాటి. పురాణాల్లో అనేక రూపాల్లో వ్యక్తమయ్యే జగన్మాత స్వరూపాలు భిన్నకోణాల్లో స్త్రీ విశిష్టతను చాటుతాయి. అందులో ఒకటి వసుంధర రూపం.
శ్రీమహావిష్ణువు ఆ రాక్షసులను తన తొడపై ఉంచి సంహరించాడు. అప్పుడు వారి శరీరం నుంచి వచ్చిన కొవ్వుభాగం ధరణీతలంగా ఏర్పడిందని అందులో ఉంది. ఆ ధరణికి వసుంధర అని పేరు. ఈమె అనంత ప్రకృతి స్వరూపం. అద్భుత సంపదల నిలయం. అందుకే వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆమెను ప్రేమించడమే కాదు సర్వదా పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. స్వయంగా భగవంతుడే పూజించినందున ఆమె అణువణువూ ఆరాధనా స్థలంగా మారింది.
క్షమా, ఓర్పు ఆమె గుణాలు. వసుంధర సకల సస్యాలకూ నిలయం. పంటలూ, ఓషధులూ, పంచలోహాలూ, నవరత్నాలూ ఆమె గర్భంలోనివే. తనకు గాయాలవుతున్నా తనలోని సర్వజీవులకూ జవజీవాలు అందిస్తున్నందున భూమాతగానూ ఆమె వినుతికెక్కింది. ఆమె అందించే వనరులను సద్వినియోగం చేసుకోవడం మనిషి కర్తవ్యం.