తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఒక సాధారణ మనిషి.. మహర్షి ఎలా అవుతాడు..? - inspirational quotes for covid-19

రుషి కావటానికి మనిషి అడవుల్లోకి వెళ్లాలా..? కందమూలాలు తింటూ కాలం గడపాలా..? అలా కాకుండా మనిషి మహర్షి కాలేడా..? అసలు, రుషి అంటే ఎవరు..? తపస్సు అంటే ఏంటి..? రోజువారీ జీవితం గడుపుతూనే ఒక సాధారణ మనిషి మహర్షి ఎలా అవుతాడు..?

How an ordinary man becomes a sage with his thinking
How an ordinary man becomes a sage with his thinking

By

Published : May 27, 2021, 9:59 AM IST

రుషి అనే మాటకి దర్శించగలవాడు అని అర్థం. కళ్లున్న వారందరూ చూడగలరు కదా! మరి కొంతమందినే రుషులు అని ఎందుకంటాం? అనే సందేహం రావటం సహజం. నిజానికీ మనం చూడాల్సిన దాన్ని చూస్తున్నామా? చర్మ చక్షువులతో భౌతిక రూపాన్ని మాత్రమే చూడగలం. కానీ, భౌతిక రూపాన్ని మించింది కూడా ఒకటి ఉంది కదా! దాన్ని చూడగలవాడే రుషి.
*కొన్ని వేల ఏళ్లుగా, కోట్ల మంది ఎన్నో కోట్ల ఆపిల్‌ చెట్ల నుంచి పళ్లు కింద రాలి పడటం చూశారు. అది చూడటం మాత్రమే. కానీ, న్యూటన్‌ మహాశయుడు అలా పడటానికి గల కారణాన్ని దర్శించాడు. కాబట్టే, రుషి లేదా దార్శనికుడు అనే మాటకి తగినవాడయ్యాడు.

ఉన్నత స్థితి కోసం

*సామాన్యులు భౌతిక రూపాన్ని దాటి మనసులో ఉన్న భావాలని కూడా చూడలేరు. ఇక తత్త్వాన్ని ఏం చూస్తారు? పదార్థంతో పాటు యథార్థాన్ని కూడా చూడగలవారే రుషులు.
*ఎవరూ పుట్టుకతో రుషి కాదు. తపస్సు, సాధనతో అలాంటి స్థాయికి చేరుకుంటారు. మనిషి రుషిగా పరిణామం చెందటం అంటే అదే!
*తపస్సు అంటే అడవులకి వెళ్లి, కందమూలాలు తింటూ ఉండటం అనే అభిప్రాయం ఉంటుంది అందరికీ. భగవద్గీతలో భగవానుడు తపస్సు స్థూలంగా మూడు రకాలు అని చెబుతాడు. కాయిక, వాచిక, మానసిక తపస్సులు. ఎవరికి వీలైన దాన్ని వారు ఆచరించవచ్చు.
*మనోమయ జీవుడు కనుకనే మానవుడు, మనిషి అనే పేర్లు. మనిషి మహర్షి కావటానికి ఇంటినీ సంసారాన్నీ వదలి సన్యసించనక్కరలేదు. మరో ప్రధాన విషయం ఏమంటే, దాదాపు అందరు రుషులు సంసారులే! రుషి వాటికల్లో నిరాడంబరంగా జీవించటానికి ఇష్టపడిన కన్యలే ఋషిపత్నులు అయ్యేవారు. ఆధ్యాత్మిక మార్గంలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండేవారు.
*భోగభాగ్యాలు వదలి నిరాడంబరంగా, కఠిన నియమాలు పాటిస్తూ రుషులు పొందేదేంటి? కోరికలు లేకపోతే తపస్సు ఎందుకు చేస్తున్నట్టు? అనే సందేహం రావటం సహజం. వారి లక్ష్యం ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవటం.

అదీ తపస్సే

చేసే పని మీద దృష్టి కేంద్రీకరించి త్రికరణశుద్ధిగా అందులో లీనమై చేయటం కూడా తపస్సే. అందుకే, ఏ పనైనా దీక్షగా చేస్తే ‘తపస్సు’లాగా చేశాడని అంటారు. ఓ ‘రుషి’లాగా అందులో లీనమయ్యాడని చెబుతారు.

అతడే రుషి!

‘తప’ శబ్దానికి వేడెక్కటం అని అర్థం. సాధించాల్సిన దాని కోసం మనిషి చేసే ప్రయత్నంలో అతనిలో వేడి పుడుతుంది. ఆ వేడిలో మనస్సు మరిగి అందులోని కల్మషాలు ప్రక్షాళితమై నిర్మలమవుతుంది. ఆ క్రమంలో వ్యక్తిగత ప్రయోజనాలు పక్కకెళ్లిపోతాయి. శారీరక, కౌటుంబిక పరిమితులు మాయమవుతాయి. విశ్వశ్రేయస్సు మాత్రమే వారి దృష్టిలో ఉంటుంది. మనోమయజీవి మనసు చేసే మాయను తొలగించుకొని భౌతికతను దాటి చూడగలుగుతాడు. అతడే రుషి.

