తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అమానుషం: విషం కలిపి తల్లిని, చెల్లిని కడతేర్చిన కిరాతకుడు - రావల్‌కోల్‌లో తల్లి, చెల్లిని హత్య చేసిన యువకుడు

The young man who killed his mother and sister with poison at Rawalcol, Medchal district
బెట్టింగ్ వద్దన్నందుకు... విషం కలిపి తల్లి, చెల్లిని చంపేశాడు

By

Published : Nov 30, 2020, 9:38 AM IST

Updated : Nov 30, 2020, 11:55 AM IST

09:35 November 30

అమానుషం: విషం కలిపి తల్లిని, చెల్లిని కడతేర్చిన కిరాతకుడు

బెట్టింగ్ వద్దన్నందుకు... విషం కలిపి తల్లి, చెల్లిని చంపేశాడు

బెట్టింగ్‌ వ్యసనం ప్రాణాలను బలితీకుంది. యువతు అత్యాశకు పోయి అప్పులు చేయడమే కాకుండా కుటుంబ సభ్యులనే హతమార్చడం కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం వనస్థలిపురంలో ఒకరు బలికాగా.. మేడ్చల్ మండలం రావల్‌కోల్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు బెట్టింగ్‌కు బానిసగా మారి కుటుంబ సభ్యులనే బలితీసుకున్నాడు.

అసలేం జరిగిందంటే..?

మేడ్చల్ జిల్లా రావల్‌కోల్‌లో దారుణం జరిగింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసైన యువకుడు మానవత్వానికే మచ్చ తెచ్చే అమానుషానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు బెట్టింగ్ వద్దన్నందుకు ఘాతుకానికి పాల్పడ్డాడు. విషం కలిపి తల్లి, చెల్లిని హత్య చేశాడు. నిన్న రాత్రి జరిగిన కిరాతక చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రావల్‌కోల్‌కు చెందిన సాయినాథ్‌రెడ్డి తండ్రి ప్రభాకర్‌రెడ్డి ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. ప్రభాకర్‌రెడ్డి పేరిట ఉన్న బీమా డబ్బు 20 లక్షలు కాజేసేందుకు సాయినాథ్‌రెడ్డి యత్నించాడు. అప్పులు తీర్చేందుకు బీమా డబ్బు కోసం తల్లి, చెల్లిని వేధించాడు. వాళ్లకు తెలియకుండా బ్యాంకులోంచి 20 లక్షలు డ్రా చేశాడు. దీనిపై గొడవ జరగగా.. ఈ నెల 23న భోజనంలో సాయినాథ్‌రెడ్డి రసాయన గుళికలు కలపాడు.. తల్లి, చెల్లి భోజనం చేశాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 27న చెల్లి అనూష మృతి చెందగా.. మరుసటి రోజే ఈ నెల 28న తల్లి సునీత ప్రాణాలు కోల్పోయారు. బంధువులు నిలదీయడంతో నిందితుడు సాయినాథ్‌రెడ్డి నిజాన్ని అంగీకరించాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సాయినాథ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

నిలదీస్తే.. నిజం బయటకు

కుటుంబానికి మంచిపేరు తీసుకురావాల్సిన యువకుడు జూదానికి బానిసగా మారి జులాయిగా తయారయ్యాడు. లక్షల్లో బెట్టింగ్‌లు పెట్టి ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు నగలను కూడా అమ్మి బెట్టింగ్ ఆడాడు. ఈ విషయం తెలిసిన తల్లి, చెల్లి నిలదీయగా.. అ‌డ్డు తొలగించాలని భావించిన సాయినాథ్‌రెడ్డి భోజనంలో రసాయన గుళికలు కలిపి దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యులే ఆత్మహత్యాయత్నం చేశారని నమ్మించే ప్రయత్నం చేశాడు. బంధువులు నిలదీయగా నిజం ఒప్పుకున్నాడు.

వ్యసనానికి బానిసై...

ఎంటెక్‌ చదివి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సాయినాథ్‌రెడ్డి.. కుటుంబానికి మంచి పేరు తీసుకువస్తాడని తల్లిదండ్రులు ఎన్నో కలలుకన్నారు. చివరకు బెట్టింగ్‌ వ్యసనానికి బానిసగా మారి వాళ్లనే బలి తీసుకున్నాడు. కన్న కొడుకే విషం పెట్టాడని తెలియని తల్లి.. అన్నం తినగానే కడుపునొప్పి వచ్చిందని.. ఆ భోజనం చేయవద్దని అతనికే చెప్పారు. కానీ, అదే అన్నంలో విషం పెట్టింది తన కుమారుడేనని.. తన అన్ననే ఈ పనిచేశాడని వాళ్లు తెలుసుకోలేక పోయారు. చివరకు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచారు.

నిందితుడు సాయినాథ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరగ్గా.. అది అవాస్తవమని పోలీసులు వెల్లడించారు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నాడని తెలిపారు.

Last Updated : Nov 30, 2020, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details