ఓ వివాహితను వేధించి... వెంబడించి... పెళ్లికి నిరాకరించిందనే కక్షతో యాసిడ్ పోసి.. కత్తితో పొడిచి అతి దారుణంగా హతమార్చిన నేరస్థులకు కోర్టు శిక్ష విధించింది. ఒక నేరస్థునికి యావజ్జీవ కారాగార జైలు శిక్ష, అతనికి సహకరించిన మరో నేరస్థునికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.శైలజ శుక్రవారం తీర్పు వెలువరించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం...
వరంగల్ నగరంలోని మట్టెవాడకు చెందిన గొండు సుజాత తన రెండో కూతురు మాధురి(మృతురాలి)ని డోర్నకల్‌కు చెందిన తన తమ్ముడు చంటికి ఇచ్చి 2014లో వివాహం చేశారు. ఆ దంపతులకు ఒక పాప జన్మించింది. ఆ తరువాత 2016లో దంపతుల మధ్య మనస్పర్దలు రావడంతో మాధురి తన పాపతో వచ్చి వరంగల్‌లోని తల్లి వద్ద ఉంటూ ఒక పెట్రోలు పంపులో పని చేసేది. వరంగల్‌లోని సాకరాశికుంటకు చెందిన కలువల చంద్రశేఖర్ తన ఆటోకు పెట్రోల్ కోసం అదే పెట్రోల్ పంపుకు తరచుగా వచ్చేవాడు. అలా అతను ఆమెతో చనువు పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలని నిత్యం వెంబడించాడు. అందుకు ఆమె తిరస్కరించింది. దాంతో అతను ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
స్నేహితులతో కలిసి హత్య..
పెళ్లికి నిరాకరించిందని మాధురిని ఎలాగైనా చంపాలనుకున్న చంద్రశేఖర్ తన మిత్రుడు పొన్నం రాకేశ్(నేరస్థుడు), మరో మిత్రునితో కలిసి ప్రణాళిక రచించాడు. మాట్లాడే పని ఉందని మాధురిని 2017 నవంబరు 29న ఎంజీఎం కూడలి వద్దకు పిలిపించాడు. అక్కడికి వచ్చిన ఆమెను తన ఆటోలో తనతోపాటు వెనుక సీట్లో కూర్చోపెట్టాడు. ఆమెతో చంద్రశేఖర్ మాట్లాడుతుండగానే రాకేశ్ ఆటోను గర్నెపల్లి గ్రామ శివారులోకి తీసుకొచ్చాడు. జనసంచారం లేని ప్రాంతంలో చంద్రశేఖర్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ మూత తీసి ఆమెపై పోశాడు. వెంటనే ఆమె అతణ్ని ఆటో నుంచి నెట్టివేసింది. అతని స్నేహితుడు ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. మృతురాలి తల్లి సుజాత ఫిర్యాదుతో జఫర్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేసుకోగా అప్పటి వర్ధన్నపేట సహాయక పోలీసు కమిషనర్, ప్రస్తుత అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఎ.మధుసూదన్ కేసును దర్యాప్తు చేసి కోర్టులో నేరారోపణ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు ఇద్దరు నేరస్థులకు పై శిక్షలతోపాటు జరిమానా విధించింది. ఈ కేసును ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.బాలకిషన్‌రావు, కానిస్టేబుల్ సీహెచ్.ప్రసాద్ పలువురు సాక్షులను కోర్టులో హాజరుపర్చారు. మృతురాలి కుటుంబీకులకు పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను కోర్టు ఆదేశించింది.
పోలీసులకు సీపీ అభినందనలు..
ఇద్దరు నేరస్థులకు యావజ్జీవ కారాగార జైలు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను నగర పోలీసు కమిషనర్ పి.ప్రమోద్‌కుమార్ అభినందించారు. సరైన సాక్ష్యాధారాలతో కోర్టులో నేరారోపణ పత్రాన్ని దాఖలు చేసిన ప్రస్తుత అనిశా డీఎస్పీ మధుసూదన్‌తోపాటు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ రమేశ్, సీఐ విశ్వేశ్వర్‌రావు, జఫర్‌గఢ్ ఎస్సై కిశోర్‌ను కమిషనర్ అభినందించారు.
ఇదీ చదవండి:బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసులు నమోదు చేసిన పోలీసులు