భూమి పట్టా చేస్తలేరని తహసీల్దార్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని మంజులకు గ్రామ శివారులో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే దీనికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకంలో మాత్రం ఐదు ఎకరాలను మాత్రమే అధికారులు నమోదు చేశారు. మిగిలిన ఏడెకరాల భూమిని కూడా పట్టా చేయాలని నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితంలేదని మంజుల వాపోయారు.
అధికారుల తీరులో తీవ్ర మనస్తాపానికి గురైన మంజుల బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. ఈ క్రమంలోనే బాధితురాలు మంజుల తహసీల్దార్‌తో వాగ్వాదానికి కూడా దిగారు. విషయం తెలుసుకున్న హవేలీ ఘనపూర్ ఎస్ఐ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని మంజులకు నచ్చచెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడ కౌన్సిలింగ్ నిర్వహించారు.