విశ్వామిత్రుడి పరిణామం

  • సాధారణ మనుషులకు గొప్పగా అనిపించేవి రుషులకు తృణప్రాయాలు. వారి దగ్గర అన్నిటికన్నా గొప్పదైనా ఆధ్యాత్మిక సంపద ఉంటుంది. కాబట్టి, అల్పమైన వాటిని పట్టించుకోరు. వారి దగ్గరున్న దైవీ సంపద అందరికీ మేలు చేకూరుస్తుంది.
  • ఇలాంటి క్రమపరిణామం ఎలా జరుగుతుందో తెలియజేసే ప్రముఖ ఇతివృత్తం ఒకటి... చక్రవర్తిగా లబ్ధప్రతిష్ఠుడైన విశ్వామిత్రుడు ఒకసారి వసిష్ఠుడి ఆశ్రమానికి వెళతాడు. వసిష్ఠుడు రాజుకి అతిథి సత్కారాలన్నీ చేస్తాడు. కందమూలాలు తినే రుషి ఒక చక్రవర్తికి తగిన సత్కారాలన్నీ ఎలా చేశాడు? అని విశ్వామిత్రుడికి సందేహం కలిగింది. అదే విషయాన్ని వశిష్ఠుణ్ని అడిగితే, దానికి కారణం తన హోమధేనువు శబల అని చెబుతాడు. అంత గొప్ప ధేనువు రాజైన తన దగ్గర ఉండటం సమంజసం అంటాడు విశ్వామిత్రుడు. అది హోమధేనువు కనుక ఇవ్వటానికి నిరాకరిస్తాడు వశిష్ఠుడు. దానికి మారుగా ఎన్నో గోవుల్ని ఇస్తానన్నా అంగీకరించడు. విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెళుతుంటే, శబల తన నుంచి సైన్యాన్ని కల్పించి విశ్వామిత్రుడి సేనను సంహరిస్తుంది. విశ్వామిత్రుడు రాజ్యానికి వెళ్లి మళ్లీ సైన్యంతో వచ్చినా ఫలితం ఉండదు.
  • తర్వాత హిమాలయాలకి వెళ్లి శివుడి తపస్సు చేసి అస్త్రాలను పొంది మళ్లీ వచ్చి ఆశ్రమాన్ని ధ్వంసం చేస్తుంటే వశిష్ఠుడు వారిస్తాడు. వినకపోతే తానే బ్రహ్మదండం పట్టుకుని నిలబడతాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన అస్త్రాలన్నీ విఫలమవుతాయి. చివరికి బ్రహ్మాస్త్రం వేస్తే దాన్ని మింగేస్తాడు వశిష్ఠుడు. అప్పుడు విశ్వామిత్రుడు క్షత్రియబలం కన్నా ఒక తపస్వి బలం గొప్పదని అర్థం చేసుకుంటాడు. ఇంద్రియాలను జయించటం వల్లే అంత శక్తి సిద్ధించింది కాబట్టి తానూ ఇంద్రియాలను జయించాలని సంకల్పిస్తాడు. దక్షిణంతో మొదలు, నాలుగు దిక్కుల్లో తపస్సు చేస్తాడు. వరుసగా రాజర్షి, రుషి, మహర్షి, చివరగా బ్రహ్మర్షి అవుతాడు. ఆ క్రమంలో అతను కామాన్ని, క్రోధాన్ని జయిస్తాడు.

అదే వారి తపస్సు!

*మనిషి తనలోని దుర్గుణాలు, దుర్లక్షణాలని సాధన ద్వారా పోగొట్టుకుంటే మహర్షి కావచ్చని విశ్వామిత్రుడి కథ చెబుతుంది. ఇది త్రేతాయుగం నాటి గాథ. కానీ, ఇప్పుడు మనిషి మహర్షి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యోగవాసిష్ఠం కర్కటి ఉపాఖ్యానంలో విషూచిక (కలరా లాంటి వ్యాధి) ఎవరిని హరిస్తుందో ఉంటుంది. చెడు ఆహారం తినేవారు, చెడ్డ పనులు చేసే వారు, చెడు ప్రదేశాలలో ఉండేవారు, దుష్టులని అది తినేస్తుంది.
*ఒక క్రిమి ప్రస్తుతం వణికిస్తోంది! అది దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే పై నాలుగు లక్షణాలని పోగొట్టుకోవాలి - విశ్వామిత్రుడి లాగా. ఇందుకోసం అరణ్యాలకు వెళ్లాల్సిన పనిలేదు. మనసు అదుపులో ఉంటే చాలు!
*మహాభారతంలో కౌశికుడు అనే బ్రహ్మచారి మీద కొంగ రెట్ట వేస్తే దాని వంక కోపంగా చూస్తాడు. అది చనిపోతుంది. అతను గ్రామంలో భిక్షాటనకి వెళితే ఒక గృహిణి భర్త పనుల్లో మునిగి అతణ్ని చాలాసేపు నిలబెడుతుంది. ఆమె వంక కూడా ఆగ్రహంగా చూస్తే, తాను కొంగను కానని అంటుంది. ఆ విషయం ఆమెకెలా తెలిసిందా అని కౌశికుడు ఆశ్చర్యపోతాడు. ‘ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్లు, తెలుస్తుంది’ అంటుందామె. ధర్మవ్యాధుడు ఒక మాంస విక్రేత. కౌశికుడికి ధర్మబోధ చేస్తాడు. ఇక్కడ ఆ మహిళ, ధర్మవ్యాధుడు తమ విధ్యుక్త ధర్మాన్ని త్రికరణశుద్ధిగా నిర్వర్తించారు. అదే వారి తపస్సు. ఇప్పుడైనా, ఎప్పుడైనా మనిషి చేయదగిన తపస్సు ఇది. మానవుడు మనోవాక్కాయ కర్మల ద్వారా చెడు చేయకుండా తన పనుల్ని నిర్వర్తించాలి. అప్పుడు ప్రతి మనిషీ మహర్షిగా రూపాంతరం చెందుతాడు.

ఇదీ చూడండి:బాలయ్య 'శ్రీరామ దండకం'

ABOUT THE AUTHOR

...view details