సూపర్ దాదీ
ఎనభై నాలుగేళ్లు అంటే ఇతరులపైన ఆధారపడే వయసు. ఆ వయసులోనూ తన గురించి కాకుండా గ్రామ ప్రజల బాగుకోసమే ఆలోచిస్తోంది తమిళనాడులోని తోప్పంపట్టికి చెందిన నంజమ్మాళ్. పలుగూ పారా చేతబట్టి...తన గ్రామంలో పెరటితోటల ఏర్పాటు మొదలుపెట్టింది. ఎందుకంటే కరోనా సమయంలో ప్రజలు పోషకాహారం తీసుకుంటే వైరస్‌ని సమర్థంగా ఎదుర్కోవచ్చని టీవీలో విన్నది. అయితే నిత్యం పొలం పనుల్లో మునిగితేలే గ్రామస్థులు తమ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. కనీసం కూరగాయలూ, పండ్ల్లూ ఇంట్లో పండితేనైనా ప్రజలు వాటిని తీసుకుంటారని భావించింది నంజమ్మాళ్. అందుకే తానే స్వయంగా టొమాటో, బెండకాయ, వంకాయ, ములక్కాడలూ, జామ, బొప్పాయి వంటివి నారుపోసింది.
ప్రతి ఇంట్లో గుంతలు తీసి తనే స్వయంగా ఆ నారును నాటింది. దాంతోపాటు ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, కాకరకాయ వంటివి విత్తి... అవి మొలిచాక వాటిని తీగలుగా పాకించే ఏర్పాట్లూ చేసింది. అలా ఐదు నెలల నుంచి గ్రామంలోని ప్రతి ఇంట్లోని మొక్కల్ని నంజమ్మాళే సంరక్షిస్తోంది. మొక్కల్ని చీడపీడల నుంచి కాపాడటానికి వేప, సీతాఫలం ఆకులతో చేసిన కషాయాలను చల్లుతోంది. ప్రస్తుతం ఆ గ్రామంలోని వారంతా కూరగాయలు కొనకుండా ఇంటి పంటనే వంటకు వాడతున్నారు. అధిక దిగుబడి వచ్చినవారు అమ్ముకుని అదనపు ఆదాయం గడిస్తున్నారు. అలా ఆదాయాన్నీ ఆరోగ్యాన్నీ సొంతం చేసుకుంటున్న గ్రామస్థులంతా ఆ బామ్మని సూపర్ దాదీ అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు.
పిట్ట సాయం
తమిళనాడులోని కోయింబత్తూరు దగ్గర కులత్తు పాళ్యానికి చెందిన అరవై రెండేళ్ల ముత్తుమురుగన్‌ది వ్యవసాయ కుటుంబం. అతనికి చిన్నప్పట్నుంచీ ప్రకృతి అంటే ప్రాణం. పర్యావరణానికి మేలు జరగాలనీ పశుపక్ష్యాదులు బాగుండాలనీ ఎప్పుడూ కోరుకుంటాడు. అందుకే ఏటా తనకున్న నాలుగు ఎకరాల్లో సాగు చేసి... అందులో కొంత పంటను పక్షుల కోసం వదిలేస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్లు వాటిని తరిమివేస్తున్నా ముత్తు మాత్రం వాటి కడుపునింపాలనే చూస్తుంటాడు.