తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

శంఖంతో దర్శనమిచ్చే... మీసాల కృష్ణుడు!

శ్రీకృష్ణుడిని రుక్మిణీ సమేతంగా.. అదీ మీసాలతో దర్శించుకోవాలంటే చెన్నైలోని పార్థసారథి ఆలయానికి వెళ్లాల్సిందే. మీసాల కృష్ణుడిగా పిలిచే ఈ స్వామిని ఆత్రేయ మహర్షి ప్రతిష్ఠించారని అంటారు. సుమారు అయిదువేల ఏళ్లక్రితం నాటి ఈ ఆలయంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం.

lord Krishna with mustache
చెన్నైలో మీసాల కృష్ణుడు

By

Published : Nov 1, 2020, 9:20 AM IST

చేతిలో శంఖం.. మరో చేత్తో గీత బోధిస్తున్నట్లుగా కనిపించే స్వామి పార్థసారథి. ఈ మూలవిరాట్టుకు మీసాలు ఉంటాయి కాబట్టి స్వామిని మీసాల కృష్ణుడని అంటారు. కొందరు వేంకటకృష్ణస్వామిగానూ కొలుస్తారు. ఇక్కడ స్వామి రుక్మిణి, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్న, అనిరుద్ధ సమేతంగా దర్శనమివ్వడంతో ఈ ఆలయాన్ని దక్షిణ బృందావనంగా పిలుస్తారు. సప్తరుషులు ఇక్కడ పూజచేశారనీ చెబుతారు. 108 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయం దాదాపు అయిదువేల ఏళ్ల నాటిదని చెప్పడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

స్థలపురాణం

సుమతి అనే మహారాజు వేంకటేశ్వరస్వామి అనుగ్రహాన్ని కోరుతూ... తనకు భగవద్గీత చెబుతున్నట్లుగా దర్శనం ఇవ్వమంటూ తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన స్వామి... అతడికి కలలో కనిపించి బృందారణ్యకు వెళ్తే అతడి కోరిక నెరవేరుతుందని చెప్పాడట. అదే సమయంలో ఆత్రేయ మహర్షి కూడా తపస్సు చేయడానికి ఓ స్థలం చూపించమంటూ వేదవ్యాసుడిని అడిగాడట. వేదవ్యాసుడు కూడా అతడిని బృందారణ్యకు వెళ్లమని చెబుతూనే కుడిచేతిలో శంఖం, ఎడమచేయి జ్ఞానముద్రలో ఉన్న స్వామి విగ్రహాన్ని ఇచ్చాడట. ఆత్రేయ మహర్షి స్వామి విగ్రహంతో ఆ ప్రాంతాన్ని చేరుకున్నాక... మహారాజు కూడా అక్కడికి వచ్చి స్వామి రూపాన్ని దర్శించుకుని ఆనందించాడట. ఆ తరువాత ఆత్రేయ మహర్షి అక్కడే స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం.. తరువాత పల్లవరాజులు ఆలయాన్ని కట్టించడం జరిగిందట.

ఆ తరువాత చోళులూ, విజయనగర రాజులూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. ఇక్కడ స్వామి విగ్రహం ముఖంపైన అక్కడక్కడా గాట్లు ఉంటాయని కూడా అంటారు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో భీష్ముడు సంధించిన అస్త్రాలు శ్రీకృష్ణుడికి తగలడం వల్లే ముఖంపైన గాట్లు పడ్డాయని అంటారు. ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణిని కలువపూల కొలను అని పిలుస్తారు. చరిత్ర ప్రకారం.. ఇక్కడున్న పుష్కరిణిలోనే లక్ష్మీదేవి భృగుమహర్షికి వేదవల్లిగా పుట్టిందట. భృగుమహర్షి తనకు స్వామే అల్లుడిగా రావాలని కోరుతూ తపస్సు చేస్తే... ఇక్కడి పుష్కరిణిలోని ఓ తామరపువ్వు మధ్యలో పడుకున్న పాపాయి కనిపించిందట. దాంతో మహర్షి పాపను తీసుకెళ్లి వేదవల్లి అని పేరు పెట్టి... పెంచి, పెద్దచేశాడట. ఆ తరువాత ఆమె రంగనాథస్వామిని వివాహం చేసుకుందట. లక్ష్మీదేవి ఈ కొలనులో పుట్టింది కాబట్టి దీన్ని కైరవిని అని పిలవడంతోపాటు ఈ పుష్కరిణిలోని నీటికి ఔషధ గుణాలన్నాయనీ చెబుతారు. ఒకప్పుడు తిరుపతి నుంచి వచ్చే భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారని అంటారు.

రెండుసార్లు బ్రహ్మోత్సవాలు

ఈ ఆలయంలో స్వామికి ఏడాది పొడవునా పూజలు నిర్వహించడం ఒకెత్తయితే... రెండుసార్లు బ్రహ్మోత్సవాలు చేయడం... విగ్రహాలను ఊరేగించడం మరొకెత్తు. ఇక్కడ స్వామికి వండే నైవేద్యాల్లో నెయ్యి ఎక్కువగా వాడతారు. అలాగే వేరుసెనగ పప్పు, దీని నూనె, ఎండుమిర్చి వాడకాన్ని నిషేధంగా భావిస్తారు. స్వామి ముఖంపైన ఉన్న గాయాలు మానడానికే అలాంటివి వాడరని అంటారు. ఈ ఆలయంలో పార్థసారథితోపాటూ సీతా, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా శ్రీరాముడినీ... యోగ నరసింహుడినీ దర్శించుకోవచ్చు. ఆలయంలో మొదటి పూజను నరసింహస్వామికే నిర్వహించడం విశేషం. నరసింహస్వామి గోపురం ముందు గంట ఉన్నా... దాన్నుంచి శబ్దం రాదు. ఇక్కడ స్వామికి ఉప్పు, మిరియాలు సమర్పిస్తే... సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

ఎలా చేరుకోవచ్చంటే..

చెన్నై ట్రిప్లికేన్‌లో ఉన్న పార్థసారథి ఆలయానికి విమానమార్గం ద్వారా చేరుకోవాలంటే మీనంబాకం విమానాశ్రయంలో దిగి... అక్కడి నుంచి దాదాపు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి క్యాబ్‌లు లేదా బస్సుల ద్వారా చేరుకోవచ్చు. అదే రైల్లో వెళ్లాలనుకుంటే చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడినుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి- ఆటోలో వెళ్లొచ్చు.

ABOUT THE AUTHOR

...view details