తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

శివరాత్రినాడు పరమశివుణ్ణి ఎలా అభిషేకించాలి? - Anointing Lord Shiva

భక్తులు కోరిన కోర్కెలను తీర్చే భోళాశంకరుడిని మనసారా పూజించి, ఏ కోరిక కోరినా ప్రసాదిస్తాడు. నిత్యాభిషేక ప్రియుడు కావడంతో పూలు,పత్రం, నీరు ఏది సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అసలు అభిషేకం ఎలా చేయాలి? అభిషేకంలో ఉన్న అంతరార్థం ఏమిటి?

How to anoint Lord Shiva
శివరాత్రినాడు పరమశివుణ్ణి ఎలా అభిషేకించాలి?

By

Published : Mar 11, 2021, 9:03 AM IST

పరమశివుడు అభిషేక ప్రియుడు. ఓ పండు సమర్పించినా, ఓ చెంబుడు నీళ్లతో అభిషేకించినా దండిగా అనుగ్రహించే బోళాశంకరుడాయన. మహాశివరాత్రినాడు చేసే అభిషేకం మహాదేవునికి మరింత ప్రీతికరమని చెబుతారు. మనం ఒంటిపై ఉన్న దుమ్ము, ధూళి, మురికి తొలగించుకోవటానికి స్నానం చేస్తాం. మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళన కావడానికి పరమశివుడికి అభిషేకం చేయాలి. రజస్సు అంటే రజోగుణం అనీ ధూళి అనీ అర్థాలున్నాయి. మనలోని రజోగుణాన్ని సంస్కరించడానికి, మానవత్వం ఉన్నవారిగా మారడానికి పరమశివుణ్ణి అభిషేకించాలి.

ఫలోదకాలను మన తెలివితో సంపాదించుకున్నామనే అహంకారం వదిలి, అవన్నీ భగవంతుడు ప్రసాదిస్తేనే అనుభవించగలుగుతున్నామని గుర్తించాలి. అలా గుర్తించి, ‘నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామ’ని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడం అభిషేకంలో ఉన్న అంతరార్థం.

వినయాన్ని విన్నవించుకోవటం అభిషేకం. సృష్టిలో తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిననీ, తనంతటివారు మరెవరూ లేరనీ అనుకోవటం అహంకారం. కానీ, అభిషేక సమయంలో వినిపించే ‘రుద్రాధ్యాయం’లోని మంత్రభాగం మనకు కనువిప్పు కలిగిస్తుంది. సృష్టిలోని సకలప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూపమేననీ, సకల ప్రాణులకూ శుభం కలగాలని మనం అందులో కోరుకుంటాం. ఈ మంత్రాల అర్థాలు మన అంతరంగాన్ని తట్టి మేల్కొల్పుతాయి. అప్పుడు జ్ఞాన జ్యోతి స్వరూపుడైన పరమశివుడు మనలో ఆవిర్భవిస్తాడు. అదే మహాశివరాత్రి నాడు మనం పొందవలసిన ‘మహాలింగోద్భవ’ సందర్శనం.

సర్వేశ్వరుడి కృపను పొందాలంటే...

ముందుగా వైరాగ్యమనే నూనెను సంపాదించుకోవాలి. భక్తి అనే దీపపు వత్తిని సిద్ధం చేసుకోవాలి. ఆ నూనెను, వత్తిని జ్ఞానబోధ అనే పాత్రలో ఉంచి ధ్యానమనే దీపాన్ని వెలిగించాలి. అప్పుడు ఆత్మజ్ఞానం ఆవిష్కృతమవుతుంది. సాధకుడి హృదయం దేదీప్యమానమవుతుందని మార్కండేయ మహర్షి తెలిపారు.

అదే శివతత్వం!

బలహీనులు, మూఢులు, విషయాలను అర్థం చేసుకునే శక్తి లేని వారు మాయా ప్రభావానికి లోనవుతారు. శరీరం, ఇంద్రియాలు, మనస్సు... ఇవి సత్యమని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి భ్రమలను తొలగించే శక్తి సర్వలోకాలకు గురువైన దక్షిణామూర్తికే ఉంది. శివుడి అష్టమూర్తులు భూమి, జలం, అగ్ని, ఆకాశం, వాయువు, సూర్యుడు, చంద్రుడు, జీవుడుగా విరాజిల్లుతుంటాయి. అంటే అన్నిటిలో ఉండి, వాటిని నడిపించే, వెలిగించే అఖండమైన ఆ శక్తి శివుడే అని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న సాధకుడికి అందరిపై, అన్నిటిపై సమభావన కలుగుతుంది. ఇదే శివతత్త్వజ్ఞానం. దీన్ని తెలుసుకున్న వారికి మరణభయం ఉండదు. ఇదే విషయాన్ని మార్కండేయ మహర్షి తన దగ్గరకొచ్చిన రుషులకు తెలియజేశాడు.

ABOUT THE AUTHOR

...view details